ఇర్మా విధ్వంసం

అమెరికా తీర రాష్ట్రం ఫ్లోరిడాను పెను తుపాను ఇర్మా ముంచెత్తింది. కేటగిరీ 4 తీవ్రతతో.. గంటకు 200 కి.మీ.కు పైగా వేగంతో కూడిన పెనుగాలులు, కుండపోత వర్షంతో విరుచుకుపడింది. ఫ్లోరిడా కీస్‌ వద్ద ఆదివారం ఉదయం 9.10 గంటలకు (స్థానిక కాలమానం) భయంకర తీవ్రతతో తీరాన్ని తాకిన ఇర్మా.. టాంప, నేపుల్స్, సెయింట్‌ పీటర్స్‌బర్గ్, పోర్ట్‌ మెయర్స్‌లలో పెను విధ్వంసం సృష్టించింది. ముందస్తు జాగ్రత్తలతో ప్రాణనష్టం ఎక్కువగా జరగకుండా నివారించగలిగినా.. భారీ స్థాయిలో ఆస్తి నష్టాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు ఇర్మా కారణంగా ఫ్లోరిడాలో ముగ్గురు చనిపోయారు. సహాయ కార్యక్రమాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా సమీక్షించారు. ఫ్లోరిడాలోని భారతీయుల కోసం ఇండియన్‌ ఎంబసీ హెల్ప్‌లైన్‌లను ప్రకటించింది.

వాషింగ్టన్‌: అంతా భయపడినట్లే హరికేన్‌ ఇర్మా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించింది. ఆదివారం సాయంత్రం (భారత కాలమానం) ఫ్లోరిడా కీస్‌ వద్ద తీరాన్ని తాకిన ఇర్మా ధాటికి ఆ రాష్ట్ర తూర్పు తీరంలో ఊహించని స్థాయిలో ఆస్తినష్టం చోటుచేసుకోగా, ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాకాసి గాలులకు వందలాది చెట్లు నేలకూలగా, భారీ భవంతులు చిగురుటాకుల్లా వణికిపోయాయి. భవనాల అద్దాలు పగలడంతో పాటు వందలాది ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఆస్తినష్టం ఊహించనంతగా ఉందని, ఇప్పుడే అంచనా వేయలేమని విపత్తు నిర్వహణ అధికారులు పేర్కొన్నారు. తూర్పు తీరంలోని టాంప నగరం, నేపుల్స్, సెయింట్‌ పీటర్స్‌ బర్గ్, బ్రాడెంటన్, క్లియర్‌వాటర్, పోర్ట్‌ మెయర్స్, సరసోటా పట్టణాలపై హరికేన్‌ విశ్వరూపం చూపిస్తోంది. పశ్చిమ తీరంలో ఉన్న మయామి–డేడ్‌ కౌంటీపై కూడా హరికేన్‌ ప్రభావం కొనసాగింది. వర్షానికి మయామిలో రోడ్లు నీట మునిగాయి. ప్రస్తుతం ఇర్మా స్థాయిని కేటగిరి 3కి తగ్గించారు. ఈ హరికేన్‌ ప్రభావం సోమ, మంగళవారాల్లో ఫ్లోరిడాతో పాటు జార్జియా, అలబామా, దక్షిణ, ఉత్తర కరోలినాల్లో కొనసాగనుంది.

గంటకు 209 కి.మీ. వేగంతో గాలులు
ఆదివారం సాయంత్రం దాదాపు 6.40 గంటల సమయంలో ఫ్లోరిడాలోని ‘కడ్జోయ్‌ కీ’ వద్ద కేటగిరీ 4 స్థాయిలో గంటకు 209 కి.మీ. వేగంతో ఇర్మా తీరాన్ని తాకినట్లు అమెరికా జాతీయ హరికేన్‌ కేంద్రం తెలిపింది. కేటగిరి 4 స్థాయిలో ఫ్లోరిడా కీస్‌(పగడపు దీవుల సముదాయం)ను తాకిన అనంతరం ఆ రాష్ట్ర తూర్పు తీరాన్ని బలంగా తాకింది. తూర్పు తీరంలో కీ వెస్ట్, నేపుల్స్, పోర్ట్‌ మెయర్స్‌ నుంచి టాంప వరకూ దాదాపు 200 కి.మీ. వేగంగా పెనుగాలులతో పాటు భారీ వర్షం ముంచెత్తింది. ఫ్లోరిడా కీస్‌ నుంచి టంప వరకూ దాదాపు 10 నుంచి 15 అడుగుల వరకూ అలలు ఎగసిపడ్డాయి. హరికేన్‌ కేంద్ర ప్రాంతం ఫ్లోరిడా కీస్‌కు చేరువయ్యే సమయంలో పెనుగాలులకు తీరప్రాంతంలోని తాటిచెట్లు విరిగిపడటంతో పాటు దాదాపు 10 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడ్డాయని అమెరికా హరికేన్‌ కేంద్రం అధికారులు తెలిపారు. హరికేన్‌ ప్రాంతం నేపుల్స్‌ పట్టణాన్ని తాకే సమయంలో సరాసరి గంటకు 185 కి.మీ.కు పైగా వేగంతో పెనుగాలులు వీయడంతో భారీ విధ్వంసం జరిగింది. మోన్రో కౌంటీలో ఒకరు, హర్డీ కౌంటీలో ఇద్దరు వాహనాలు అదుపుతప్పడంతో ప్రాణాలు కోల్పోయారు. మయామిలో గాలుల తీవ్రతకు భారీ క్రేన్‌ విరిగిపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇర్మా ప్రభావాన్ని మేరిల్యాండ్‌లోని క్యాంప్‌ డేవిడ్‌లో కేబినెట్‌ సహచరులతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షించారు. నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్ని వేగవంతం చేయాలని హోం ల్యాండ్, ఆర్మీ, అత్యవసర విభాగాల్ని ఆదేశించారు. ముందు జాగ్రత్తగా 140 హెలికాప్టర్లు, 650 ట్రక్కులు, 150 బోట్లను పెంటగాన్‌ సిద్ధంగా ఉంచింది. ఫ్లోరిడా రాష్ట్రంలో 30 లక్షల మందికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. క్యూబాలో విధ్వంసం అనంతరం శనివారం సాయంత్రానికి కేటగిరీ 3 స్థాయికి తగ్గిన ఇర్మా.. ఆదివారం ఉదయం మరింత పుంజుకుని కేటగిరి 4కి చేరింది. గత నాలుగైదు రోజులుగా కరీబియన్‌ దీవుల్లో విధ్వంసం సృష్టించిన ఇర్మా 25 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే.

