అమ్మా నాన్నా..క్షమించండి

మనసు పొరల్లో వణుకు.. అంతుపట్టని భయం.. మరపురాని ఆందోళన.. ఏదో తెలియని దిగులు.. వేధించే కలత.. అంతా ఒక మహా ఉత్పాతమై ఓ ఉసురు తీసింది. నవయౌవనంలో ఉరకలు వేయాల్సిన ఓ యువకుడు మృత్యువు ఒడికి చేరాడు. బతుకు పోరాటంలో ముందుకు సాగాల్సిన యువకుడు ఓటమిని అంగీకరించి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.

సత్తెనపల్లి : పురుగుల మందు తాగి ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి పట్టణంలోని నాగార్జునగర్‌లో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గురజాల మండలం గంగవరం గ్రామానికి చెందిన చలువాది వెంకటేశ్వర్లు, భద్రమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నాగేంద్రబాబుకు వివాహం అయ్యింది. రెండో కుమారుడైన చలువాది దుర్గా సతీష్‌నాయుడు(21) సత్తెనపల్లి మండలంలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. పట్టణంలోని నాగార్జుననగర్‌లోని ఓ బాలుర వసతిగృహంలో ఉంటూ రోజూ కళాశాలకు వెళుతున్నాడు. గత శనివారం జ్వరం కారణంగా ఇంటికి వెళ్లిన యువకుడు మంగళవారం ఉదయం సత్తెనపల్లి చేరుకున్నాడు.

కళాశాలకు వెళ్లకుండా వసతి గృహంలోనే ఉండిపోయాడు. తన గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. సాయంత్రం తోటి విద్యార్థులు వచ్చి తలుపులు తీయడంతో విగతజీవిగా కనిపించాడు. హుటాహుటిన 108కు సమాచారం అందించగా వారు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బాలు, రెండు పేజీల లేఖ ఉంది. పట్టణ పోలీసులు సమాచారం అందుకుని లేఖలోని ఫోన్‌నెంబర్ల ఆధారంగా మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్‌ శంకర బాబు, ఆర్‌.ఐ పొత్తూరి నాగేశ్వరరావు, గ్రామ రెవెన్యూ అధికారి నరసింహస్వామి సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

సతీష్‌నాయుడి లేఖలో విషయాలు.. గౌరవనీయులైన తల్లిదండ్రులకు, నేను మూడు సంవత్సరాల నుంచి బాగా డిప్రెషన్, టెన్షన్, స్ట్రెస్‌తో బాధపడుతున్నా. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా.

నా చావుకు నేనే కారణం. అమ్మా, నాన్న, అన్న దయచేసి నన్ను క్షమించండి. మీ రుణం తీర్చుకోకుండా మధ్యలో వెళ్లి పోతున్నందుకు బాధ పడుతున్నా. రోజూ అందరితో సరదాగా, హ్యపీగా నవ్వుతూనే ఉండేవాడిని. కానీ లోపల మాత్రం ఎందుకో నరకం అనుభవించా. నాకు తెలియకుండానే నిద్రలో ఉలికిపడేవాడిని. మీరు నా భవిష్యత్తు బాగుండాలని చదివిస్తున్నారు. కానీ నాకు ఇష్టం లేక పోయినా చదువుతున్నా. ప్రతి రోజు కాలేజీకి వెళుతున్నా. ప్రెజర్‌ మాత్రం నన్ను వదలలేదు.

అన్నా..! అమ్మానాన్న, నాయనమ్మ, వదినను బాగా చూసుకో. ఇక నా గురించి మర్చిపోండి. దయచేసి నేను మళ్లీ పుట్టాలని కోరుకోవద్దు సైదులన్నా! నువ్వు కూడా పిల్లలను, వదిన భారతిని, అమ్మను బాగా చూసుకో. అమ్మానాన్న! మీకు కోడలైనా, కూతురైనా వదినే. ఇప్పటి వరకు ఎలా చూసుకున్నారో ఇక మీదట కూడా అలానే చూసుకోండి. వదినా! నువ్వు కూడా అమ్మానాన్నలను కంటికి రెప్పలా చూసుకో. అసలు నా గురించి ఇక మరిచిపోండి. దేవుడు నాకు మీతో కలిసి ఉండాలని రాసిపెట్టలేదు అనుకుంటా. నాన్న నువ్వు ఇక తాగమాకు. అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఉంటా.

నాకు పోస్టుమార్టం చేయించవద్దు. అనారోగ్యంతో చనిపోయాడని చెప్పి వెంటనే మా ఊరికి తీసుకెళ్లండి. ఎందుకంటే మా అమ్మ పోస్టుమార్టం చేస్తే తట్టుకోలేదు. ఇంత చిన్న విషయానికే చనిపోవాలా? అని ఎగతాళి చేసి మాట్లాడే వారికి నేను సమాధానం చెప్పలేను. ఒత్తిడి అనేది భయంకరమైంది. తట్టుకోవడం నా వల్ల కాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నా ఊరి స్నేహితులకి, ఇక సెలవు. హాస్టల్‌ అంకుల్‌– ఆంటీ ఇక్కడ చనిపోతున్నందుకు క్షమించండి. తప్పడం లేదు. మా ఇంట్లో అయితే నాకు ధైర్యం చాలదు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top