నేను ఎవరి పక్షం కాదు...నేను ప్రజల పక్షం

లాభాల బాటలో ఉన్న డ్రెడ్జింగ్‌ కార్పొరేష‌న్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ)ను ప్రైవేటీకరించడం సరికాదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్‌ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘డీసీఐని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తామనడం సరికాదు. సంస్థ ఎదుగుదల వెనుక వెయ్యి మంది ఉద్యోగుల కష్టం ఉంది. ప్రజా సమస్యల నుంచి స్థానిక ఎంపీలు కంభంపాటి హరిబాబు, అవంతి శ్రీనివాస్‌ తప్పించుకుని తిరుగుతున్నా జనసేన వదిలిపెట్టదు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేనివారికి 2019లో ఓట్లు అడిగే హక్కు లేదు. నేను భాజపా, తెదేపా, ఇతర ఏ రాజకీయ పార్టీ పక్షం కాదు. నేను ప్రజల పక్షం. డీసీఐ ఉద్యోగులకు నా నైతిక మద్దతు ప్రకటిస్తున్నా. ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించేందుకే విశాఖ వచ్చా. వారి బాధలు పంచుకునేందుకు జనసేన ఉంది‘.

ప్రజలే నాకు బంధువులు

మోదీ, చంద్రబాబు నాకు బంధువులు కారు. ప్రజలే నాకు బంధువులు, స్నేహితులు. ప్రజలకు మేలు చేస్తారనే గత ఎన్నికల్లో వారికి మద్దతిచ్చాను గానీ వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. గత ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తే గెలిచిన నేతలు ఇప్పుడు నేనెవరో తెలీదంటున్నారు. అయినా నేను బాధపడను. నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోను. సమస్య శాంతియుతంగా పరిష్కారం అవ్వాలనే కోరుకుంటాను. నాకు భయం లేదు. ధైర్యం ఉంది. సమస్యల నుంచి పారిపోను. బాధ్యతల నుంచి తప్పించుకోను.

నిర్మాణాత్మక రాజకీయాలకే మద్దతు

డీసీఐ ఉద్యోగులు ఈరోజు రోడ్డెక్కారంటే అది ప్రభుత్వ వైఫల్యమే. వైకాపా అధినేత జగన్‌ డీసీఐ ఉద్యోగులకు మద్దతు ప్రకటించాలి. ఏదైనా సమస్య గురించి చెబితే నేను ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తా.. అన్న మాటలు నాకు నచ్చవు.నిర్మాణాత్మక రాజకీయాలు చేసేవారికి నేను మద్దతిస్తా. పదవి లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడటమే నా ధ్యేయం. దెబ్బలు తిన్నవారు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చూపిస్తా. కేంద్ర ప్రభుత్వం డీసీఐను ప్రైవేటీకరిస్తోంది. ప్రత్యేక హోదాను సాగదీస్తోంది. ఇలాగే కొనసాగితే విశాఖ స్టీల్‌, ఎయిరిండియాను కూడా పైవేటు వ్యక్తులకు అప్పగించేస్తారు.

నాది ప్రజల పార్టీ

నాది ప్రజల పార్టీ. ఈ పార్టీకి కులాలు, మతాలు ఉండవు. ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ధ్యేయం. ప్రజలకు నష్టం కలిగించే ఏ పార్టీకి మద్దతు ఇవ్వను. 2019లో ఎన్నికలు వస్తున్నాయన్న సంగతి ప్రస్తుత ప్రభుత్వాలు మరిచిపోకూడదు. ప్రజలను పట్టించుకోకపోతే వారే తగిన గుణపాఠం చెబుతారు. ప్రజా సమస్యల నుంచి తప్పించుకున్న ప్రతి ప్రజాప్రతినిధి సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుంది.

మోదీకి లేఖ రాశా

డీసీఐ ఉద్యోగుల సమస్యలపై ప్రధాని మోదీకి లేఖ రాశాను. డ్రెడ్జింగ్‌ కార్పొరేష‌న్‌ను ఎందుకు ప్రైవేటీకరించకూడదో వివరించాను. దానికి చెల్లించాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరాను. సమస్యను పరిష్కరిస్తారా? లేదా? అన్నది వారికే వదిలేస్తున్నా. ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే మాత్రం భాజపా ఓటమి విశాఖ నుంచే మొదలవుతుంది. మోదీతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలపై నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాను. మోదీని నేను ఇప్పటివరకు ఏమీ అడగలేదు. నా తొలి డిమాండ్‌ను నెరవేరుస్తారో లేదో చూడాలి.

నాకు పదవులొద్దు

పవన్‌ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు ‘సీఎం.. సీఎం’ అంటూ అరవడంపై పవన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇతరులు చేసే తప్పునే మీరూ చేయకండి. అధికారానికి అనుభవం కావాలి. నేను తలుచుకుంటే ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవగలను. కానీ నాకు పదవి ముఖ్యం కాదు. ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం’ అని అభిమానులతో అన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top