ఉన్నత శ్రేణి పరీక్షలకు ఇక 60 శాతం ఉమ్మడి సిలబస్‌

హైదరాబాద్‌: యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌, రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్‌-1 లేదా తత్సమాన ఉన్నత శ్రేణి పరీక్షలకు ఇక 60 శాతం ఉమ్మడి (కామన్‌) సిలబస్‌ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా నానుతున్న ఈ ప్రతిపాదన గోవాలో నిర్వహించిన రాష్ట్రాల పీఎస్సీల జాతీయ సదస్సు సందర్భంగా కార్యరూపం దాల్చింది. దీన్ని అమలు చేసేందుకు శుక్రవారం సదస్సు ఆమోదించింది. అన్ని రాష్ట్రాల పీఎస్సీలూ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఉమ్మడి సిలబస్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ పలు అంశాలను పరిశీలించి, అధ్యయనం చేసి ఉమ్మడి నమూనా పాఠ్యప్రణాళికను రూపొందించింది. ఇందులో గరిష్ఠంగా 60 శాతం సిలబస్‌ కేంద్ర, రాష్ట్రాల పీఎస్సీల అత్యున్నత శ్రేణి పరీక్షలకు ఉమ్మడిగా ఉంటుంది. మిగతా 40 శాతం పాఠ్యప్రణాళికలో ఆయా రాష్ట్రాలు తమ స్థానిక అవసరాల మేరకు ప్రాధాన్యత ఇచ్చుకోవచ్చని కమిటీ సూచించింది.

* పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో మరింత పారదర్శకత పెంచేందుకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని, వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సదస్సు అభిప్రాయపడింది.

* పీఎస్సీలు నిర్వహించే పరీక్షలకు ఉమ్మడి విధానం, నిబంధనలు ఉండాలని కమిషన్లు ప్రతిపాదించాయి. ఈ విషయమై ఉప కమిటీలు ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని తీర్మానించాయి.

* యూపీఎస్సీ తరహాలో సభ్యుల పదవీ విరమణ వయసును ప్రస్తుత 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచేందుకు సదస్సు ఆమోదం తెలిపింది.

* రాష్ట్రాల పీఎస్సీల జాతీయ సదస్సు వివరాల కోసం స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ చక్రపాణి ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ http://www.lokseva.online ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

రాష్ట్రాల పీఎస్సీల స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా చక్రపాణి

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి.. రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్ల స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా రెండుమార్లు స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. ఈ పదవి కాలపరిమితి రెండేళ్లు. గోవాలో రాష్ట్రాల పీఎస్సీల జాతీయ సదస్సు గోవాలో ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్యఅతిధులుగా గోవా గవర్నర్‌ మృదులా సిన్హా, యూపీఎస్సీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ డేవిడ్‌ ఆర్‌.సియేమ్‌లే, ఘంటా చక్రపాణి, గోవా పీఎస్సీ ఛైర్మన్‌ జోస్‌ మాన్యుయేల్‌ నూరోన్హ హాజరయ్యారు. తనపై నమ్మకంతో రెండోసారి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు చక్రపాణి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాల పీఎస్సీల పనితీరు మరింత మెరుగుపరిచే దిశగా పనిచేస్తానని పేర్కొన్నారు. పలు సమస్యల పరిష్కారానికి వీలుగా కొన్ని అంశాలపై మరిన్ని సదస్సులు నిర్వహించాలని జాతీయ సదస్సు శుక్రవారం నిర్ణయించింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top