దెబ్బ మీద దెబ్బ.. శశికళ పరిస్థితేమిటో?

చెన్నై : ఇప్పటికే అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. ఆమె ఏది అనుకుంటే దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది. విధి వెక్కిరించడం, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచే అనే మాటలు ప్రస్తుతానికి శశికళ విషయంలో నిజమేమో అనిపించక మానదు.. ఆమె విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ‘చిన్నమ్మ’ శశికళ చేతికి పార్టీ పగ్గాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం, పన్నీర్‌ సెల్వంను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేయడం తర్వాత పార్టీలో చీలిక రావడం మొదలైంది. సరిగ్గా తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు అనుకునే సందర్భంలోనే అప్పటి వరకు ఎలాంటి కదలిక లేని ఆస్తులకు మించిన ఆదాయం కేసు కాస్త ఒక్కసారిగా ఆమెపై పిడుగులాగా పడింది. ఈ కేసులో దోషిగా తేలడంతో ఆమె ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో ఆమెకు మొత్తం నాలుగేళ్ల జైలు శిక్ష పడగా దాదాపు రూ.10కోట్ల జరిమానా కూడా పడింది. అవి చెల్లించలేకుంటే మరో 13 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే 2014లో ట్రయల్ కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా ప్రస్తుతం ఉన్న జైల్లోనే అప్పట్లో ఆమె 21 రోజుల జైలు శిక్ష అనుభవించారు. దాని ప్రకారం మూడు సంవత్సరాల 11 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఫిబ్రవరి 14న జైలుకెళ్లిన ఆమె అక్కడి నుంచే చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఎవరూ ఊహించని విధంగా పళనీ స్వామిని ముఖ్యమంత్రిని చేయడం, పార్టీ బాధ్యతలు దినకరన్‌ చూసుకునే ఏర్పాట్లు చేయడంలాంటి పరిణామాలు జరిగాయి. దినకరన్‌ను ఉంచడం ద్వారా తన చేతిలోకి ఎప్పటికైనా పార్టీ పగ్గాలు వస్తాయని భావించింది. అయితే, సీఎం పదవి నుంచి పక్కకు తప్పించిన పన్నీర్‌ సెల్వం కాస్త పట్టువీడని విక్రమార్కుడిలా మారి అమ్మపేరిట ప్రజల్లోకి వెళుతూ శశికళ, దినకరన్‌ వర్గాన్ని ఎండగట్టే యత్నం మొదలుపెట్టారు. చివరకు దినకరన్‌ ఆదిపత్యం చెలాయిస్తుండటం అన్నాడీఎంకే పార్టీలో కొంతమంది నేతలకు నచ్చకపోవడంతోపాటు, వారి కారణంగా తామెందుకు విడిపోవాలనే ఆలోచనలోకి వచ్చిన పళనీ, పన్నీర్‌ వర్గాలు కాస్త ఒక్కటయ్యాయి. ఏకంగా ప్రత్యేక కౌన్సిల్‌ మీటింగ్‌ పెట్టి అసలు పార్టీకి శశికళకు, దినకరన్‌కు ఏ సంబంధం లేదని, వారిని పార్టీ నుంచి, అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు తాజాగా తీర్మానం చేశారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన చిన్నమ్మకు దెబ్బమీద దెబ్బలు తగలడం మొదలుపెట్టాయి. తాజా పరిణామాల నేపథ్యంలో శశికళ ఎలాంటి వ్యూహం పన్నుతారో వేచి చూడాల్సిందే.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top