రెక్కలు తెగిన పక్షిలా మారిన ఆంధ్రప్రదేశ్

అసంబద్ధమైన విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా రెక్కలు తెగిన పక్షిలా తయారైందని.. మిగిలిన రాష్ట్రాలతో సమానంగా నిలబడేంతవరకూ అవశేష రాష్ట్రాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశారు. కొత్త రాష్ట్రంపై విభజన సమయంలో రూ.33వేల కోట్ల అదనపు అప్పుల భారాన్ని రుద్దినట్లు పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్య క్రమశిక్షణకు సంబంధించిన ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం వెళ్లడం రాష్ట్రానికి అసాధ్యంగా మారుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. గత యూపీయే ప్రభుత్వం చేసిన తీవ్ర అన్యాయాన్ని సరిదిద్ది నవ్యాంధ్రకు కొంతకాలంపాటు చేయూతనివ్వాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.17వేల కోట్లను వెంటనే ఏదో ఒక రూపంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం ఇప్పటివరకూ అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై 17పేజీల వినతిపత్రాన్ని ప్రధానికి సమర్పించి సుమారు 40 నిమిషాలపాటు ఆయనకు సమస్యలను ఏకరువుపెట్టారు. ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు చంద్రబాబు సమావేశానంతరం ప్రకటించారు. ‘‘సీరియస్‌గా ఆలోచించి... శక్తివంచన లేకుండా నావంతు పూర్తి సాయం చేస్తా’’ అని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రధాని మరింత సమాచారం కోరారని, వెంటనే పంపుతామన్నారు. వ్యక్తిగతంగా సమీక్షించి అన్నింటినీ పరిష్కరిస్తానని ప్రధాని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

అన్యాయానికి లెక్కలే నిదర్శనం

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అన్యాయం జరిగిందో లెక్కలే చెబుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా, అసంబద్ధంగా, ఏకపక్షంగా జరిగిందనడానికి ఈ మూడున్నరేళ్లలో ఎన్నో ప్రబల సాక్ష్యాలు కనిపించాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయరంగం వాటా అధికంగా, సేవారంగం వాటా అతితక్కువగా ఉంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లాంటి నగరాలు లేకపోవడం, ఇతరత్రా కారణాలవల్ల రాష్ట్ర జీఎస్‌డీపీలో సేవారంగం వాటా అతి తక్కువగా ఉంటోంది. దీనివల్ల పన్ను ఆదాయం తగ్గిపోతోంది.

తెలంగాణకు పెద్దమొత్తంలో లబ్ధి

అహేతుక రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ మూల్యం చెల్లించుకుంటుంటే, తెలంగాణకు పెద్దమొత్తంలో లబ్ధి జరుగుతున్నట్లు అంకెలే చెబుతున్నాయి. 58% జనాభా ఉన్న రాష్ట్రానికి 46% ఆదాయాన్ని మాత్రమే కేటాయించారు. ఇది కేవలం ఆర్థిక ఇబ్బందులకు దారితీయడమేకాకుండా ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు కట్టుబడి నడుచుకోవడం అసాధ్యంగా మార్చింది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నప్పటికీ ఎఫ్‌ఆర్‌బీఎం కింద రుణపరిమితిని పెంచలేదు. ఇదే సమయంలో తెలంగాణకు మాత్రం వెసులుబాటు కల్పించారు. 2011-12 సంవత్సరం ఆధారంగా సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రూ.9,15,852 కోట్ల జీఎస్‌డీపీలో 58% జనాభా ఉన్న అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,64,272 కోట్ల (50.69%) వాటా మాత్రమే వచ్చింది.

ఏపీలో భారీ రెవిన్యూ లోటు... అక్కడ రూ.లక్ష కోట్లకుపైగా మిగులు!

2020 తర్వాత కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే రెవిన్యూలోటు రాష్ట్రంగా మిగులుతుందని 14వ ఆర్థికసంఘం చెప్పింది. కేంద్రం పన్నులవాటా పంచిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్లకాలానికి రూ.22,112 కోట్ల రెవిన్యూలోటు ఉంటుంది. ఇదే సమయంలో పన్నులవాటా పంచిన తర్వాత తెలంగాణ రెవిన్యూమిగులు రూ.1,18,678 కోట్లకు చేరనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనం.

తలసరి ఆదాయంలో వెనుకబడుతున్నాం...

