చెంచాలగూడా జైల్లో మందుబాబుల సందడి

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ ప్రధాన జైలులో ఇతరత్రా నేరగాళ్ల కంటే శిక్షపడిన మందుబాబుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. వీరి బ్యారక్‌లన్నీ నిత్యం నిండిపోయి ఉంటున్నాయి. హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో నెలకు 1,100 మందికిపైగా మందుబాబులు వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్నారు. వీరిలో 500-800 మందికి ఒకరోజు నుంచి నెల వరకూ శిక్షలు పడుతున్నాయి. ఇక సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో జైలుశిక్ష పడుతున్నవారు ప్రతినెలా 350 మంది వరకూ ఉంటున్నారు. నగర కమిషనరేట్‌ పరిధిలో జైలుశిక్ష పడినవారిని చంచల్‌గూడ జైలుకు... ఇతర కమిషనరేట్లలో చిక్కినవారిని చర్లపల్లి కారాగారానికి తరలిస్తున్నారు.

మందుబాబులను జైల్లోని ఇతర ఖైదీలతో కలిపి ఉంచట్లేదు. ప్రత్యేక బ్యారక్‌లో ఉంచి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. వీరితో మొక్కలకు నీరు పోయించడం, పారిశుద్ధ్య పనులు, గడ్డి తొలిగించే పనులను చేయిస్తున్నారు. అరెస్టుకు ముందు వారికి ట్రాఫిక్‌ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తారు. జైలులోనూ... తప్పతాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలపై వీడియోలను చూపిస్తారు. మందు తాగకపోతే ఉండలేనివారికి జైలు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అవసరమైనవారిని ఎర్రగడ్డలోని ఐఎంహెచ్‌ సంస్థకు తరలిస్తున్నారు.

లబోదిబోమంటున్న కుటుంబ సభ్యులు

పోలీసులు మొదట మందుబాబుల వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తర్వాత వారిని కౌన్సిలింగ్‌కు పిలిచి, కోర్టులో హాజరుపరుస్తున్నారు. అక్కడ శిక్షలు ఖరారవుతున్నాయి. అయితే, కౌన్సెలింగ్‌కు వచ్చే చాలామంది ఇళ్లలో అసలు విషయం చెప్పుకోలేక... ‘మిత్రుడి ఇంట్లో కార్యముంది. ఊరెళ్తున్నా. రెండ్రోజుల్లో వస్తా’మని చెబుతున్నారు. కానీ, వారు ఎంతకూ రాకపోవడం, సెల్‌ఫోన్లు మోగకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఠాణాల చుట్టూ తిరిగి, చివరికి విషయం తెలుసుకుని జైళ్లకు పరుగులు తీస్తున్నారు.

2017లో చంచల్‌గూడ జైలుకు వచ్చిన మందుబాబులు: జనవరిలో 412 మంది, ఫిబ్రవరి-450, మార్చి-435, ఏప్రిల్‌-506, మే- 611, జూన్‌-375, జులై-1,000, ఆగస్టు-917, సెపెంబరు-615, అక్టోబరు-650, నవంబరు-635, డిసెంబరు-1,015 మంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top