ఇంజన్ల లోపంతో రద్దైన ' ఇండిగో ' విమానాలు

ముంబయి: విమానయాన సం‌స్థ ఇండిగో ఈరోజు దేశీయంగా 47 విమానాలను రద్దు చేసింది. విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) ప్రాట్‌ అండ్‌ విట్నీ ఇంజిన్ల వైఫల్యాల నేపథ్యంలో ఎ320 నియో విమానాలను నిలిపివేస్తోంది. ఇప్పటికే ఇండిగోకు చెందిన 8విమానాలను, గో ఎయిర్‌ సంస్థ నిర్వహిస్తున్న 3 విమానాలను డీజీసీఏ నిలిపేసింది. విమానాల నిలిపివేత ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇండిగో మార్చి 13న దేశీయంగా తిరగాల్సిన 47 విమానాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని ఇండిగో తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పట్నా, శ్రీనగర్‌, భువనేశ్వర్‌, అమృత్‌సర్‌, గువహటి తదితర నగరాల నుంచి వెళ్లాల్సిన విమానాలు కొన్ని రద్దైనట్లు తెలిపింది.

సోమవారం అహ్మదాబాద్‌ నుంచి కోల్‌కతాకు 186మందితో వెళ్లిన ఎ320 నియో విమానం గాల్లోకి ఎగిరిన అనంతరం ఇంజిన్లలో ఒకటి విఫలం కావడంతో అత్యవసరంగా వెనక్కి మళ్లించారు. బయల్దేరిన 40 నిమిషాల్లోనే తిరిగి అహ్మదాబాద్‌ చేరుకుంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే డీజీసీఏ ప్రాట్‌ అండ్‌ విట్నీ ఇంజిన్ల వైఫల్యాలున్న ఎ320 నియో విమానాలు నిలిపివేత ప్రారంభించింది. ఈఎస్‌ఎన్‌450 కన్నా ఎక్కువ ఉన్న పీడబ్ల్యు1100 ఇంజిన్లు కలిగిన ఎ320 నియో విమానాలను తక్షణమే నిలిపేయాలని సోమవారం డీజీసీఏ ఆదేశించింది. విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. నిన్న ఇండిగో, గోఎయిర్‌కు చెందిన 11 విమానాలు నిలిపేయడంతో దేశవ్యాప్తంగా వందలాది మంది ప్రయాణికులు నిలిచిపోయారు. ఇండిగో ప్రతి రోజూ దాదాపు 1000 విమానాలు నడుపుతోంది. దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకు 40శాతం మార్కెట్‌ షేర్ ఉంది. గోఎయిర్‌కు 10శాతం మార్కెట్‌ షేర్‌ ఉంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top