ఈ వీడియో కన్నీళ్లు తెప్పిస్తుంది.. స్ఫూర్తి రగలిస్తుంది!

ఓ చిన్నారి కష్టాన్ని చూసి బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్రా చలించిపోయారు. ఎంతగా అంటే.. ఆమె నుంచి తను కూడా స్ఫూర్తి పొందినట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆ చిన్నారి కష్టం చూశాక ప్రపంచంలో మరేదీ కష్టం అనిపించదని మహీంద్రా తెలిపారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి వీడియోను ఆయన షేర్‌ చేశారు.

మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. దీనిలో ఓ చిన్నారి పదేపదే జారుడుబల్ల ఎక్కి జారుతూ ఆనందంగా ఆడుకుంటుంది. అక్కడికి వచ్చిన మరో చిన్నారికి కాళ్లు, చేతులు లేవు. అయినా జారుడు బల్ల ఎక్కాలనే ఆశ మాత్రం ఆ చిన్నారిలో కనిపించింది. ఆ పసిదాని బలమైన కోరిక ముందు అంగవైకల్యం కూడా చిన్నబోయింది. ఎంతో కష్టపడి ఆ చిన్నారి జారుడు బల్ల ఎక్కి అక్కడి నుంచి జారింది. ఆ సమయంలో చిన్నారి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రా పోస్టు చేస్తూ.. ‘ముందు నేను చూడలేకపోయా.. ఆ తర్వాత పూర్తిగా చూసి ఆశ్చర్యపోయా. ఇక ప్రపంచంలో ఏ పనైనా కష్టమైనది అని నేనేప్పటికీ భావించను’ అని ట్వీట్‌ చేశారు.

కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది. చిన్నారి ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఎందరికో ఈ చిన్నారి స్ఫూర్తిదాయకం అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top