బాబుకు చుక్కలు చూపించనున్న జగన్

ఏపీ తెలుగు తమ్ముళ్లకు జగన్ ఫోబియా మొదలైంది. త్వరలో మొదలు కానున్న జగన్ పాదయాత్ర కొత్త గుబులుకు కారణంగా చెప్పాలి. తొమ్మిదిన్నరేళ్ల చంద్రబాబు పాలనకు చెక్ చెప్పిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాడు జరిపిన పాదయాత్ర అప్రయత్నంగా తెలుగు తమ్ముళ్లకు గుర్తుకు వస్తోంది. ఎందుకంటే.. నాటికి.. నేటికి పరిస్థితుల్లో పెద్ద తేడా లేదన్నది వారి భావిస్తుండటమే.

గడిచిన మూడున్నరేళ్ల వ్యవధిలో పెరిగిన అవినీతి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతల తీరు.. బాధ్యతగా పని చేయని అధికారులు.. అమరావతి మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు పట్టకపోవటం.. ఎంతసేపటికి మాటల హడావుడి తప్పించి.. చేతల్లో ఏమీ చేసి చూపించకపోవటం.. పెరిగిన ధరలు.. అభివృద్ధిలో ఎలాంటి మార్పు లేకపోవటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇలాంటి వేళ షురూ కానున్న జగన్ పాదయాత్ర పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్న భావన తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. బాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతూ.. ఆయన పనితీరుపై అపనమ్మకం పెరుగుతున్న వేళ జగన్ రోడ్ల మీదకు రావటం.. సుదీర్ఘకాలం ప్రజల మధ్యన ఉండటం తమకు తలనొప్పిగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓపక్క జగన్ పాదయాత్ర చేస్తూనే.. మరోపక్క మిగిలిన జిల్లాల్లో పార్టీ నేతలతో వివిధ కార్యక్రమాల్ని నిర్వహించేలా ప్లాన్ చేయటం ఏపీ అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే వీలుంది. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చే స్పందనకు సీఎం చంద్రబాబు కుతకుతలాడిపోవటం ఖాయమని.. ఏతావాతా ఆ ఒత్తిడి అంతా తమ మీదే రుద్దుతారని తమ్ముళ్లు వాపోతున్నారు. అధినేత తీరు మార్చుకోకుండా.. పాలనలో వేగం పెంచని బాబు తీరుకు తామంతా మాట పడాల్సి వస్తుందన్న అసంతృప్తిని పలువురు టీడీపీ నేతలు లోగుట్టుగా చెప్పుకోవటం కనిపిస్తుంది. ఏదైనా మంచి జరిగితే ఆ క్రెడిట్ అంతా తనదేనని చెప్పుకునే చంద్రబాబు.. నష్టం జరిగినప్పుడు మాత్రం బాధ్యత తమ ఖాతాలో రాసేస్తారని.. జగన్ పాదయాత్రతో అది మరికాస్త ఎక్కువ అవుతుందన్న ఆందోళనను తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.

పాదయాత్రతో పాటు.. రెండంచల విధానంలో జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కార్యక్రమాలు భారీగా నిర్వహించాలన్న జగన్ ప్లాన్ కారణంగా.. మీడియా ఫోకస్ మొత్తం జగన్ అండ్ కో మీద ఉండే అవకాశం ఉందంటున్నారు . సహజంగానే ఇలాంటివి చంద్రబాబుకు చిరాకు పుట్టిస్తాయని.. అంతిమంతా తమ్ముళ్ల మీద విరుచుకుపడటం ఖాయమన్న మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top