ఇంజినీరింగ్‌ కళాశాలల్లో భారీగా పెరుగుతున్న రుసుములు

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో భారీగా పెరుగుతున్న రుసుములు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దడ పుట్టిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రుసుములు తమకు గిట్టుబాటు కావనీ, వాటిని పెంచాలంటూ ఆయా కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ ఆదేశాలు తెచ్చుకుంటున్నాయి. ప్రవేశాలు పొందినప్పుడు ఉన్న రుసుములకు రెట్టింపు పెంచుతున్నట్లు యాజమాన్యాలు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు కళాశాలల ఎదుట ఆందోళనలకు దిగుతున్నారు. గతంలో వాసవి, శ్రీనిధి కళాశాలలు న్యాయస్థానం తీర్పుతో రుసుములను పెంచగా.. తాజాగా సీబీఐటీ, ఎంజీఐటీలు కోర్టు తీర్పు ద్వారా రెట్టింపు చేశాయి. దీనిపై అప్పీల్‌కు వెళతామని, సుప్రీంకోర్టు వరకు పోరాడతామని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది జూన్‌లో 2016-17 నుంచి 2018-19 విద్యా సంవత్సరం వరకు మూడేళ్లపాటు అమల్లో ఉండేలా రుసుముల్ని టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్దేశించగా, ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితే తమకు రుసుములు పెంచాలంటూ వాసవి, శ్రీనిధి కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. రూ.97 వేలు ఉన్న రుసుముల్ని శ్రీనిధికి రూ.1.37 లక్షలకు, వాసవి కళాశాలకు రూ.1.60 లక్షలకు పెంచుకునేందుకు అనుమతిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీనిపై టీఏఎఫ్‌ఆర్‌సీ అప్పీల్‌కు వెళ్లగా, తుదితీర్పు వెలువడాల్సి ఉంది. తాజాగా సీబీఐటీ, ఎంజీఐటీ విద్యాసంస్థలూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కోర్టు తీర్పు మేరకు రుసుమును రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు సీబీఐటీ యాజమాన్యం ప్రకటించింది. ఎంజీఐటీ కూడా రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు రుసుములు పెంచుకునేందుకు కోర్టు ఉత్తర్వులు వచ్చినట్లు టీఏఎఫ్‌ఆర్‌సీ వర్గాలు తెలిపాయి. సీబీఐటీ యాజమాన్యం రుసుముల పెంపును ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తాము చేస్తున్న వ్యయం ఆధారంగానే రుసుములు పెంచుకునేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చిందని ఆ కళాశాల యాజమాన్యవర్గాలు తెలిపాయి.రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఇచ్చే వరకు వసూలు చేయరాదని, తాము అప్పీల్‌కు వెళతామని టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారి ఒకరు తెలిపారు. ముందుగా నిర్దేశిత రుసుములకు అంగీకారం తెలిపిన యాజమాన్యాలు.. తమపై ఒత్తిడి వల్లే సంతకాలు పెట్టామంటూ చెప్పుకుంటున్నాయని టీఏఎఫ్‌ఆర్‌సీ వర్గాలు చెబుతున్నాయి.

సీబీఐటీలో విద్యార్థుల ధర్నా

సీబీఐటీ కళాశాలలో ఏకపక్షంగా రుసుములు పెంచడాన్ని నిరసిస్తూ బుధవారం విద్యార్థులు రోడ్డెక్కారు. ఇంజినీరింగ్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల రుసుముల్ని రూ.1.13 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచడంతో యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇన్‌స్పెక్టర్‌ రమణగౌడ్‌ విద్యార్థులకు నచ్చజెప్పి కళాశాల ఆవరణలోకి పంపించగా అక్కడా ధర్నాకు కూర్చున్నారు. 9న యాజమాన్య కమిటీ సమావేశమై చర్చిస్తుందని, విద్యార్థుల నుంచి ముగ్గురు ప్రతినిధులు తమ అభిప్రాయాలను వివరించాలని ప్రిన్సిపల్‌ రవీందర్‌రెడ్డి సూచించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top