పొలిటికల్ పంచ్ లో సాక్షి హస్తం ఉందా?

విజయవాడ: పొలిటికల్ పంచ్ ఫేస్‌బుక్ పేజ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద, ఆయన కుమారుడు నారా లోకేష్ మీద సెటైర్లు వేసినందుకే ఇంటూరి రవి కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి తెర దించుతూ అసలు కారణం ఇదంటూ వివరణ ఇచ్చే పని సాగుతోంది.

పెద్దల సభను, అంటే శాసన మండలిని కించపరుస్తూ కార్టూన్ వేసినందుకే రవికిరణ్‌ను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. గతంలో రాజ్యసభ విషయంలో రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రికలో వచ్చిన శీర్షికపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆ శీర్షిక పెట్టినందుకు రామోజీ రావు విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది.

చట్టసభలను కించపరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రవికిరణ్‌ పోలిటికల్ పంచ్ కార్టూన్‌పై ఎవరు ఫిర్యాదు చేశారనేది కూడా ఇప్పటి దాకా ముందుకు రాలేదు. అసెంబ్లీ కార్యదర్సి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవికిరణ్‌ను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.

వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మంత్రి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ హెచ్చరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు, లోకేష్‌పై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతూ కార్టూన్లు పోస్ట్ చేస్తున్న పొలిటికల్ పంచ్ ఫేస్‌బుక్ పేజ్‌పై ప్రభుత్వం కొరడా ఝలిపించిందని అంటున్నారు. ఈ పేజ్‌ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

రవికిరణ్‌ అరెస్టును సమర్థించుకోవడానికి వెంటనే సోషల్ మీడియాలోనూ, వార్తాసంస్థల మీడియాల్లోనూ కథనాలు రావడం ప్రారంభమైంది. పోలీసులు అతనిని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయని చెబుతున్నారు. వైయస్ జగన్ నేతృత్వంలోని సాక్షికి అనుబంధంగా వైసీపీ సోషల్‌ మీడియా టీమ్‌ ఉందని, ప్రత్యర్థి పార్టీలపై ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెట్టడమే వీరి పనని తేలినట్లు చెబుతున్నారు. ఈ టీమ్‌కు జగన్ మీడియా హౌస్ సాక్షి నుంచే జీతాలు చెల్లిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని అంటున్నారు. ఈ విషయంపై ఈడీకి ఫిర్యాదు చేయాలని పోలీసులు భావిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

పెద్దల సభను కించపరుస్తూ కార్టూన్‌ వేయడంతో అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్ట సభలను కించపరిస్తే ఎవరిపై నైనా చర్య తీసుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ చెప్పారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌, మంత్రులను కించపరుస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.

అభ్యంతరకర సీన్లు ఉన్న సినిమాలకు, హింస ఎక్కువగా ఉన్న సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఏ సర్టిఫికెట్ అనే పదాన్ని పేర్కొంటూ, దాన్ని చట్ట సభలపై ముద్రించడంతో మండలి చైర్మన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మండలి చైర్మన్ సలహాతో అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ పోలీసులకు, డీజీపీకి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. దీంతో పొలిటికల్ పంచ్ పేజ్ అడ్మిన్ రవికిరణ్‌ను పోలీసులు శుక్రవారం హైద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతనిని అమరావతికి తరలిస్తున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top