మరుగుదొడ్డి లేకపోవడం తో బాలిక మృతి

ఇంటి వద్ద మరుగుదొడ్డి లేకపోవడం ఆ కుటుంబానికి శాపంగా మారింది. ఇంట్లో మరుగుదొడ్డి లేక బహిర్భూమికి వెళ్లిన ఏడేళ్ల బాలిక పాము కాటుతో మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని బోయపాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే..

మండలంలోని బోయపాడు మత్స్యకార గ్రామానికి చెందిన మైలపిల్లి దేవుడు, రమణమ్మ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దకుమార్తె అపరంజి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నది. చిన్నకుమార్తె ఆషాకు నాలుగేళ్లు. తండ్రి చేపల వేట సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామంలోని ఒక పెంకుటింట్లో ఈ కుటుంబం అద్దెకు ఉంటున్నది. ఇంట్లో మరుగుదొడ్డి సదుపాయం లేకపోవడంతో గురువారం ఉదయం అపరంజి (7) పాఠశాలకు వెళ్లేందుకు తయారైంది. ఉదయం 8-30 గంటలకు బహిర్భూమికి ఆరు బయటకు వెళ్లింది. అక్కడ బాలికను పాము కరిచివేసింది. దీంతో బాలిక వదిలించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, కుడికాలు మడం వద్ద రెండు, మూడు సార్లు కాటేసింది. పాము కాటేసిన భాగాన తీవ్ర రక్తస్రావం జరిగింది.

పాము కుట్టిందని బాలిక ఏడుస్తుండడాన్ని చూసిన తల్లిదండ్రులు ఉదయం తొమ్మిది గంటలకు నక్కపల్లి 30 పడకల ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పూర్ణచంద్రరావు నేతృత్వంలో వైద్యసిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. ఏఎస్‌వీ ఇంజక్షను కూడా చేసినట్టు సూపరింటెండెంట్‌ చెప్పారు. అప్పటికే విషం రక్తంలో కలిసి శరీరమంతా వ్యాపించడంతో ఆస్పత్రికి వెళ్లిన కాస్సేపటికీ పాప అపస్మారక స్థితికి చేరుకుంది. కంటి చూపు కనిపించడం లేదని, మాట రావడం లేదని వైద్యులు గుర్తించారు. వెంటనే అనకాపల్లి ఎన్‌టీఆర్‌ ఆస్పత్రికి తరలించాలని సిఫార్సు చేశారు. 108 వాహనంలో అనకాపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఎలమంచిలి వద్ద అపరంజి మరణించింది. దీనిపై బాధిత కుటుంబీకులు నక్కపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నక్కపల్లి ఆస్పత్రిలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టమ్‌ నిర్వహించారు.

కన్నీటి సంద్రం బోయపాడు

బాలిక మృతి బోయపాడు మత్స్యకార గ్రామం కన్నీటి సంద్రమైంది. పాముకాటుకు గురై మరణించిన బాలిక చుట్టుపక్కలందరితోనే ఎంతో సరదాగా మాట్లాడేదని స్థానికులు చెబుతున్నారు. తల్లిదండ్రుల రోదన స్థానికులను కలచివేసింది. నిరుపేద మత్స్యకార కుటుంబానికి చెందిన బాలిక అపరంజి పాముకాటుకు గురవ్వడానికి గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top