బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట

రైతుల సాధికారిత, వారి ఆర్థికాభివృద్ధిపై కీలకంగా దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయనుంది. ఈమేరకు 2018-19లో రైతులకు రూ. 11 లక్షల కోట్ల మేర రుణాలందించేలా లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యం రూ. 10 లక్షల కోట్లు కాగా.. మరో రూ. లక్ష కోట్లు పెంచేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యవసాయం ప్రభుత్వానికి ఎంతో ప్రాధాన్య అంశం కావడంతో రైతుల అభ్యున్నతికి బడ్జెట్‌లో పలు అంశాలు ప్రకటించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులు సాధించడానికి రుణాలే కీలకం. రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవస్థాగత రుణాలను అందించడం ద్వారా.. వారు అధిక వడ్డీలకు ఇతరుల నుంచి అప్పులు తెచ్చుకోవాల్సిన అగత్యం లేకుండా చేయాలన్నది ప్రభుత్వ యోచన. అలాగే వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 1న పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా.. మార్కెటింగ్‌ సంస్కరణలు, రైతులకు కనీస మద్దతు ధరకు హామీ వంటివి ఈసారి కీలకం కానున్నాయి.

వడ్డీమాఫీకే మొగ్గు..!

రైతుల రుణమాఫీకి వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు పెరుగుతున్నప్పటికీ.. దీనికి బదులు సకాలంలో రుణాలు చెల్లించేవారికి వడ్డీమాఫీని ప్రకటించేందుకే మోదీ ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశం ఉంది. సాధారణంగా వ్యవసాయ రుణాలకు వడ్డీ 9 శాతంగా ఉంటుంది. కాగా స్వల్పకాలిక రుణాలకు (రూ. 3 లక్షల వరకు) ప్రభుత్వం 2 శాతం రాయితీ ఇస్తోంది. అందులో కూడా సకాలంలో చెల్లించేవారికి అదనంగా 3 శాతం రాయితీ ఇచ్చి కేవలం 4 శాతం వడ్డీనే వసూలు చేస్తున్నారు. రానున్న బడ్జెట్‌లో ఇలాంటి స్వల్పకాలిక వ్యవస్థాగత వ్యవసాయ రుణాలపై వడ్డీని (4 శాతం) మాఫీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని అమలుచేస్తే ప్రభుత్వంపై ఏటా కనీసం రూ. 15 వేల కోట్ల భారం పడుతుందని అంచనా. అయితే ఆర్థిక మంత్రి మరింత ఉదారంగా యోచిస్తే, సకాలంలో రుణాలు చెల్లించలేని వారికీ దీన్ని వర్తింపజేస్తూ.. మిగిలిన వడ్డీమాఫీని రాష్ట్రాలు భరించాలని కోరే అవకాశం ఉంది.

* బడ్జెట్‌లో వ్యవ‘సాయ’ అంచనాలు.. 23 పంట ఉత్పత్తులకు రైతులు కనీస మద్దతు ధర పొందేలా ‘భావంతర్‌ యోజన’ అమలు.

* వ్యవసాయోత్పత్తిదారుల సంస్థలకు (ఎఫ్‌పీవోలు) పన్ను రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలు.

* గత ఏడాది ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయింపులను రెట్టింపు చేయగా.. ఈసారి దానిపై కనీసం 10 శాతం పెంపు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top