క్షణికావేశంలో చాందిని జైన్‌ని హత్య చేశా: సాయికిరణ్‌

హైదరాబాద్‌: క్షణికావేశంలో హత్య చేసినట్టు ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ హత్య కేసులో నిందితుడు సాయికిరణ్‌ రెడ్డి వెల్లడించినట్టు తెలిసింది. చాందినిని తానే హత్య చేసినట్టు పోలీసులతో అతడు చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో మదీనాగూడలో ఉంటున్న సాయికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో తామిద్దరికీ గొడవ జరిగిందని, క్షణికావేశంలోఆమెను చంపానని నిందితుడు చెప్పినట్టు తెలిసింది.

‘ఆరేళ్ల నుంచి చాందినితో పరిచయం ఉంది. కొన్నాళ్ల క్రితం ఆమెను నాకు దూరం చేశారు. పెద్దవాళ్లకు తెలియకుండా మా స్నేహం కొనసాగింది. పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి తెచ్చేది. 9వ తేదీ సాయంత్రం కలుద్దామని తానే ఫోన్‌ చేసింది. నేను చాందిని ఇంటికి వెళ్లాను. తర్వాత ఎప్పుడూ కలుసుకునే అమీన్‌పూర్‌ ప్రాంతానికి ఆటోలో వెళ్లాం. మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. కెరీర్‌లో సెటిలైన తర్వాత చేసుకుందామని చెప్పినా వినకుండా గొడవకు దిగింది. కోపంతో ఆమెను కొట్టాను. గట్టిగా కేకలు పెట్టడంతో ఆమె గొంతు పట్టుకున్నాను. ఆమె స్పృహ తప్పిపడిపోయిందనుకుని స్నేహితులకు ఫోన్‌ చేశారు. ఫ్రెండ్స్‌ వచ్చి ఆమె చనిపోయిందని చెప్పారు. భయంతో అక్కడి నుంచి పారిపోయాన’ని పోలీసుతో సాయికిరణ్‌ చెప్పినట్టు సమాచారం.

మరోవైపు హత్య జరిగిన అమీన్‌పూర్‌ గుట్టల్లోకి సాయికిరణ్‌ను పోలీసులు బుధవారం తీసుకెళ్లారు. హత్య జరిగిన తీరును సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ద్వారా తెలుసుకున్నారు. హత్యకు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సాయికిరణ్‌ ఒక్కడే ఈ హత్య చేసివుండడని, మరికొందరు సహరించి ఉండొచ్చని చాందిని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దోషులకు కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. కాగా, నిందితుడు సాయికిరణ్‌ను పోలీసులు నేడు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top