63కు చేరిన చిన్నారుల మరణాలు

గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస చిన్నారుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పిల్లల సంఖ్య శనివారానికి 63కు పెరిగింది. ఆస్పత్రిలో ద్రవరూప ఆక్సిజన్‌ అందుబాటులో లేని కారణంగానే వీరంతా మృత్యువాత పడ్డారు. కానీ వైద్యులు మాత్రం మరణాలకు వేర్వేరు కారణాలున్నాయని చెబుతుండటం గమనార్హం.

శుక్రవారం సాయంత్రం బీఆర్‌డీ ఆస్పత్రి అధికారులు విడుదల చేసిన ప్రకటనను ప్రకారం.. పిల్లల వార్డు, మెదడువాపు వార్డుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో శుక్రవారం 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 9 నుంచి 11 వరకూ చోటుచేసుకున్న ఈ మరణాల్లో కేవలం 11 కేసులపై మాత్రమే శాఖాపరమైన విచారణకు ఆదేశించామని అధికారులు చెప్పారు. మిగిలినవారంతా రకరకాల వైద్య కారణాలతో చనిపోయారని చెబుతున్నారు.

కాగా, శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల మధ్య మరో ముగ్గురు చిన్నారులు తుదిశ్వాస విడిచారు. దీంతో చిన్నారుల మరణాల సంఖ్య ఐదురోజుల్లో 63కు పెరిగింది.

యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ గతంలో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్‌లో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి బాబా రాఘవ్‌ దాస్‌ మెడికల్‌ కాలేజీ. గోరఖ్‌పూర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన అనేకమంది పేదలు వైద్యం కోసం ఇక్కడికే వస్తుంటారు. ఆస్పత్రిలో రోగులకు అవసరమైన ఆక్సిజన్‌ సరఫరా కాంట్రాక్టును ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అయితే కొద్ది నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో సుమారు రూ.70 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో సదరు ప్రైవేటు సంస్థ.. ఆగస్టు 9 నుంచి ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేసింది. దీంతో చిన్నారులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఉదయం 11 గంటల వరకు చనిపోయినవారి సంఖ్య 63కు పెరిగింది.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉదయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఆరోగ్య మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్, మెడికల్ విద్య మంత్రి అశుతోష్ టాండన్ లతో ఆయన సమావేశమయ్యారు. ఇద్దరూ వెంటనే గోరఖ్ పూర్ ఆసుపత్రికి వెళ్లి, పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. చిన్నారులు చనిపోవడానికి కారణంగా భావిస్తోన్న ఆక్సిజన్‌ సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం.. అధికారులను ఆదేశించారు. మరోవైపు, ఇటీవలే ఆయన ఈ ఆసుపత్రిని సందర్శించి, రోగుల సమస్యల గురించి తెలుసుకున్నారు. అయన సందర్శన తర్వాత రెండు రోజులకే ఈ ఘటన జరగడంతో యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇది ఇలా ఉండగా, ఇంతమంది చిన్నారుల మరణాలకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top