ఇంటర్ విద్యార్థిని చాందిని హత్యకేసులో తాజా అప్డేట్స్..

హైదరాబాద్‌: నగరంలోని మియాపూర్‌ మదీనాగూడలో దారుణం జరిగింది. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు యువతిని హత్యచేసి.. మృతదేహాన్ని అమీన్‌పూర్‌ కొండల్లో పడేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం తెలిసింది. మృతురాలు చాందిని బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదువుతుందని పోలీసులు గుర్తించారు. ఈ నెల 9న కాలేజీకి వెళ్లిన యువతి ఇంటికి తిరిగిరాలేదని యువతి తల్లిదండ్రులు చెబుతున్నారు.

మద్యం ప్రియులకు అడ్డా అమీన్‌పూర్ గుట్ట..
అమీన్‌పూర్ గుట్టకు మద్యం ప్రియులు, అసాంఘీక కార్యకలాపాలు జరిపేవారు ఎక్కువగా వచ్చిపోతుంటారు. ఉదయం 11గంటల సమయం దాటిందంటే చాలు ఈ గుట్టకు మద్యం ప్రియులు బారులు తీరుతారు. అయితే సాయంత్రం సమయంలో చాందినితో పాటు మరో ముగ్గురు యువకులు ఈగుట్టవైపు వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దర్యాప్తులో మాత్రం సీసీ పుటేజీలనే కీలకంగా తీసుకుంటున్నారు.

సీసీటీవీ పుటేజీ సేకరణ..
అమీన్‌పూర్ గుట్టలను ఆనుకుని వున్న ఓ అపార్ట్‌మెంట్, మదీనగూడలోని హుండాయ్ షోరూమ్, రోడ్డులో ఉన్న సీసీటీవీ పుటేజీను పోలీసులు సేకరించారు. చాందినితో ఉన్న యువకులెవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకులతో కలిసి చాందిని వెళ్లిందా లేకుంటే.. చాందినీని యువకులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

గుట్టల్లోకి ఎందుకు వెళ్లాల్సివచ్చింది.. !
అయితే ఇంటర్ విద్యార్థిని చాందిని అమీన్‌పూర్ గుట్టల్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. వెళ్లేముందు ఎవరెవరితో ఫోన్ మాట్లాడిందన్న సమాచారాన్ని మొత్తాన్ని సేకరించే పనిలో సైబరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా చాందిని మృతదేహాన్ని గుట్టల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నచోట మద్యం బాటిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ మద్యం బాటిళ్లకు ఉన్న లేబుల్స్‌ను క్లూస్ టీం సేకరించింది. లేబుల్స్ ఆధారంగా ఏ షాపులో ఈ మద్యం కొన్నారనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. మద్యం షాపు దగ్గర కూడా సీసీటీవీ పుటేజీని సేకరించిన అనంతరం కేసును పోలీసులు చేధించే అవకాశముంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top