ఎవ్వరిని మరిచిపోలేడు అందరు గుర్తున్నారు

‘నాది ప్రజాపక్షం. జనం కోసం అవసరమైతే జైలుకు వెళతా. లాఠీ దెబ్బలు తింటా. చివరకు ప్రాణాలైనా అర్పిస్తా’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేశంగా ప్రకటించారు. సొంత కుటుంబాన్నే వదిలేసి వచ్చానని, తనది ప్రజా కుటుంబమని, ప్రజలే తన కుటుంబ సభ్యులని.. స్నేహితులని స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

దోచుకున్న వారికే...

పోలవరంలో అవినీతి జరిగిందని తెలుసు. ఆంధ్రావాళ్లు దోచుకున్నారని చెప్పి... ఇప్పుడు అదే ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో పనులు ఇస్తున్నారు.

ఇది ఊహించగలమా?

1969-70లో తెలంగాణ కోసం పోరాడారు. 1972లో ప్రత్యేకాంధ్ర కోసం పోరాటం జరిగింది. కానీ... అంతా కలిసి ఉండాలని నాడు పెద్దలు కోరుకున్నారు. ఇప్పుడు... బాసర ఐఐఐటీలో చదివే ఆంధ్రా విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇవ్వకుండా ఆపేశారు. ఇలా ఊహించగలమా?

జాతీయ దృక్పథం ఏదీ?

ఇప్పుడు ఒక్కో పార్టీ ఒక కులానికి ప్రతీక అయిపోయింది. బీజేపీ హిందూ పార్టీ అయిపోయింది. ఇలా కాకుండా... ఒక జాతీయ దృక్పథం ఉన్న పార్టీలు ఎందుకు ఉండవు?

ఇద్దరూ ‘దొంగలేనా?’

ఇటీవల లండన్‌కు వెళ్లినప్పుడు ఒక పారిశ్రామిక వేత్త తన మొబైల్‌ ఫోన్‌లో షేర్‌ అయిన ఫొటోలు చూపించారు. వైసీపీ లక్ష కోట్లు దోచుకుందని టీడీపీ, టీడీపీయే దోచుకుందని వైసీపీ పెట్టిన ఫొటోలవి. ‘‘చెరో లక్షకోట్లు దోచుకుంటే ప్రజలకు ఏం చేస్తారు? రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఎలా వస్తాం’’ అని ఆయన ప్రశ్నించారు. నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు.

ఎవ్వరినీ మరిచిపోను...

అప్పట్లో నేను మోదీని కలిసినప్పుడు ‘పవన్‌ కల్యాణ్‌ ఎవడు’ అని అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. నరేంద్ర మోదీని కలిస్తే ద్రోహం చేసినట్లు మాట్లాడారు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల వంటి వారు కూడా ట్వీట్‌ చేశారు. ఏదీ మరిచిపోలేదు. సమయం, సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాను. ఈ రోజు నేను మోదీని గట్టిగా నిలదీస్తున్నాను. మరి... మీరు అలా మాట్లాడుతున్నారా?

నాలో నేను...

నేను చనిపోయేలోపు దేశానికి ఏం చేయగలను, ఎంత చేయగలను, అసలు ఏమైనా చేయగలనా? ఏదైనా చేయగలిగితేనే సంతృప్తి. అది నేను ఒక్కడిని చేయగలనా? నాకు నేను పరీక్ష పెట్టుకున్నాను. అనుకున్న భావజాలానికి కట్టుబడి ఉండగలనా అని పదేళ్లు పరీక్షించుకున్నాను. నేనూ అందరిలాగానే పుట్టాను. అది నాకూ తెలుసు. అది అర్థమైన తర్వాత... నా గొప్పతనమేదీ లేదని అర్థమైంది. నిజంగా రాజకీయ వ్యవస్థ బాగుండి ఉంటే సినిమాలు వదిలి వచ్చేవాడిని కాదు. ఎదగడం, నీడనివ్వడం, పండు ఇవ్వడం, రాలిపోవడం... చెట్టు ధర్మం ఇదే. దానికంటే నేను ఏం గొప్ప? నాలో అహంకారం లేకుండా చూసుకున్నాను. ‘నేను’ అనే పదం తీసేశాను. సమస్యలు వచ్చినప్పుడే వాటిని ఎదుర్కొనే తెగింపుకోసం ‘నేను’ అనే పదం వాడతాను.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top