మన ఐటీ ఎగుమతుల విలువ రూ.56 వేల కోట్లు

కరీంనగర్‌: ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌.. ఇవన్నీ న్యూటన్‌ వంటి మేధస్సు ఉన్న వాళ్లు కనుగొన్నవి కావు. మనలాంటి వారే ప్రత్యేక శ్రద్ధతో ఆవిష్కరించినవి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాటిని వినియోగిస్తున్నారు. ఆవిష్కర్తలు రూ.కోట్లు ఆర్జిస్తున్నారు.. మనం కూడా వారిలాగే ప్రపంచవ్యాప్త ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరీంనగర్‌లో రూ.25 కోట్లతో నిర్మించనున్న ఐటీ టవర్స్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడారు. మేధో ప్రపంచంలో పోటీ పడాలంటే మనం ఆ స్థాయిలోనే తర్ఫీదు పొందాలని అప్పుడే ఇతర ప్రాంతాలు.. దేశాల వారితో పోటీలో నిలవగలమన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు మన ఐటీ ఎగుమతుల విలువ రూ.56 వేల కోట్లుంటే 2020 నాటికి రెట్టింపు చేస్తామని చెప్పామని.. మూడేళ్లు తిరిగేసరికి రూ.87 వేల కోట్లకు పెంచామన్నారు. హైదరాబాద్‌తో పాటు టైర్‌-2 నగరాలైన వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ల్లో ఐటీ పరిశ్రమలకు శంకుస్థాపనలు చేశామని, ఆలస్యమైనా ఇప్పుడు కరీంనగర్‌లో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నామన్నారు. తొలి రోజే ఎనిమిది కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని.. వెయ్యి ఉద్యోగాలకు అవకాశం కలిగిందన్నారు. మరో టవర్‌ నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఉద్యోగాలు సృష్టించాలనుకునే వారికోసం.. ఉద్యోగాలు చేయాలనుకునే వారి కోసం టీ-హబ్‌, టాస్క్‌లను ఇక్కడ నెలకొల్పుతామని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ఏడాదికి లక్ష ఉద్యోగాలను మించి ఇవ్వలేదని.. ఈ మూడేళ్లలో ఐటీలో ప్రత్యక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించామన్నారు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకునేందుకు వీలుగా శిక్షణ ఇస్తున్నామని.. శాటిలైట్‌ ద్వారా విద్యా, నిపుణ ఛానెళ్లతో ఐఐటీ, గ్రూప్స్‌, సివిల్స్‌ వంటి వాటికి పైసా ఖర్చు లేకుండా శిక్షణ తీసుకునే అవకాశం కల్పించామన్నారు. కేసీఆర్‌ వంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టమని కేంద్ర మంత్రులు పొగుడుతున్నారని.. ఇక్కడ భాజపా నాయకులు గల్లీల్లో అర్ధం లేని ఆందోళనలు చేస్తున్నారన్నారు. 24 గంటల కరెంటు సరఫరాను హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌ స్వాగతిస్తూ లేఖ రాశారని.. కొందరు నాయకులు మాత్రం ఇష్టారీతి విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో నీళ్లు.. నిధులు.. నియామకాల నినాదాన్ని తీసుకొన్నామని.. నిధులు మన చేతిలో ఉన్నాయని... నీళ్లు తెచ్చే ప్రక్రియ తుది దశకు చేరిందని.. ఇప్పుడు నియామకాల ప్రక్రియ ఆరంభమైందన్నారు.

ఎంపీ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలి, పార్లమెంటు చర్చల్లో తెలంగాణ ముద్ర వేశామని.. యువ తరం తమ ఆలోచనలు.. ఆవిష్కరణలతో ప్రపంచంపై తెలంగాణ ముద్రవేయాలని కోరారు.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ తొమ్మిది నెలల్లో ఐటీ టవర్స్‌ పూర్తి చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సభలో సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు టి.భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, ఐడీసీ ఛైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, ఎండీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఆర్పీలకు వేతనాల పెంపు ఐటీ టవర్స్‌ శంకుస్థాపన, బహిరంగ సభ అనంతరం మంత్రులు కేటీఆర్‌, ఈటల కరీంనగర్‌లో కరీంనగర్‌ సిటీ రెన్నోవేషన్‌ (కేసీఆర్‌) కింద రూ.250 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులు, నగరపాలక కార్యాలయంలో పౌర సేవా కేంద్రం, రూ.25 కోట్లతో చేపట్టే భూగర్భ డ్రైనేజీ పనులు, ఓపెన్‌ జిమ్‌, శానిటేషన్‌ న్యాప్‌కిన్‌ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మహిళా సంఘాల్లోని రీసోర్స్‌ పర్సన్లు (ఆర్పీలు) వీఆర్‌ఏలతో సమానంగా వేతనాలు ఇచ్చే బాధ్యత తమపై ఉందన్నారు... రాష్ట్రంలో 4,800 మంది ఆర్పీలకు ఇది శుభవార్త అన్నారు. మెప్మాలో పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన హెచ్‌ఆర్‌ పాలసీ త్వరలోనే వర్తింపజేస్తామని.. పురపాలక శాఖ సంచాలకురాలు శ్రీదేవి ఆదేశాలు జారీ చేస్తారని తెలిపారు. పట్టణాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగేందుకు వార్డు, ఏరియా కమిటీలు వేయాలన్నారు. ఇందులో ఎన్జీవోలు, విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, సీఆర్పీలు భాగస్వాములుగా ఉండాలన్నారు. వెంటనే అమలు జరిగేలా చూడాలని పురపాలక శాఖ సంచాలకురాలు శ్రీదేవికి ఆదేశాలు జారీ చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top