చంద్రబాబు నాయుడు ఘటన స్థలానికి చేరుకొని సంతాపం తెలిపారు

విజయవాడ కృష్ణా నదిలో ఆదివారం పడవ బోల్తా పడి మృతి చెందిన వారికి రాష్ట్ర శాసనసభ తీవ్ర సంతాపం ప్రకటించింది. మృతుల ఆత్మశాంతి కోసం శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సోమవారం మధ్యాహ్నం విరామం తరువాత సమావేశమైన శాసనసభలో ఈ ప్రమాదంపై సంతాపం ప్రకటించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. తాను కేరళ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షించానన్నారు. ప్రమాదంలో మొత్తం ఎంత మంది మృతి చెందారు, ఎంత మందికి చికిత్స అందించారన్న వివరాలను వెల్లడించారు. ‘‘ ఎలాంటి అనుమతులు లేవు. కొత్త డ్రైవర్‌కు లైసెన్సు కూడా లేదు. అనుభవం లేదు. రూట్‌మ్యాప్‌ తెలీదు. ప్రైవేటు పడవ సిబ్బంది డబ్బులకు అశపడి సామర్థ్యానికి మించి 25 మంది స్థానే 45 మందిని ఎక్కించుకున్నారు. పవిత్ర సంగమం వద్ద పడవను అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని...’’ ఆయన వివరించారు. ఇప్పటికే కేసులు నమోదు చేశామని, శేషం కొండలరావు, నీలం శేషగిరిరావు, గేదెల శీను, వి. విజయసారథి, చిట్టిలను నిందితులుగా చేర్చామని వెల్లడించారు. గేదెల శీను పర్యాటక శాఖ ఉద్యోగి అని తెలిసిందని, అతడి ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ కేసు విచారణ కాలయాపన లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తై దోషులకు శిక్షపడేలా చేస్తామని, అవసరమైతే ఈ వివరాలన్నిటితో కూడిన నివేదికను కూడా శాసనసభకు సమర్పిస్తామని వెల్లడించారు. ఇద్దరు ఉన్నతాధికారుల కమిటీని నియమిస్తున్నామని, ఇందులో ఒక ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారి సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కమిటీ అన్ని అంశాలను అధ్యయనం చేస్తుందన్నారు. ఈ లోగా అన్ని పడవలు, లాంచీలకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తున్నామని, అనధికారికంగా నడిపే పడవలు, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరికి చెరో రూ.లక్ష పరిహారం ఇస్తున్నామని, మరో ఇద్దరికి చెరో రూ.50వేలు పరిహారమిస్తామని వివరించారు.

సభ సంతాపం

ఈ సంఘటనలో ఇంత మంది మరణించడం బాధాకరమని శాసనసభలో పలువురు సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. భాజపా శాసనసభాపక్షం నేత విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ అనధికారికంగా ప్రయాణికులను ఈ పడవ తీసుకెళుతున్న విషయాన్ని పర్యాటక సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఈ ప్రమాదం కొంతతప్పి ఉండేదన్నారు. శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ పర్యాటక సిబ్బంది, అధికారులకు భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వస్తున్నాయని, వాటిపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పాపికొండలు, కోటిపల్లి తదితర ప్రాంతాలకు పడవల్లో పర్యాటకులను తీసుకెళుతుంటారని, డ్రైవర్‌ అనుభవం లేని వాడైతే అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రమాదంలో పడినట్టేనన్నారు.

