రైతన్నకు చంద్రబాబు శఠగోపం

హైదరాబాద్/ అమరావతి: అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీల అధినేతలు, నేతలు రకరకాల కబుర్లు చెప్తుంటారు. అందునా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెరీ స్పెషల్.. ఆయన చెప్పిన మాటకు.. ఇచ్చిన హామీకి ఆచరణ భిన్నంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్తున్నారు.

1995 - 2004 మధ్య ఉమ్మడి ఏపీ సీఎంగా ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాలు అమలుజేసి.. తనకు తాను 'ఆంధ్రప్రదేశ్ సీఈఓ'నని మహా మనీషి చంద్రబాబు. 2004 - 14 మధ్య కాలంలో విపక్ష నేతగానూ చంద్రబాబు రికార్డు నెలకొల్పారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించేందుకు రకరకాల హామీలతో ప్రజలను మెప్పించి.. ఒకింత నాటి రాష్ట్ర విభజనకు పాల్పడినందుకు కాంగ్రెస్ పార్టీపై కక్ష, ద్వేషం పెంచి మరీ యావత్ ఆంధ్రుల మద్దతు కూడగట్టి.. విజయం సాధించారు.

10 ఏళ్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మామూలు చంద్రబాబుగా మారిపోయారని ఆయన ప్రత్యర్థులు.. రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలు సంగతేమిటోగానీ కేంద్రం నుంచి ప్రక్రుతి విపత్తు సందర్భంగా పంటల నష్ట పరిహారం చెల్లింపునకు ఎగనామం పెట్టేందుకు పూనుకున్నారు.

అసలు సంగతేమిటంటే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విపత్తు బాధిత రైతులకు రూ.2350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు ఎగవేసిన చంద్రబాబు సర్కారు కరువు రైతులకు తాజాగా మరో రూ.500 కోట్లు శఠగోపం పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.

పంటల బీమాకు, పెట్టుబడి రాయితీని లింకు పెట్టి రైతులకు రూ.500 కోట్లు శఠగోపం పెట్టడానికి సర్కార్ జారీచేసిన కుట్ర ఉత్తర్వులు బయటకు పొక్కడం పట్ల వ్యవసాయశాఖ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గమ్మత్తేమిటంటే పంటల బీమా కోసం రైతులు ప్రీమియం చెల్లించినా ఆ మొత్తం నిధులు ఇవ్వకుండా నిరాకరించడం ప్రభుత్వ పాలనను తెలియజేస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి.

‘ఇలా రహస్య సమాచారం బయటకు వెళుతుంటే ఏమి చేస్తున్నారు? లీక్ వీరులెవరో నిఘా వేసి కనిపెట్టండి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి. ఎవరు పడితే వారు మీడియాతో మాట్లాడకుండా కట్టడి చేయండి' అని వ్యవసాయశాఖ ఉన్నతాధికారికి హుకుం జారీ చేశారు. ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కు తీసుకోని పక్షంలో జిల్లా, డివిజనల్‌ కేంద్రాల్లో ఆందోళనకు దిగుతామని రైతు సంఘాలు, విపక్ష నేతల హెచ్చరికల ఫలితంగానే చంద్రబాబు సర్కార్ దిగి వచ్చింది. అందులో భాగంగా పంటలబీమా, పెట్టుబడి రాయితీ వేర్వేరుగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని శనివారం సీఎం ఇచ్చిన ఆదేశం మేరకు వ్యవసాయ అధికారులు తాజాగా కొత్త గైడ్‌లైన్స్ తయారుచేశారు.

