మరో అరుదైన‌ మైలురాయి సాధించిన ఇస్రో

శ్రీహ‌రికోట‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అరుదైన‌ మైలురాయి సాధించింది. నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రంనుంచి వందో ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించి విజ‌య‌వంతంగా క‌క్ష్యలోకి ప్రవేశ‌పెట్టింది. శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్ర‌వేశ‌పెట్టింది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2ఇ, ఒక నానో శాటిలైట్‌, ఒక సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి. భార‌త్ త‌న వందో ఉప‌గ్రహాన్ని ప్ర‌వేశ‌పెట్టడంతో ప్రపంచ దేశాలు ఈ ప్రయోగాన్ని ఆస‌క్తిగా గ‌మ‌నించాయి.

గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తరలించిన ఘనత ఇస్రో సొంతం. ఆ ప్రయోగంతో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది. 2013లో అమెరికా 29, 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించాయి. ఆ రికార్డులను భారత్‌ బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డుకు చేరుకుంది. ఈ దఫా మొత్తం 31 ఉపగ్రహాలు ప్రయోగించ‌గా.. వాటిలో 28 విదేశాలకు చెందినవి. ప్రధానంగా ‘కార్టోశాట్‌-2’ సిరీస్‌లోని కీలకమైన ఉపగ్రహం భారత్‌కు చెందినది. దీనితో పాటు మైక్రో, నానో (ఐఎన్‌ఎస్‌)లు మనదేశానివి.

ఆకాశ నేత్రం:

ఇప్పటివరకు ‘కార్టోశాట్‌’ సిరీస్‌లో ఆరు ఉపగ్రహాలను ప్రయోగించగా తాజాగా ఏడో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. 710 కేజీల బరువు కలిగిన ‘కార్టోశాట్‌’లో అత్యాధునికమైన కెమెరాలను అమర్చారు. భూమి మీద నిర్దిష్ట ప్రదేశానికి సంబంధించి హైరిజల్యూషన్‌ చిత్రాలను అందించడం కార్టోశాట్‌-2ఇ ఉపగ్రహ ప్రత్యేకత. కార్టోశాట్‌-2 శ్రేణిలో ఇది మూడో ఉపగ్రహం. ఇందులో పాన్‌క్రొమాటిక్‌, మల్టీ స్పెక్ట్రల్‌ కెమెరాలు ఉంటాయి. హై రిజల్యూషన్‌ డేటాను అందించడంలో వీటికి తిరుగులేదు. పట్టణ, గ్రామీణ ప్రణాళిక; తీర ప్రాంత వినియోగం, నియంత్రణ; రోడ్డు నెట్‌వర్క్‌ పర్యవేక్షణ, నీటిపంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌ల తయారీ; భౌగోళిక, మానవ నిర్మిత అంశాల్లో మార్పు పరిశీలన వంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

అయిదేళ్లు పనిచేసే ఈ ఉపగ్రహంతో మన పొరుగుదేశాలపైనా నిత్యం నిఘావేసి ఉంచే సదుపాయం కలుగుతుంది. ఈ కెమెరాలు భూమిపై ఒక మీటర్‌ పరిధిని కూడా స్పష్టంగా చిత్రీకరించి త్వరితంగా ఉండే నియంత్రణ కేంద్రాలకు పంపగలవు. ఇప్పటికే అంతరిక్షంలో సేవలందిస్తున్న ‘కార్టోశాట్‌’ తరగతికి చెందిన ఉపగ్రహాలు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని అందివ్వడం గమనార్హం. తాజా ‘కార్టోశాట్‌’తో పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కచ్చితత్వంతో కూడిన రేఖాచిత్రాలను తయారుచేసే సౌలభ్యం లభిస్తుంది. మన దేశానికి మూడువైపులా సువిశాలమైన సముద్రతీరం ఉంది. తీరప్రాంత భూముల సమర్థ వినియోగం, జలాల పంపిణీ, రహదారి నిర్వహణకు సంబంధించి సమగ్రమైన వ్యవస్థపై దృష్టి తదితర అంశాల్లోనూ వీటి సేవలను పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కచ్చితమైన సమాచారం అందుబాటులోకి రానుంది. దీంతో ఈ ప్రాజెక్టుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top