వేగంగా జరుగుతున్న హెచ్‌పీ గ్యాస్‌ ప్లాంటు పనులు

పారిశ్రామికంగా వెనుకంజలో ఉన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు, ఉపాధి కల్పించే ఇతర సంస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. వరంగల్‌ గ్రామీణ జిల్లాలో మెగా జౌళి పార్కు నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. కాగా వరంగల్‌ పట్టణ జిల్లాలో హిందుస్థాన్‌ పెట్రోలియం (హెచ్‌పీ) భారీ ఎల్పీజీ గ్యాస్‌ ప్లాంటు త్వరలో రాబోతోంది. రూ.100 కోట్ల వ్యయంతో కమలాపూర్‌ మండల పరిధిలో హెచ్‌పీ గ్యాస్‌ ప్లాంటు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చెర్లపల్లిలో మాత్రమే హెచ్‌పీ గ్యాస్‌ ప్లాంటు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి నుంచే సరఫరా చేయాల్సి వస్తోంది. దీంతో రవాణా భారమవ్వడమే కాకుండా వినియోగదారులకు సకాలంలో గ్యాస్‌ సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో గ్యాస్‌ ప్లాంటును నిర్మించాలని నిర్ణయించారు. 2012లో సర్వే చేసి, చివరకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్న పూర్వ కరీంనగర్‌ జిల్లాలోని కమలాపూర్‌ మండలాన్ని ఎంపిక చేశారు. ఇదిప్పుడు వరంగల్‌ పట్టణ జిల్లా పరిధిలోకి వచ్చింది. పరిశ్రమ నిర్మాణానికి కావాల్సిన 34 ఎకరాల స్థలాన్ని కమలాపూర్‌ గ్రామ శివారులో ప్రభుత్వం కేటాయించింది. గతేడాది మేలో ప్లాంటు ఏర్పాటుకు పర్యావరణ అనుమతి లభించింది. ఆ వెంటనే పనులు ప్రారంభించి వేగంగా చేపడుతున్నారు. గ్యాస్‌ ప్లాంటు పూర్తయితే పూర్వ వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాలకు ఇక్కడి నుంచే హెచ్‌పీ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా జరుగుతుంది.

రోజుకు 14 వేల సిలిండర్లు..

రోజుకు 14000 సిలిండర్లను నింపేందుకు అనువుగా ఈ ప్లాంటులో ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గట్టు 300 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గ్యాస్‌ను నిల్వ చేయగల మూడు భారీ ట్యాంకుల(బుల్లెట్)ను నిర్మిస్తున్నారు. అలా ఏడాదికి 60 వేల మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ను ఇక్కడ సిలిండర్లలో నింపి ఉత్తర తెలంగాణ జిల్లాలకు సరఫరా చేయనున్నారు. ఇది పూర్తయితే బుకింగ్‌ చేసిన రోజే వినియోగదారులకు సిలిండర్‌ అందుతుందని హిందుస్థాన్‌ పెట్రోలియం డీజీఎం రోహిత్‌ గోర్గ్‌ ‘మీడియా’తో చెప్పారు. ప్లాంటు రెండు షిఫ్టుల్లో నడవనుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా రానున్నాయి. స్థానికులకు ఉపాధి లభించనుంది. పరిసరాల్లో ఉపాధి మార్గాలూ పెరిగే అవకాశం ఉంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top