ఒక్క గెలుపు: బాబుకు లక్, జగన్‌కు షాక్

అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం చంద్రబాబు నాయుడును విమర్శించే బిజెపిలోని నాయకులు మౌనం దాల్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి ఓడిపోతే ఏపీలో చంద్రబాబును విమర్శించే బిజెపి నేతలు పురంధేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు టిడిపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగేవారని అంటున్నారు.

నంద్యాల గెలుపుతో టిడిపి దశ తిరిగిందని అంటున్నారు. 2019 ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్‌గా అభివర్ణించారు. ఈ గెలుపుకు చంద్రబాబుకు ఎన్నో ప్లస్ పాయింట్స్ తీసుకు వచ్చిందని అంటున్నారు. ప్రజల్లో తన పాలనపై వ్యతిరేకత లేదని చెప్పుకునేందుకు అవకాశం వచ్చింది. జగన్‌లో ఇంకా పరిణితి రాలేదని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కోలుకోలేదని చెప్పుకునే అవకాశం దక్కింది.

ముఖ్యంగా పొత్తు విషయంలో బిజెపికి షాక్ తగిలిందని అంటున్నారు. ఏపీలో ఒంటరిగా ఎదిగేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో టిడిపిని దూరం పెట్టి ఒంటరిగా ముందుకు వెళ్లడం మంచిదని ఏపీ బిజెపి నేతలు ఎక్కువ మంది భావిస్తున్నారు. బిజెపి అధిష్టానం కూడా ఆ దిశలో ఆలోచన ప్రారంభించింది.

నంద్యాలలో టిడిపి ఓడిపోతే.. చంద్రబాబుపై విరుచుకుపడే ఏపీ బిజెపి నేతలు మరింత రెచ్చిపోయేవారు. ప్రజలకు బాబు పాలనపై నమ్మకం పోయిందని, మనం ఒంటరిగా వెళ్దామని ఢిల్లీ వరకు వెళ్లే అవకాశముండేది. కానీ టిడిపి గెలవడంతో వారి ఆశలు నీరుగారిపోయాయని అంటున్నారు. అదే సమయంలో బిజెపి అధిష్టానం కూడా పునరాలోచనలో పడేలా చేసిందని అంటున్నారు.

నంద్యాలలో టిడిపి గెలవడంతో ప్రధాని మోడీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. టిడిపి మాకెంతో విలువైన భాగస్వామికి అభినందనలు అని కితాబిచ్చారు. సాధారణంగా ఇందులో ప్రత్యేకత లేదు. కానీ ఇటీవల జగన్ బిజెపికి దగ్గరవుతున్నారని, టిడిపి దూరమవుతోందనే సమయంలో గెలుపుపై మోడీ ట్వీట్‌కు ప్రధాన్యత సంతరించుకుంది.

ఇటీవల జగన్ ఢిల్లీలో మోడీని కలిశారు. అప్పటి నుంచి బిజెపి - టిడిపి పొత్తుపై ప్రచారం సాగింది. హోదా కోసం తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ చెప్పారు. కానీ ఆ తర్వాత మాట మార్చారు. అలాగే వైసిపి నేతల మాటలు కూడా పొత్తు ప్రచారానికి కారణం అయ్యాయి.

మరోవైపు, బిజెపి అధిష్టానం కూడా తమ మనసులో ఏం ఉందో బయటకు వెల్లడించకపోయినా చంద్రబాబుతో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది. రాష్ట్ర బిజెపిలో ఒక వర్గం నేతలు మాత్రం టిడిపితో తమ ప్రయాణం తాత్కాలికమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

నంద్యాలలో వైసిపి గెలుస్తుందని, టిడిపికి అవకాశం లేదని కూడా కొందరు నేతలు బిజెపి అధిష్టానానికి చెప్పారని తెలుస్తోంది. దీంతో ఢిల్లీ పెద్దలు వేచి చూసే ధోరణి అవలంభించారు. కానీ ఫలితం వచ్చాక మోడీ ట్వీట్‌తో అంతా తేలిపోయిందని అంటున్నారు. అది చంద్రబాబుకు ఊరట కలిగించే విషయం కాగా, జగన్‌కు నంద్యాల ఓటమితో పాటు ఇది మరో షాక్ అంటున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top