బడా రెస్టారెంట్ లో కూల్ డ్రింక్స్ మండిపోతున్నాయి

హైదరాబాద్‌: నగరవాసిని ధరల విషయంలో కొన్ని బేకరీల మొదలు బడా రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్లు దోపిడీ చేస్తూనే ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. అయినా ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. పైగా.. ‘జీఎస్టీ’ పేరు చెప్పి మరింత దండుకొంటున్నారు. జీఎస్టీ పరిధిలోకి రాని వస్తువులపైనా బాదుడు తప్పడం లేదు.. ఇంకొందరైతే ఏకంగా జీఎస్టీ, సర్వీస్‌ ఛార్జీ రెండింటినీ తీసుకొంటున్నారు.

నామ్‌కే వాస్తేగా తనిఖీలు

ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వ్యాపారుల ఆగడాలను కట్టడి చేయాల్సిన తూనికలు, కొలతల శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. బేకరీలు, మిఠాయి దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. చిన్న చిన్న వ్యాపారులే నయం.. రూపాయి నుంచి రూ.5 అధికంగా తీసుకొంటున్నారు. పెద్ద రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్లలోనైతే దారుణంగా దండుకొంటున్నారు.

అధికారులే కంగుతిన్నారు..

*తాజాగా హైదరాబాద్‌ జిల్లా తూనికలు, కొలతల శాఖాధికారులు ట్యాంక్‌బండ్‌లోని మారియట్‌ హోటల్‌లో తనిఖీలు చేశారు. అక్కడి ధరలను గమనించి వారే విస్తుపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

*లీటర్‌ నీళ్ల సీసా.., 300 ఎంఎల్‌ కోక్‌.. ఒక గ్రీన్‌ టీకి.. ఏకంగా రూ.725.70 బిల్లు వడ్డించారు. పైగా.. ఎమ్మార్పీ ధరను ముద్రించని నీళ్ల సీసాలను విక్రయిస్తున్నారు. అదీ లీటర్‌ ధర రూ.195.. జీఎస్టీ 18 శాతం అదనం. ఇక 300 ఎంఎల్‌ కోక్‌ జీఎస్టీతో కలుపుకొని రూ.230.సదరు యాజమాన్యంపై కేసు నమోదు చేసి.. బిల్లింగ్‌ సిస్టంను సీజ్‌ చేశారు.

*కోక్‌ టిన్‌ అసలు ధర రూ.35 కాగా.. హిమయత్‌నగర్‌లోని హైకింగ్‌ రెస్టారెంట్‌లో వసూలు చేస్తుందేమో రూ.65+ జీఎస్టీ 18 శాతం. లీటర్‌ నీళ్ల సీసా రూ.30కి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి రూ.10వేల జరిమానా విధించారు. ఇవే కాదు.. నగరంలో ఇటీవల సుమారు వేయి వరకు కేసులు నమోదు చేశారు. అయినా దోపిడీ పర్వం కొనసాగుతూనే ఉండటం గమనార్హం.

ఈ నంబరుకు ఫిర్యాదు చేయండి...

మనలో మార్పు వచ్చినప్పుడే ఈ ‘దోపిడీ’ పర్వానికి తెర పడుతుంది. వ్యాపారుల ఆగడాలను అడ్డుకోవచ్చు. ప్యాకేజీ వస్తువుల్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించినా.. హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్‌ ఛార్జీ వసూలు చేసినా... నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. బిల్లుతో సహా వివరాలను ‘94901 65619’ నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా పంపించాలి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top