నంద్యాల టికెట్ శిల్పాకేనా.. బాబు?

కర్నూలు: తమ పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే బలమైన సంకేతాలు అందుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు చెబుతున్నారు.

మంత్రి అఖిలప్రియకు మొండిచేయి చూపిస్తూ శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాల శాసనసభ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డికి ఆ మేరకు ఆయన సంకేతాలు ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు.

ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే తన రాజకీయ భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉండి తీరుతానని మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి స్పష్టం చేస్తూ అవసరమైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లి పోటీ చేయాలని ఆయన గట్టిగా అనుకుంటున్నారు.

తన తండ్రి భూమా నాగిరెడ్డి హఠార్మరణంతో ఖాళీ అయినందున సంప్రదాయం ప్రకారం నంద్యాల టికెట్ తమ కుటుంబానికే దక్కాలని మంత్రి భూమా అఖిలప్రియ అంటున్నారు. అయితే, అటు శిల్పా మోహన్ రెడ్డికి గానీ ఇటు అఖిలప్రియ కుటుంబ సభ్యులకు గానీ టికెట్ ఇస్తే కుమ్ములాటలు తప్పవని చంద్రబాబు గ్రహించి, వివాదనికి వారం రోజుల్లో తెర దించడానికినడుం బిగించారు. అందులో భాగంగానే శిల్పా సోదరులతో చంద్రబాబు అమరావతిలోని తన కార్యాలయంలో బుధవారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు.

శాసనమండలి చైర్మన్ పదవిని చంద్రబాబు శిల్పాకు ఇవ్వజూపారు. అయితే శిల్పా ఆ పదవి తనకు వద్దంటూ చెప్పినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, తనపై నమ్మకం ఉంచాలని శిల్పాకు చెప్పినట్లు సమాచారం. నంద్యాల టికెట్ ఇస్తానని ఒక దశలో పరోక్షంగా చంద్రబాబు శిల్పాకు సంకేతాలు ఇచ్చినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. దీంతో శిల్పా సోదరులు పార్టీ మారాలన్న ఆలోచనను తాత్కాలికంగా పక్కనపెట్టి నియోజకవర్గంలోని తన కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో నిమగ్నం కావాలని అనుకున్నట్లు చెబుతున్నారు.

శిల్పాకు టికెట్ కేటాయింపు విషయంలో అఖిలప్రియను, భూమా వర్గాన్ని ఒప్పించేందుకు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌తో చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. త్వరలో చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్నారని ఆ సమయంలో ఎస్వీ, ఫరూక్‌తో మంతనాలు సాగుతాయని చెబుతున్నారు.

అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చినందున నంద్యాల టికెట్ భూమా కుటుంబ సభ్యులకు ఇచ్చినా సర్దుకుపోతారనే ధీమాతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, శిల్పాకు టికెట్ ఇస్తే భూమా వర్గీయులు సహకరించకపోవచ్చుననే అనుమానం ఉంది. పట్టుబట్టి శిల్పా టికెట్ తీసుకుంటున్నందున భూమా వర్గీయులను కలుపుకుని విజయం సాధించే బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబుకు కాస్తా ఊరట లభించవచ్చు. అయితే, వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ తీసే వ్యూహంలో ఇది ఎదురు తిరుగుతుందా అనే అనుమానం మాత్రమే ఆయనకు ఉంటుంది.

శిల్పా పార్టీలోకి రాకపోతే నంద్యాల ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున పోటీకి దించాల్సిన అభ్యర్థి పేరును వైయస్ జగన్ ఖరారు చేసినట్లు సమాచారం. పట్టణంలోని సినీ థియేటర్ల యజమాని ఉలవల ప్రతాపరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టిడిపిని వీడి తమ పార్టీలోకి శిల్పా వస్తారని వేచి చూసిన జగన్ బుధవారం రాత్రి అమరావతిలో జరిగిన పరిణామాలను తెలుసుకున్న అనంతరం ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రతాపరెడ్డికి సంకేతాలు పంపారని చెబుతున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top