ఏపీకి ప్రయోజనాలను సాధించుకోవడం వరకే మన పోరాటం

అమరావతి: ‘‘కేంద్రం నుంచి మన రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలను సాధించుకోవడం వరకే మన పోరాటం పరిమితం. దాన్ని ఎంతవరకైనా కొనసాగిద్దాం. అంతే తప్ప జగన్‌లాగా వారికి(కేంద్రానికి) పూర్తిగా లొంగిపోవడమో లేదా కేజ్రీవాల్‌లా ప్రతి అంశంలోనూ దూకుడుగా వెళ్లాల్సిన అవసరమో మనకు లేదు’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం పార్టీ కోర్‌కమిటీ సభ్యులు నారా లోకేష్‌, కుటుంబరావులతో పాటు మరికొందరితో సమావేశమయ్యారు. ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలన్నింటినీ ప్యాకేజీ రూపంలో ఇస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటిస్తేనే అప్పుడు అంగీకరించామన్నారు. దాన్ని సాధించుకునేందుకే ఇప్పుడు పార్లమెంటులో పోరాడుతున్నామన్నారు. మిత్రపక్షంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం మనం ఇంత పోరాడుతుంటే వైకాపా మాత్రం లాలూచీ రాజకీయాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నాయకుడికి నిజంగా ప్రత్యేక హోదాపైన, రాష్ట్ర ప్రయోజనాలపైన చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో వైకాపా ఎంపీలు సభలో ఎందుకు లేరనేదానిపై వారు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘‘వైకాపాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి నాయకుడిపైనున్న కేసులే ముఖ్యం. లేకుంటే ప్రత్యేక హోదా ఇస్తేనే వస్తు సేవల పన్ను బిల్లుకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతిస్తామని ఎందుకు ముడిపెట్టలేదు? పునర్‌వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినప్పుడు ఎంపీగా ఉన్నప్పటికీ జగన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాష్ట్ర విభజన సమయంలో జగన్‌ సమైక్యాంధ్ర ముసుగేసుకుని సోనియాగాంధీతో కుమ్మక్కై బెయిల్‌ తెచ్చుకున్నారు. ఎన్జీవోల్లో చీలిక తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ముసుగేసుకుని మరోసారి ప్రజల్ని మోసగించాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకునేందుకు ఇప్పుడు కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, లేఖలు రాస్తున్నారు’’ అని సీఎం అన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top