రాష్ట్రంలో మద్యం గొలుసుకట్టు దుకాణాలు నిర్వహిస్తే సహించేది లేదు

రాష్ట్రంలో మద్యం గొలుసుకట్టు దుకాణాలు నిర్వహిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. తోలు తీస్తాననీ... మర్యాదగా చెప్పినా వినకపోతే వారికి అర్థమయ్యే భాషలో ఎలా చెప్పాలో తనకు తెలుసని అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో స్థానిక ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అధ్యక్షతన గురువారం జరిగిన జన్మభూమి-మాఊరు ముగింపు సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా పది రోజులపాటు నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ప్రతి గ్రామంలో ప్రజలు తమ సమస్యలు ఏమైనా ఉంటే తెలిపేందుకు ముందుకొచ్చారు. వీటిని ఆర్థిక, ఆర్థికేతరమైనవిగా విభజించి.. ఆర్థికేతర అర్జీలను త్వరితగతిన పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చాం. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు చక్కటి సహకారం అందించారు’’ అని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామని వివరించారు. పేదల కోసం పెట్టే ప్రతి పైసా రాబందులు తినకుండా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలకు చురక..

రాష్ట్రంలో ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండాలనీ.. ఇందుకు అంతా ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. అనంతపురంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక ఉపన్యాసాలు ఇస్తారు గానీ... ప్రజలతో మరగుదొడ్లు కట్టించలేక పోతున్నారని చంద్రబాబు చురకలంటించారు. మార్చి 31లోపు ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టి తీరాలన్నారు. కస్తూర్బా విద్యార్థినులు సైతం ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించకపోతే సంక్రాంతి సెలవులకు ఇంటికి రామని తల్లిదండ్రులకు లేఖలు రాశారన్నారు. వృద్ధులకు తాను పెద్దకొడుకుగా ఉంటున్నానని చెప్పారు. ఓ సర్వేలో 59 శాతం మంది తమ తల్లిదండ్రులను చూడటం లేదని తేలిందన్నారు. దీనిపై కూడా చర్చిస్తున్నామనీ, పిల్లలు తమ తల్లిదండ్రులను చూసేలా ఏం చేయాలనేది ఆలోచిస్తున్నామని చెప్పారు.

ఆనందంలో ఏపీ 72వ స్థానం...

ప్రపంచ వ్యాప్తంగా ఆనంద సూచికలో (హ్యాపీనెస్‌ ఇండెక్స్‌) పది పాయింట్లకు గాను నార్వే 7.54 పాయింట్లతో మొదటి స్థానంలో 4.35 పాయింట్లతో భారత్‌ 122వ స్థానంలో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం 5.36 పాయింట్లతో 72వ స్థానంలో ఉందని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని జిల్లాల పరంగా చూస్తే శ్రీకాకుళం 6.44 పాయింట్లతో మొదటి స్థానంలో ఉందన్నారు. మనిషికి తిండితోపాటు మెరుగైన జీవన ప్రమాణాలు, శరీరానికి వ్యాయామం, సంతోషం కూడా ఉండాలన్నారు.

అనంతలో వర్షాభావం ఏర్పడితే.. శ్రీకాకుళం నుంచి నీటిని తెస్తా

గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి సిద్ధమైతే కొందరు ఎంతో అడ్డుపడాలని చూశారనీ... అయినా ఏడాదిలో పూర్తిచేసి చూపామని చంద్రబాబు తెలిపారు. కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఎన్టీఆర్‌ ఆలోచన చేశారన్నారు. ఆయన మొదలు పెట్టిన పథకాలు పూర్తిచేసి, సీమకు నీరిస్తున్నామన్నారు. మున్ముందు గోదావరి-కృష్ణా-పెన్నా నదులను అనుసంధానిస్తామని అలాగే వంశధార-నాగావళి నదులను కలుపుతామని చెప్పారు. ఇలా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇటు సీమ జిల్లాల్లో నదులను కలుపుతామన్నారు. అనంతలో వర్షాభావం ఏర్పడితే.. శ్రీకాకుళం నుంచి నీటిని తెచ్చి ఇస్తామన్నారు. స్మార్ట్‌ వాటర్‌ గ్రిడ్‌ ద్వారా గొలుసుకట్టు కింద చెరువులన్నింటికీ నీటిని అందిస్తామని చెప్పారు. సీమలో కరవును పారదోలేందుకు ఎంత నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. రాష్ట్రంలో కరవు, పేదరికం ఉండకూడదనేది తన లక్ష్యమన్నారు.

మాటిచ్చినట్టు ఏడాదిలో నీరు తెచ్చా..

జన్మభూమి సభకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా ద్వారా వచ్చిన కృష్ణా జలాలతో నిండిన బుక్కపట్నం, ధర్మవరం చెరువుల వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. బుక్కపట్నం వద్ద రైతుల కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ, ఏడాది కిందట ఇక్కడికి వచ్చినప్పుడు బుక్కపట్నం చెరువుకు నీరిస్తానని హామీ ఇచ్చాననీ... సరిగ్గా ఏడాదిలో చెరువును పూర్తిగా నీటితో నింపామన్నారు. దీనిని జలాశయంగా మార్చాలని ఇంజినీర్లను ఆదేశించారు. తద్వారా మరో మూడు మండలాలకు కూడా నీటిని అందించవచ్చన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు దేవినేని ఉమ, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప, శాసన మండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌, శాసనసభ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

చిన్నారి ప్రసంగంతో.. చంద్రహాసం

జన్మభూమి సభలో రాయచోటి పట్టణానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి అక్షయ ముద్దుమాటలతో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలుగుజాతి, తెలుగు కీర్తి, తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ అని మొదలు పెట్టి.. చంద్రబాబు వివరాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఏమాత్రం తడుముకోకుండా చకచకా చెప్పింది. ముఖ్యమంత్రి చిన్నారిని అభినందించి ఎవరైనా అక్షయతో పోటీపడతారా అని ప్రశ్నించారు. తాను కూడా ఇన్ని గుర్తుంచుకోలేనని పక్కనే ఉన్న కలెక్టర్‌ వీరపాండియన్‌ అన్నారు. చిన్నారి ప్రతిభను మెచ్చుకున్న చంద్రబాబు అక్షయ పేరిట రూ.50 వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించనున్నట్లు ప్రకటించారు. అనంతరం ఫైబర్‌ నెట్‌ ద్వారా ఓ ఉపాధ్యాయిని వేరొక పాఠశాలలో ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పగా వారితో చంద్రబాబు మాట్లాడారు. అలాగే ఓ అంగన్‌వాడీ కేంద్రంలో మహిళలు, ఓ ఇంటిలో వారితో చంద్రబాబు వేదికపై నుంచే మాట్లాడి ఫైబర్‌ గ్రిడ్‌తో కలిగే ప్రయోజనాలు వివరించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top