రాయలసీమ నాలుగు జిల్లాల్లోని రైతులకు రూ.1597.51 కోట్ల పెట్టుబడి రాయితీ, రూ. 534 కోట్ల పంటల బీమా కలిపి మొత్తం రూ. 2131.51 కోట్లు, కోస్తాలోని ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పంటలు కోల్పోయిన రైతులకు రూ.82.51 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని వ్యవసాయశాఖ అధికారులు గణాంకాలు రూపొందించారు. ఆధార్‌ ఆధారిత రైతుల బ్యాంకు ఖాతాలకు పెట్టుబడి రాయితీ, పంటల బీమా మొత్తాలను ఆన్‌లైన్‌ ద్వారా జమ చేయాలని మార్గదర్శకాలను వ్యవసాయశాఖ ఆయా జిల్లాల అధికారులకు ఆదివారం జారీ చేసింది. కోస్తా జిల్లాల్లో కరువు బాధిత రైతులకు మాత్రం పాత నిబంధనలు ప్రకారమే పెట్టుబడి రాయితీ పంపిణీ చేయాలి. రాయలసీమ జిల్లాల రైతులకు మాత్రం ఆదివారం జారీచేసిన కొత్త మెమో ప్రకారం పంటల బీమా, పెట్టుబడి రాయితీ ఇవ్వాలని వ్యవసాయశాఖ పంపిన ఈ - మెయిల్‌ ఆదేశాలు ఆదివారం క్షేత్రస్థాయి అధికారులకు అందాయి.

పంటల బీమాకు, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టి కరువు పీడిత అన్నదాతలకు తీవ్ర అన్యాయం చేయాలని ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే 2016 ఖరీఫ్‌లో కరువు వల్ల పంట ఎండిపోయి పెట్టుబడులు కోల్పోయిన అన్నదాతలకు పెట్టుబడి రాయితీ లేదా పంటల బీమా.. రెండూ కలిపీ అయినా హెక్టారుకు గరిష్టంగా రూ.15 వేలు మాత్రమే చెల్లించాలని వ్యవసాయ అధికారులకు తాజాగా అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. జీవో జారీ చేస్తే అందరికీ తెలిసి రచ్చఅవుతుందనే భావనతో రహస్యంగా మెమో పంపింది. కానీ విపక్షాలు, రైతు సంఘాలు బయటపెట్టడంతో చేసేదేమీ లేక రాయితీ, బీమా చెల్లింపునకు చర్యలు తీసుకున్నది. ప్రతిపక్ష పార్టీల ఆందోళన ఫలితంగానే వాతావరణ బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వేర్వేరుగా అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, అంతే తప్ప ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఇది విపక్షాల విజయమని తెలిపారు.

రాయలసీమలో వేర్వేరుగా, కోస్తా ప్రాంతంలో పంటల బీమా, కరువు ప్రాంతాల్లో పెట్టుబడి రాయితీల్లో ఒకటి మాత్రమే చెల్లించేందుకు చర్యలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. దీంతో 2016 ఖరీఫ్‌లో పంటల సాగుకు పంట రుణాలు తీసుకున్న వారి వివరాల సేకరణలో వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు. వాస్తవంగా పంటల బీమా, పెట్టుబడి రాయితీ రెండూ పొందడానికి రైతులు అర్హులే. ఇప్పటి వరకూ ఇలాగే పొందుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు సర్కార్ ఈ రెండింటికీ లింకు పెట్టి బక్క రైతులకు అన్యాయం చేయడానికి ఒడిగట్టిందని వ్యవసాయ అధికారులు సైతం విమర్శిస్తున్నారు.

పెట్టుబడి రాయితీని బీమాతో ముడిపెట్టి రైతులకు అన్యాయం చేయాలన్న ప్రభుత్వ ఎత్తుగడతో పంపిణీలోనూ జాప్యం జరుగుతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో పంట ఎండిపోయిన రైతులకు కేంద్రం రాష్ట్రానికి పెట్టుబడి రాయితీ విడుదలచేసి మూడు నెలలు దాటింది. బాధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి రాయితీని అన్‌లైన్‌ ద్వారా జమ చేయాలని ఆర్థిక శాఖ గత నెల 31వ తేదీన నిధులు విడుదల చేసింది. తక్షణమే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రాష్టంలోని 268 మండలాల్లోని 13.21 లక్షల మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి రాయితీ జమ చేయాలని వ్యవసాయ కమిషనర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఈ నెల ఒకటో తేదీన 67వ నంబర్ జారీచేసింది. ఇందుకు రూ.1680.05 కోట్లు వ్యవసాయ శాఖ కమిషనర్‌ పేరిట విడుదల చేసింది. ఈ జీవోలో ఎక్కడా పంటల బీమాతో ముడిపెట్టినట్లు ఒక్క అక్షరం కూడా లేదు. ఈ ఉత్తర్వులు వచ్చి 15 రోజులు గడిచినా రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదు.

గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సగంపైగా మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. సగం మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉన్నా కలెక్టర్ల ప్రతిపాదనలను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకోకుండా 2016 అక్టోబర్ 21, నవంబర్ 12 తేదీల్లో 268 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. కరువు మండలాల ప్రకటనలో అన్యాయం జరిగిందని తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో 33 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. కరువు మండలాల సంఖ్య 301కి చేరినా ప్రభుత్వం కేవలం 268 మండలాల రైతులకే పెట్టుబడి రాయితీ విడుదల చేయడం ఆసక్తికర పరిణామం. వీరికీ రాయితీ లేదా బీమా చెల్లింపుల్లో ఏదో ఒకటి చెల్లించేందుకు మాత్రమే అందునా అంతర్గత ఆదేశాల ద్వారా రూ.500 కోట్ల ఎగవేతకు కుట్ర పన్నింది.

ప్రభుత్వ నిర్ణయం వల్ల అనంతపురం జిల్లా రైతులు దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం అమలైతే ఒక్క అనంతపురం జిల్లా వేరుశనగ రైతులే రూ.370 కోట్లు పైగా పెట్టుబడి రాయితీని కోల్పోవాల్సి వస్తుందని అంచనా. ప్రస్తుతం విపత్తుల వల్ల వేరుశనగ పంట దెబ్బతింటే హెక్టారుకు రూ.15 వేలు పెట్టుబడి రాయితీ అమల్లో ఉంది. గత ఖరీఫ్‌లో వేరుశనగ పంట 90 శాతం పైగా ఎండిపోయింది. బీమా కంపెనీలు, వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి హెక్టారుకు గరిష్టంగా రూ.16 వేలు చెల్లించాలని లెక్క కట్టారు. గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతులకు చెల్లించేందుకు బీమా సంస్థ రూ.576 కోట్లు మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం పంటల బీమా, పెట్టుబడి రాయితీ కలిపి హెక్టారుకు రూ.15 వేలు చెల్లించాలని నివేదికలు రూపొందించడం గమనార్హం. ఉదాహరణకు ఒక రైతుకు పంటల బీమా హెక్టారుకు రూ.10 వేలు వచ్చిందనుకుంటే దానికి రూ.5 వేలు (రూ.15 వేలు బదులు) పెట్టుబడి రాయితీ కలిపి 15 వేలు చెల్లిస్తారు. బీమానే రూ.15 వేలు వస్తే పెట్టుబడి రాయితీ అసలు ఇవ్వరు.

రాష్ట్రంలో గత ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 9.30 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగైంది. ఇందులో ఒక్క అనంతపురం జిల్లాలోనే 6.10 లక్షలు, కర్నూల్‌లో 1.14 లక్షలు, చిత్తూరులో 1.34 లక్షల హెక్టార్లలో సాగవుతున్నది. రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులకు వేరుశనగ పంటల బీమా కింద రూ.576 కోట్లు మంజూరైంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 5.22 లక్షల మంది పంటల బీమా ప్రీమియం చెల్లించారు. మిగిలిన మూడు జిల్లాలు కలిపితే పంటల బీమా ప్రీమియం చెల్లించిన రైతుల సంఖ్య ఆరు లక్షల మందికి పైగానే ఉంటారు. ప్రస్తుత విధానం ప్రకారం వీరికి పంటల బీమా, పెట్టుబడి రాయితీ రెండూ చెల్లించాలి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top