టాంప నగరంపై అధిక ప్రభావం
ఇర్మా ప్రభావంతో ఫ్లోరిడాలోని పలు చోట్ల గరిష్టంగా 209 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. హిల్స్‌బరో, బే, చార్లొటే, కొలియర్, డిక్సీ, ఫ్రాంక్లిన్, గల్ఫ్, హెర్నాండో, లెవీ, పాస్కో, టేలర్‌ కౌంటీలు ఎక్కువగా నష్టపోయాయి. హిల్స్‌బరో కౌంటీలోని టాంప నగరంపై ఇర్మా అధిక ప్రభావం చూపింది. టాంప మెట్రోలో దాదాపు 30 వేల మందికి పైగా భారతీయులు ఉండటంతో వారి క్షేమ సమాచారంపై భారత రాయబార కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలో దాదాపు 1.2 లక్షల మంది భారతీయ– అమెరికన్లు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం మయామీ, టాంప, ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ నగరాల్లో నివసిస్తున్నారు. అమెరికా చరిత్రలో ఇర్మాను అతి భయంకర హరికేన్‌గా వాతావరణ శాఖ అధికారులు అంచనావేశారు. అందువల్ల ముందు జాగ్రత్తగా ఫ్లోరిడాలోని 63 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరించారు. వారి కోసం 330 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ‘ఫ్లోరిడా చరిత్రలో ఎప్పుడూ ఇంతటి ముప్పు ఎదుర్కోలేదు. పెనుగాలులు మీ ప్రాణాల్ని తీయవచ్చు. వీలైనంత త్వరగా ప్రమాదకర ప్రాంతాల నుంచి తరలిపోండి’ అని ఇర్మా తీరాన్ని తాకడానికి ముందు ఫ్లోరిడా గవర్నర్‌ మరోసారి హెచ్చరించారు.

భారతీయుల యోగక్షేమాలపై ఆరా
భారతీయులకు సాయం కోసం 24 గంటలు పనిచేసేలా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ నంబరు(హాట్‌లైన్‌ 202–258–8819) ఏర్పాటు చేసింది. అత్యవసర సాయం కోసం +14044052567, +1678179393 నంబర్లలో సంప్రదించాలని అట్లాంటాలోని భారత కాన్సులేట్‌ ట్వీట్‌ చేసింది. ఇర్మాలో చిక్కుకున్న భారతీయులకు సాయం అందించేందుకు సీనియర్‌ దౌత్య అధికారులు ఆదివారం అట్లాంటా నగరం చేరుకుని ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో సహాయ చర్యలపై సమీక్షించారు. కంట్రోల్‌ రూంలో న్యూయార్క్‌ భారత కాన్సుల్‌ జనరల్‌ సందీప్‌ చక్రవర్తి పరిస్థితిని పర్యవేక్షించారు. అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్‌ సర్నా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

కరీబియన్‌లో హెల్ప్‌లైన్లు
కరీబియన్‌ దీవుల్లో విధ్వంసం నేపథ్యంలో జమైకా రాజధాని కింగ్‌స్టన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంలో 24 గంటల హెల్ప్‌లైన్‌ నంబర్లు (1876 833 4500, +1876 564 1378) అందుబాటులో ఉంచామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ తెలిపారు. అత్యవసరమైతే hc.kingston @mea.gov.in, hoc.kingston @mea. gov.in చిరునామాలకు మెయిల్‌ చేయాలని ఆయన ట్వీట్‌ చేశారు. కరీబియన్‌లోని అరుబా(00297– 593– 2552), క్యూరేసొ(005999–513–2407; 005999– 690–2686) దీవుల్లోను భారతీయుల సాయం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర సాయం 0031643743800 నంబర్‌లో సంప్రదించవచ్చని నెదర్లాండ్స్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించింది. అలాగే క్యూబా, డొమినికన్‌ రిపబ్లిక్, హైతీలో నివసిస్తున్న భారతీయులు +5352131818 ఎమర్జెన్సీ నంబర్‌ లేక controlroomindiairma@gmail.com కు మెయిల్‌ చేయాలని రాయబార కార్యాలయం సూచించింది. సెయింట్‌ మార్టిన్‌ దీవిలో చిక్కుకున్న 60 మంది భారతీయుల్ని అమెరికాకు తరలించారు. వీరిలో ఎక్కువమంది అమెరికా తాత్కాలిక వీసా (ట్రాన్సిట్‌)పై ఆ దీవిలో పర్యటిస్తున్నారు. ట్రాన్సిట్‌ వీసా లేనివారి కోసం అమెరికా అధికారులతో సంప్రదించి వారు భారత్‌ చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top