‘బ్యూటీ’ కి‘లేడీ’ చిక్కింది!

సిటీబ్యూరో : కేవలం బ్యూటీపార్లర్లే టార్గెట్‌గా రెచ్చిపోతూ... మూడు కమిషనరేట్ల అధికారుల్నీ ముప్పుతిప్పలు పెట్టిన కి‘లేడీ’ ఎట్టకేలకు చిక్కింది. నాలుగు నెలల్లో 25కు పైగా నేరాలు చేసిన ఈ ‘చెన్నై చంద్రాన్ని’ నార్త్‌జోన్‌ పరిధిలోని మారేడ్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితురాలిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్న పోలీసులు ఈ వ్యవహారాల్లో ఆమె భర్త పాత్రను ఆరా తీస్తున్నారు. ఈమె తమిళనాడులోనూ అనేక నేరాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన డేసీ తండ్రి కొన్నేళ్ల క్రితం తమిళనాడుకు వలస వెళ్లి చెన్నైలో స్థిరపడ్డాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తన కుమార్తె డేసీని అదే తరహా కుటుంబానికి చెందిన వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం చేశాడు. జల్సాలకు అలవాటుపడిన డేసీ తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలను అన్వేషించింది. ఈ నేపథ్యంలోనే బ్యూటీపార్లర్స్‌ను టార్గెట్‌గా చేసుకుంటే తేలిగ్గా చోరీలు చేయవచ్చని నిర్ణయించుకుంది. కాలనీల్లో, సీసీ కెమెరాలు వంటివి లేని పార్లర్స్‌ను, కేవలం ఒకే మహిళ నేతృత్వంలో నడుస్తున్నవి ఎంచుకునేది. నేరం చేయడం తేలిక కావాలని, చేసిన తర్వాత తనను పట్టుకోవడానికి ఎలాంటి ఆధారాలు ఉండకూడదని ఈ జాగ్రత్తలు తీసుకునేది. కస్టమర్లు ఎక్కువగా ఉండని మధ్యాహ్న సమయంలోనే తన ‘పని’ ప్రారంభించేది.

ఆ పార్లర్‌ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోనూ తన ముఖకవళికలు రికార్డు కాకుండా స్కార్ఫ్‌ కట్టుకునేది. ఆ పార్లర్‌లోకి ప్రవేశించిన తర్వాత యజమాని ఒంటరిగా ఉంటేనే ముందుకు వెళ్లేది. తొలుత ఆ మహిళతో మాటలు కలిపి తాము ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చామని చెప్పేది. తమకో, సంబంధీకులకో మేకప్‌ చేయాలని కోరేది. అది పెళ్లిళ్ల సీజన్‌ అయితే బ్రైడల్‌ మేకప్‌ కోసం భారీ మొత్తం చెల్లిస్తామంటూ ఒప్పందం చేసుకునేది. ఆపై తమ మతాచారం ప్రకారం బంగారు నగల్ని తాకమంటూ పార్లర్‌ యజమానికి చెప్పేది. తానో, తన వారో వచ్చి మీతో మేకప్‌ లేదా ఇతరాలు చేయించుకోవాలంటూ ఒంటి పైన బంగారు ఆభరణాలు తీసి పక్కన పెట్టాలని సూచించేది. పార్లర్‌ నిర్వాహకులు/యజమాని అలా చేసిన తర్వాత మేకప్‌ లేదా ఫేషియల్‌ తదితరాలు చేయించుకునేది. ఆపై అదును చూసుకుని వారి దృష్టి మళ్లించడం ద్వారా ఆ బంగారు ఆభరణాలను తస్కరించి అక్కడ నుంచి ఉడాయించేది. ఈ పంథాలో డేసీ చెన్నైతో పాటు తమిళనాడులోని అనేక నగరాలు, పట్టణాల్లో నేరాలు చేసింది. దీంతో అక్కడి పోలీసుల నిఘా పెరిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ తన ‘పని’ కష్టమని భావించిన డేసీ హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుంది.

నాలుగు నెలల్లో 25 చోరీలు..
భర్తతో కలిసి ఫిబ్రవరిలో నగరాకినికి వచ్చి పటాన్‌చెరు ప్రాంతంలో అద్దె ఇంట్లో మకాం ఏర్పాటు చేసుకుంది. నగరంపై పెద్దగా పట్టులేని డేసీ ఇంటి నుంచి బయటకు వచ్చి తనకు కనిపించిన బస్సు ఎక్కేది. అక్కడ దిగిన తర్వాత అనువైన పార్లర్‌ను ఎంచుకుని యజమాని/నిర్వాహకురాలిని మోసం చేసి అందినకాడికి బంగారం ఎత్తుకుపోయేది. దీన్ని అమ్ముకోగా వచ్చిన డబ్బుతో భర్తతో కలిసి జల్సాలు చేసేది. ఈ పంథాలో గడిచిన నాలుగు నెలల కాలంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో దాదాపు 25 నేరాలు చేసింది. నగరంలోని మారేడ్‌పల్లి ఠాణా పరిధిలోని ఓ బ్యూ టీపార్లర్‌లో పంజా విసిరి దాదాపు ఐదు తు లాల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయింది. మూడు కమిషనరేట్లలో అదును చూసుకుని పంజా విసురుతూ, ఎలాంటి ఆధారాలు మిగల్చకుండా పోలీసులకు సవాల్‌ విసిరింది. ఈ కి‘లేడీ’ వ్యవహారాన్ని చాలెంజ్‌గా తీసుకున్న నార్త్‌జోన్‌ డీసీపీ బి.సుమతి నిందితురాలిని పట్టుకోవాల్సిందిగా మారేడ్‌పల్లి పోలీసులను ఆదేశించారు. దీంతో సాంకేతికంగా ముందుకు వెళ్లడంతో పాటు వ్యూ హాత్మకంగా వ్యవహరించి మారేడ్‌పల్లి పోలీసులు బుధవారం డేసీని పట్టుకున్నారు. ఈమె భర్తతో క లిసి ఉంటున్నట్లు తేలడంతో చోరీల్లో అతడి పాత్ర ఏమిటన్నది ఆరా తీస్తున్నారు. నిందితురాలిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్న పోలీసులు చోరీ సొత్తు రికవరీ చేయడంపై దృష్టి పెట్టారు. త మిళనాడులోనూ ఈమెపై ఏవైనా నాన్‌–బెయిలబుల్‌ వా రెం ట్లు పెండింగ్‌లో ఉన్నాయా? ఏదైనా కేసులో వాంటెడ్‌గా ఉందా? అని ఆరా తీస్తున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top