ముమ్మరంగా గాలింపు చర్యలు

ఆదివారం అర్ధరాత్రి నిలిపివేసిన సహాయక చర్యలను అధికారులు తిరిగి సోమవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలుపెట్టారు. ఈ గాలింపులో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, మత్స్య శాఖ, అగ్నిమాపక శాఖ బృందాలు పాల్గొన్నాయి. తెల్లవారిన తర్వాత మూడు మృతదేహాలను కనుగొన్నారు. తొలుత కఠారి సుధాకర్‌ (ఒంగోలు), గుర్రపు డెక్క ఉన్న ప్రాంతంలో పోవూరి హరిత (నెల్లూరు), తర్వాత బాలుడు రిషిత్‌ (ఒంగోలు) మృతదేహాలను వెలికి తీశారు. వీటిని శవపరీక్ష నిమిత్తం విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మధ్యాహ్నానికి 15 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం బ్యారేజి వద్ద వెలికి తీసిన మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. పడవలో ఉన్న ముగ్గురు సిబ్బంది ఆచూకీపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరు మరణించారా? లేక తప్పించుకుని పరారయ్యారా? అన్నది చెప్పలేకపోతున్నారు. ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కఠారి భూలక్ష్మి(ఒంగోలు) సోమవారం సాయంత్రం తనువు చాలించింది. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రభు కుటుంబానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. అతడి కుమార్తె అశ్విక ఆచూకి తెలియాల్సి ఉంది. ఆయన తల్లి ఆదివారం చనిపోయింది. గల్లంతైన ఆయన భార్య హరిత శవం సోమవారం బయటపడింది. వీరు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బంధువులు. ఈ ప్రమాదంలో మృతి చెందిన పసుపులేటి సీతారామయ్య రాష్ట్ర డీజీపీ సాంబశివరావుకు బంధువు. చివరి వ్యక్తి ఆచూకీ దొరికే వరకు గాలింపు కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ స్వయంగా దగ్గర ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆయన లైఫ్‌ జాకెట్‌ ధరించి స్వయంగా గాలింపు ప్రక్రియలో పాల్గొన్నారు. మంత్రి భూమా అఖిలప్రియ కూడా ప్రమాద ప్రాంతంలో ఉండి అధికారులకు సూచనలు చేశారు.

యజమానులపై క్రిమినల్‌ కేసు

ప్రమాదానికి కారణమైన రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వెంచర్స్‌ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలిసి కూడా మరణానికి కారణమయ్యారని ఐపీసీ సెక్షన్‌ 304 పార్ట్‌ 2 కింద ఇబ్రహీంపట్నం పోలీసులు క్రిమినల్‌ కేసు పెట్టారు. అనుమతి లేకుండా పడవను నదిలోకి తీసుకురావడం, పర్యాటకులను తీసుకెళ్లడాన్ని నేరంగా పరిగణించారు. సరైన రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కనీసం లైఫ్‌ జాకెట్టు కూడా లేకుండా, పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకొని ఈ దుర్ఘటనకు కారకులయ్యారన్న అభియోగాలను నమోదు చేశారు

.

కేరళ నుంచి ఘటనాస్థలికి నేరుగా సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం కేరళ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చి నేరుగా ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. హెలికాప్టర్‌లో ప్రమాదం జరిగిన పవిత్ర సంగమం వద్దకు వచ్చి మూడు రౌండ్లు చక్కర్లు కొట్టారు. ఘటన జరిగిన తీరుపై జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం, పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌తో మాట్లాడారు. ఈ ప్రమాదంలో 11 మందిని రక్షించిన మత్స్యకారులను సీఎం చంద్రబాబు పిలిచి అభినందించారు. ఎలా రక్షించిందీ వారిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న మృతుల బంధువులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పడు బయట ప్రకటన చేయడం సహేతుకం కాదని వ్యాఖ్యానించారు. సీఎం వెంట మంత్రులు దేవినేని, అఖిలప్రియ, కామినేని శ్రీనివాస్‌, మచిలీపట్నం ఎంపీ నారాయణ, నందిగామ ఎమ్మెల్యే సౌమ్య, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి, తదితరులు ఉన్నారు.

* విజయవాడకు సమీపంలోని గొల్లపూడి ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పరామర్శించారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లి వారి పరిస్థితిని వాకబు చేశారు. ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే వరకు ఉత్తమమైన చికిత్స అందించాలని ఆంధ్రా హాస్పటల్‌ ఎండీ రమణమూర్తికి చెప్పారు.

* బోటు ప్రమాదానికి ఏపీ ప్రభుత్వం, మంత్రులు బాధ్యత వహించాలని, వారి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. క్షతగాత్రులను వైకాపా నేతలు సోమవారం పరామర్శించి బాధితులకు అండగా ఉంటామన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top