2018 చివరి నాటికి హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు పూర్తిస్థాయి

హైదరాబాద్‌: వచ్చే సంవత్సరం చివరి నాటికి హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని.. ఇప్పటికే సిద్ధమైన 30 కిలోమీటర్ల మార్గాన్ని ఈ నెల 28న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించనున్నామని మంత్రి కె.తారకరామారావు తెలిపారు. దేశంలో ఒకేసారి ఇంత పొడవైన కారిడార్‌ ప్రారంభించటం ఇదే తొలిసారని.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోరైలు ప్రాజెక్టు ఇదేనని చెప్పారు.

సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు మంజూరు చేయగా.. అందులో రూ.2,240 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. నిర్మాణ అంచనా పెరిగినందున అదనంగా నిధులివ్వాలని నిర్మాణ సంస్థ లేఖలు రాసింది వాస్తవమేనని.. కానీ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించలేదని స్పష్టం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రస్తుతం అవసరమైన 57 రైళ్లు హైదరాబాద్‌కు వచ్చేశాయన్నారు.

అయితే నాగ్‌పూర్‌ మెట్రో కోసం రైళ్లు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడంతో.. సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు రెండు రైళ్లను పంపినట్టు తెలిపారు. మెట్రో రైలు నిర్మాణ పనుల్లో అసాధారణ జాప్యం జరగలేదని చెప్పారు. గతేడాదే నాగోల్‌–మెట్టుగూడ మార్గం సిద్ధమైందని, ఆరు నెలల క్రితం మియాపూర్‌–ఎస్‌ఆర్‌నగర్‌ మార్గం సిద్ధమైందని పేర్కొన్నారు. అయితే ఇవి స్వల్ప దూరమే కావటంతో.. ప్రయాణికుల ఆదరణ లేకుంటే ప్రాజెక్టు విఫలమైందన్న విమర్శలు వచ్చే ప్రమాదముందని సీఎం చెప్పటంతో ప్రారంభించలేదని సభకు వివరించారు. ఇప్పుడు ఒకేసారి 30 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు.

పాతనగరంలో పనులపై నిలదీసిన బీజేపీ

మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టులకు సంబంధించి బీజేపీ సభ్యులు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌ శాసనసభలో ప్రశ్నలు అడిగారు. మెట్రోరైలు ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందని, అది ఎంత మొత్తం ఉంటుందో చెప్పాలని కోరారు. పాత నగరంలో ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకుండా ఏ రాజకీయ పార్టీ ఒత్తిడికి తలొగ్గారని.. అలైన్‌మెంట్‌ మార్పు ప్రతిపాదనకు సం బంధించి నిపుణుల కమిటీ నివేదికను ఎందు కు సభ ముందుంచటం లేదని నిలదీశారు.

అలైన్‌మెంట్‌ మార్పు పేరుతోనే ప్రాజెక్టు తీవ్ర జాప్యం జరిగిందని మండిపడ్డారు. ఎంఎంటీఎస్‌ రెండో దశకు ప్రభుత్వం నిధు లు విడుదల చేయకపోవటం వల్లే పనుల్లో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. దీనికి కేటీఆర్‌ సుదీర్ఘం గా సమాధానమిచ్చారు. అయితే మంత్రి కేటీఆర్‌ వాస్తవాలు దాస్తున్నారని.. తగిన సమా ధానం ఇవ్వలేదని పేర్కొంటూ బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

శివారు పట్టణాలకు ఎంఎంటీఎస్‌

హైదరాబాద్‌ సమీపంలోని పట్టణాలకు ఎంఎంటీఎస్‌ను విస్తరించే యోచనలో ఉన్నామని కేటీఆర్‌ వెల్లడించారు. ఎంఎంటీఎస్‌ రెండోదశను ఘట్‌కేసర్‌ నుంచి యాదా ద్రి వరకు పొడిగించామన్నారు. రాయగిరి రైల్వేస్టేషన్‌ పేరును యాదాద్రిగా మార్చనున్నట్టు తెలిపారు. రాష్ట్రంæ ఏర్పాటయ్యాకే ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రక్రియ వేగవంతమైందని పేర్కొన్నారు.

మార్గం మారుద్దామనుకున్నా..

అసెంబ్లీ ముందు, పాత నగరం, సుల్తాన్‌బజార్‌ మార్గాల్లో మెట్రో అలైన్‌మెంట్‌ మారుద్దామనుకున్నామని, ఇందుకోసం నిపుణుల కమిటీతో అధ్యయనం కూడా చేయించామని కేటీఆర్‌ చెప్పారు. అసెంబ్లీ వెనకనుంచి నిర్మిస్తే జూబ్లీహాల్‌ను కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు చెప్పటంతో విరమించుకున్నామని.. సుల్తాన్‌బజార్‌లో పెద్దగా భూసేకరణ అవసరం లేకుండా 65 అడుగులకు కుదించి నిర్మిస్తున్నామని తెలిపారు.

పాత నగరంలో నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, కొన్ని పరిస్థితుల వల్ల వెంటనే ప్రారంభించలేకపోయామని, త్వరలో మొదలుపెడతామని వెల్లడించారు. ఇక మెట్రో రెండో దశకు జైకా రుణం కోసం చర్చలు జరుపుతున్నామని, కేంద్రం కూడా కొత్త ప్రతిపాదనతో ముందుకొస్తోందని తెలిపారు. మొత్తం వ్యయంలో 60 శాతం రుణం, 20 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా ప్రతిపాదన ఉందన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top