ఇకపై నేరం జరగకముందే పోలీసులు రంగంలోకి

హైదరాబాద్‌ : ఇప్పటిదాకా నేరాలు జరిగిన తర్వాత పోలీసులు సీన్‌లోకి ఎంటరయ్యేవారు! ఇకపై.. నేరం జరగకముందే రంగంలోకి దూకనున్నారు!! నగరం మొత్తాన్ని ‘కెమెరా’ కన్ను పరిధిలోకి తెచ్చి అణువణువునా నిఘా పెట్టనున్నారు. నేరం జరిగాక కేసులు, దర్యాప్తులు కాదు.. అసలు నేరమే జరగకుండా చూసే దిశగా కసరత్తు చేస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌ కార్యాలయంలో అత్యాధునిక కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ) ఇందుకు వేదిక కానుంది. మరో వారం రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానుంది.

ఇందులో పని చేయడానికి 28 మంది సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేశారు. వీరు మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు విధులు నిర్వర్తిస్తూ సిటీపై కన్నేసి ఉంచుతారు. నేరాలు ఎక్కువగా జరిగే సమయాల్లో అక్కడున్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా వేల కెమెరాలున్నాయి. వీటి ఫీడ్‌ను అత్యంత నిశితంగా పరిశీలించేందుకు సీసీసీలో కొందరిని ప్రత్యేకంగా నియమించనున్నారు. నేరాలు జరిగే ప్రాంతాలు, అనుమానితులు సంచరించే ప్రదేశాలను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. దీన్ని ప్రామాణికంగా చేసుకుని సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.

సిటీలో పాత నేరగాళ్లు, వాంటెడ్‌ వ్యక్తుల్ని గుర్తించడానికి ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను నగర పోలీసు విభాగం సమీకరించుకుంది. నిందితులు, దోషులు, వాంటెడ్‌ వ్యక్తుల ఫొటోలు నిక్షిప్తమై ఉన్న సర్వర్‌తో ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. అలాగే నగరవ్యాప్తంగా ఉండే కెమెరాలన్నీ ఈ సర్వర్‌తో అనుసంధానించి ఉంటాయి. ఫలితంగా సిటీలో ఏ సీసీకెమెరా ముందు నుంచైనా ఆ వ్యక్తి కదలికలు ఉంటే.. సాఫ్ట్‌వేర్‌ ద్వారా సర్వర్‌ తక్షణమే గుర్తించి సీసీసీలో ఉండే కంప్యూటర్‌ తెరపై పాప్‌అప్‌ రూపంలో అక్కడి సిబ్బందికి తెలియజేస్తుంది. దీంతో వారి కదలికపై పోలీసులు మరింత నిఘా పెడతారు. పోలీసులు మెగాపిక్సల్‌ ఫొటోగ్రాఫిక్‌ (ఎంపీపీ) కెమెరాలను నగరంలో అందుబాటులోకి తెచ్చారు. దీనిద్వారా ఒక కెమెరా నుంచి గరిష్టంగా 64 ఫ్రేముల్లో దృశ్యాలను స్పష్టంగా చూడొచ్చు. ఇలాంటి కెమెరాలు నగరవ్యాప్తంగా 28 జంక్షన్లలో అందుబాటులోకి రానున్నాయి. వీటిసాయంతో ఆ ప్రాంతం పరిధిలోని వాహనాలు, వ్యక్తుల వివరాలను స్పష్టంగా ఫొటోల రూపంలోనూ భద్రపరచడం సాధ్యం కానుంది.

దేశంలో నగరమే టాప్‌

సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో దేశంలోనే హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. 2014 జూన్‌ నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు సిటీలో 1.8 లక్షల సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 1.6 లక్షల కెమెరాలను ప్రజలు, వ్యాపార,వాణిజ్య వర్గాలు తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నాయి. ఇవన్నీ స్థానిక పోలీస్‌ స్టేషన్లతో అనుసంధానమై ఉంటాయి. మిగిలిన 20 వేల కెమెరాలను ప్రభుత్వ నిధులతో పోలీసు విభాగం ఏర్పాటు చేసింది. ఈ 20 వేల కెమెరాలు సీసీసీతో అనుసంధానించి ఉంటాయి. దేశంలో హైదరాబాద్‌ తర్వాత ముంబైలో అత్యధికంగా 6 వేల కెమెరాలున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరంగా బీజింగ్‌కు రికార్డు ఉంది.

ప్రపంచంలో ఏ నగరంలో ఎన్ని కెమెరాలు?

బీజింగ్‌: 4.7 లక్షలు

లండన్‌: 4.2 లక్షలు

చికాగో: 1.7 లక్షలు

న్యూయార్క్‌: 1.5 లక్షలు

హైదరాబాద్‌: 1.8 లక్షలు

ఢిల్లీ: 4,074

ముంబై: 6,000

బెంగళూరు: 1,100

చెన్నై: 500

కోల్‌కతా: 1,000

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top