రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం

భారత దేశ 14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభ‌మైంది. ఉదయం10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఎన్డీఏ తరఫున రామ్‌నాథ్‌ కోవింద్‌, విపక్షాల నుంచి మీరా కుమార్‌ పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ఎంపీలు ఆకుపచ్చ రంగు బ్యాలెట్‌ పత్రాలపై ఓట్లు వేస్తారు. శాసనసభ్యుల కోసం గులాబీ రంగులో బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు. ఎంపీల ఓట్లకు స్థిర విలువ ఉన్నా- శాసనసభ్యుల ఓట్లకు మాత్రం వారి రాష్ట్రాలను బట్టి విలువ మారిపోతుంది కాబట్టి వేర్వేరు రంగుల బ్యాలెట్లను సిద్ధం చేశారు. కేవలం ఈసీ సరఫరా చేసే ప్రత్యేక కలాలతో నమోదు చేస్తేనే ఓట్లు చెల్లుతాయి. దీనికి వీలుగా ఓటర్లు ఆయా పోలింగ్‌ కేంద్రాల లోపలకు వెళ్లే సమయంలోనే వారి వద్ద ఉండే వ్యక్తిగత కలాలను పోలింగ్‌ సిబ్బంది తీసుకుని వీటిని అందిస్తారు. ఓటు వేసి వారు బయటకు వచ్చే సమయంలో ప్రత్యేక కలాలు సేకరించుకుని, వ్యక్తిగత కలాలను వాపసు ఇస్తారు. గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హరియాణాలో తలెత్తిన సిరా వివాదం నేపథ్యంలో ఈసారి ప్రత్యేక కలాలను వాడాలని ఈసీ నిర్ణయించింది. వూదా రంగు సిరాతో పనిచేసే ఈ కలాలకు ప్రత్యేక క్రమ సంఖ్య ఉంటుంది. ఈసీకి సిరా సరఫరా చేసే మైసూరు కర్మాగారమే వీటినీ సమకూర్చింది.

పోలింగ్‌ కేంద్రాలు 32
ఎన్డీఏ తరఫున రామ్‌నాథ్‌ కోవింద్‌, విపక్షాల నుంచి మీరా కుమార్‌ పోటీ చేస్తున్న ఈ ఎన్నికల నిమిత్తం పార్లమెంటు భవనంలో ఒకటి, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో ఒక్కొక్కటి చొప్పున 31... మొత్తం 32 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్కరు, పార్లమెంటులో ఒక్కో సభకు ఒక్కొక్కరు చొప్పున పోలింగ్‌ పర్యవేక్షణకు 33 మంది పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఎంపీలంతా పార్లమెంటు ప్రాంగణంలోనే ఓట్లు వేయాల్సి ఉంది. వీరిలో 55 మంది మాత్రం ఈసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకుని తమకు అందుబాటులో ఉన్న రాష్ట్రాల శాసనసభల్లో ఓట్లు వేయబోతున్నారు. వీరిలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఉన్నారు. ఈ ముగ్గురూ ఇంకా ఎంపీలుగా కొనసాగుతున్నారు. అయిదుగురు శాసనసభ్యులు పార్లమెంటు భవనంలో, నలుగురు శాసనసభ్యులు తాము ఎన్నికైన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలోని శాసనసభల్లో ఓట్లు వేయనున్నారు. ఈ ఎన్నికల్లో శాసనకర్తలు వేరే ప్రాంతాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకూ హక్కు ఉంది. ఈసారి 14 మంది రాజ్యసభ సభ్యులకు, 41 మంది లోక్‌సభ సభ్యులకు ఇలాంటి వెసులుబాటును కల్పించారు. అన్ని చోట్ల నుంచి బ్యాలెట్‌ పెట్టెల్ని దిల్లీకే తీసుకువచ్చి, ఈ నెల 20న ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఓటర్లు 4896 మంది: రాష్ట్రపతిని ఎన్నుకునే అర్హత 4896 మంది ప్రజా ప్రతినిధులకు ఉంది. నామినేటెడ్‌ సభ్యులు మినహా మిగిలిన చట్టసభ సభ్యులు ఓటర్లుగా ఉంటారు.

వీరికి మాత్రం ఓటు హక్కు లేదు...
రాష్ట్రపతిని ఎన్నుకునేవారిలో 233 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్‌సభ సభ్యులు, 4120 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆంగ్లో-ఇండియన్ల తరఫున లోక్‌సభకు నామినేట్‌ అయ్యే ఇద్దరు సభ్యులు, రాజ్యసభలో ఉండే 12 మంది నామినేటెడ్‌ సభ్యులు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి అనర్హులు. రాష్ట్రాల శాసనమండళ్ల సభ్యులకూ ఓటుహక్కు లేదు. ఎన్నికను రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించనున్నందువల్ల ఫలానా అభ్యర్థికే ఓటు వేయాల్సిందిగా ఏ పార్టీ కూడా తమ సభ్యులకు విప్‌ జారీ చేయడం కుదరదు. ఏ అభ్యర్థీ తాము ఫలానా వారికి ఓటు వేశామని వెల్లడించడానికి వీల్లేదు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top