మేం గత మూడున్నరేళ్లుగా దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలకంటే ఎక్కువ వృద్ధిరేటు సాధిస్తున్నప్పటికీ తలసరి ఆదాయంలో వెనుకబడే ఉన్నాం. 2011-12నాటి ధరల ప్రకారం 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,12,162 అయితే, ఆంధ్రప్రదేశ్‌ది రూ.82,870. మూడున్నరేళ్లలో తలసరి ఆదాయం రూ.1,22,376కి చేరినప్పటికీ దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలకంటే చాలా వెనుకబడి ఉన్నాం.

విభజన సమయంలో అవశేషరాష్ట్రానికి పూడ్చలేని నష్టాల్లో ప్రధానమైనవి ఇలా...

1. 58% జనాభా ఉన్న రాష్ట్రానికి 46% ఆదాయాన్ని ఇచ్చారు.

2. ఆస్తులను స్థలం ప్రాతిపదికన పంచారు.

3. రుణాలను జనాభా ప్రకారం ఇచ్చారు.

4. విద్యుత్తును వినియోగం పద్ధతిలో పంచారు.

5. తిరిగి చెల్లించాల్సిన పన్ను బకాయిలను జనాభా ప్రాతిపదికన ఏపీకి 58.32, తెలంగాణకు 41.68% ఇచ్చారు.

6. స్థలం ప్రాతిపదికన పాత పన్ను బకాయిలను వసూలుచేసుకొనే వెసలుబాటు కల్పించారు. దీనివల్ల రాష్ట్రానికి రూ.3,800 కోట్ల నష్టం జరిగింది.

7. సింగరేణి బొగ్గు గనులను 9వ షెడ్యూల్‌లో పెట్టినప్పటికీ స్థలం ప్రాతిపదికన అందులో 51% వాటాను తెలంగాణకు ఇచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దాని అనుబంధ సంస్థ అయిన ఏపీహెచ్‌ఎంఈఎల్‌కు మాత్రం అలాంటి నిబంధన వర్తింపజేయలేదు.

8. అవశేష రాష్ట్రానికి రూ.1,30,000 కోట్ల భారీ రుణాన్ని బదిలీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంపై ఉన్న రుణంలో రూ.33వేల కోట్లను ఆంధ్రప్రదేశ్‌పై అధికంగా మోపారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

9. ఉమ్మడి రాష్ట్రంలో చెల్లించాల్సిన పింఛను బకాయిలను జనాభా ప్రాతిపదికన పంపిణీచేయాలని నిబంధన విధించడం ఆంధ్రప్రదేశ్‌పై మరింత భారాన్ని మోపింది. విభజన జరిగిన మూడున్నరేళ్ల తర్వాత కూడా ఇంకా ఎన్నో అపరిష్కృత అంశాలు...

1. 9వ షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పుల విభజన ఇప్పటికీ పూర్తికాలేదు.

2. 10వ షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తిలో పంచుకోవాలని సుప్రీం కోర్టు తీర్పుచెప్పినప్పటికీ ఇప్పటికీ పూర్తికాలేదు. పైగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీచేసింది. దాన్ని ఉపసంహరించుకొని సుప్రీం కోర్టు తీర్పునకులోబడి కొత్త ఉత్తర్వులివ్వమని మేం హోంశాఖకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా ఇంతవరకూ ఫలితం కనిపించలేదు. దీనివల్ల మేం విధిలేని పరిస్థితుల్లో న్యాయపోరాటానికి వెళ్లాల్సి వస్తోంది.

3. దిల్లీలోని ఏపీ భవన్‌ను ఇరురాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంచుకోమని హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇంతవరకూ దాని విభజన పూర్తిచేయలేదు.

భాజపా, తెదేపా సంబంధాలపై మాట్లాడలేదు..

లేదు... భాజపా, తెదేపా సంబంధాలపై నేను ప్రధానితో మాట్లాడలేదు. మా పొత్తుకు ఇప్పుడు సమస్య ఏముంది? నా పక్కన కూర్చున్న ఇద్దరు మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. భాజపాకు చెందిన ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. మీరు(విలేకర్లు) మాత్రం మేం ఇప్పుడు విడిపోతామా? అన్న అజెండాతో ఉన్నారు. మాకు అలాంటి రాజకీయ అజెండా లేదు’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీకి కొత్త గవర్నర్‌ కవాలన్న అంశంపై భాజపా నాయకులనే అడగాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top