చీర రచ్చ: ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్లిందిగా

బతుకమ్మ పండక్కి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేయాలన్న ఎపిసోడ్ ఒకలా మొదలై మరోలా టర్న్ తీసుకోవటం తెలంగాణ అధికారపక్షంలో కొత్త గుబులుగా మారింది. చీరల పంపిణీ వ్యవహారం ఎక్కడో మొదలై మరెక్కడికో వెళ్లిందన్న అభిప్రాయం తెలంగాణ అధికారపక్ష నేతల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్ ఏం ఆలోచించినా దాని వల్ల మేలు జరుగుతుందే తప్పించి.. చేటు జరగదన్న నమ్మకం ఉంది. అయితే.. ప్రాజెక్టుల రీడిజైనింగ్.. నేరెళ్ల ఎపిసోడ్.. తెలంగాణ విమోచన దినోత్సవం మీద తీసుకున్న స్టాండ్.. తాజాగా చీరల పంపిణీ వ్యవహారం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారటం అసంతృప్తికి గురి చేస్తుందని చెబుతున్నారు.

చీరల పంపిణీ రసాభాసగా మారటానికి కారణం.. ఈ వ్యవహారంపై కేసీఆర్ క్రియేట్ చేసిన హైపేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆడబిడ్డలకు చీరలు ఇస్తామన్న కేసీఆర్ మాటతో పాటు.. ఆయన చెప్పే సంపన్న రాష్ట్ర మాటలు మహిళల్లో అంచనాలు భారీగా పెరగటానికి కారణమయ్యాయని చెబుతున్నారు.

దీనికి తోడు సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవటం కోసం ఇంత భారీ కార్యక్రమాన్ని చెప్పటం తొలుత హర్షం వ్యక్తమైనా.. తాము అనుకున్న చీరలు లభ్యం కాకపోవటంతో సిరిసిల్ల నుంచి సూరత్ నుంచి చీరలు చెప్పించే ప్రయత్నం చేశారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు మొదలెట్టిన చీరల పంపిణీ కార్యక్రమం చివరకు సూరత్ సేట్ లకు ప్రయోజనకరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిరిసిల్ల చేనేత చీరలన్న వెంటనే ఒక స్థాయిలో ఉంటుంది. అందుకు భిన్నంగా సూరత్ చీరలు ఉండటంతో మహిళల ఆగ్రహానికి కారణమైందని చెప్పొచ్చు. రూ.220లకు పైనే ఒక్కో చీరకు సూరత్ వస్త్ర వ్యాపారుల వద్ద కొనుగోలు చేసినట్లు చెబుతున్నా.. వాస్తవంలో ఆ చీరలు రూ.50 నుంచి రూ.100 లోపు మాత్రమే ఉంటాయన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఏమైనా భారీ ఇమేజ్ తమ ఖాతాలో పడుతుందని.. చీరల పంపిణీ హిట్ అయితే.. ప్రతి ఏటా అదే విధానాన్ని పాటించటం ద్వారా ఎన్నికల వేళ ఈ వ్యవహారం మరింత లబ్థి చేకూరుతుందని భావించిన వారికి.. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు.. మహిళల ఆగ్రహాన్ని కళ్లకు కట్టేలా చూపిస్తున్న వీడియోలు గులాబీ నేతల గుండెల్లో మరింత గుబులు రేపుతున్నాయని చెప్పాలి. సొమ్ములు సూరత్ సేట్లకు.. షాకులు తమ పార్టీకి మిగిలాయన్న భావనను తెలంగాణ అధికారపక్షానికి చెందిన కొందరు నేతలు వ్యక్తం చేయటం గమనార్హం. చీరలు తమ ఇమేజ్ ను చించేశారన్న చింత గులాబీ దళంలో మొదలైందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top