కేసీఆర్‌ పాలనలో దళితులపై రోజురోజుకు దాడులు

హైదరాబాద్‌ : కేసీఆర్‌ పాలనలో దళితులపై రోజురోజుకు దాడులు, పెరిగిపోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు అండగా కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ ఆరేపల్లి మోహన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. దళితులకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులు దక్కకపోగా అవమానాలు, అమానుషాలు దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు ఎస్సీ కమిటీలు వేయాలని సూచించారు.

వడ్డీభారం పడ్డ రైతుల వివరాలు అందచేయండి: సీఎం కేసీఆర్‌కు రైతులపై ప్రేమ లేదని ఉత్తమ్‌ విమర్శించారు. అందుకే అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీ వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి మాట తప్పారన్నారు. వడ్డీభారం పడ్డ రైతుల వివరాలను సేకరించి కిసాన్‌సెల్‌కు అందచేయాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. మంగళవారం ఇందిరాభవన్‌లో కిసాన్‌సెల్‌ ఛైర్మన్‌ ఎం.కోదండరెడ్డి అధ్యక్షతన పీఏసీఎస్‌ ఛైర్మన్లు, కాంగ్రెస్‌ నాయకుల సమావేశం జరిగింది. ఉత్తమ్‌ మాట్లాడుతూ... రుణమాఫీ వడ్డీపై అసెంబ్లీలో కాంగ్రెస్‌ నిలదీయగా అందరికీ వడ్డీ కూడా చెల్లించామని, ఇంకా వడ్డీభారం పడ్డ రైతుల వివరాలను సభలో సమర్పిస్తే న్యాయం చేస్తామని సీఎం చెప్పారన్నారు. అలాంటి రైతుల వివరాలు సేకరించి అసెంబ్లీ పూర్తయ్యేలోపు సమర్పించాలని సూచించారు. ఉత్తమ్‌కు వినతిపత్రం సమర్పించిన సెర్ప్‌ ఉద్యోగులు: ఉద్యోగ భద్రత, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సెర్ప్‌ ఉద్యోగులు మంగళవారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు. సెర్ప్‌ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందని ఉత్తమ్‌ తెలిపారు.

గాంధీభవన్‌లో నెహ్రూ జయంతి: భారతదేశం.. ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగడానికి తొలి ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఎంతో కృషి చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకొని మంగళవారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి ఉత్తమ్‌, మాజీ మంత్రి దానం నాగేందర్‌, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌, ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ ఆరేపల్లి మోహన్‌, ప్రధాన కార్యదర్శులు నిరంజన్‌, ప్రేమ్‌లాల్‌ తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

నెహ్రూ జయంతిపై ప్రభుత్వాల వైఖరిని తప్పుపట్టిన వీహెచ్‌: నెహ్రూ జయంతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని మాజీ ఎంపీ వి.హనుమంతరావు తప్పుపట్టారు. మంగళవారం అసెంబ్లీకి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుతుంటారని.. ఇందుకు సంబంధించి వార్తా పత్రికల్లో ఎలాంటి ప్రకటనలుఇవ్వకపోవడం దారుణమన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top