దేశంలోనే అతి పెద్ద మెట్రోస్టేషన్‌ అమీర్‌పేటలో

హైదరాబాద్‌ : ఎనిమిది లిఫ్ట్‌లు, 16 ఎస్కలేటర్లు, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ ధగధగలు, ఎయిర్‌కండిషన్డ్‌ ప్రాంగణం, షాపింగ్‌ కోసం దుకాణాలు, వినోద కేంద్రాలు.. ఇవన్నీ ఏ విమానాశ్రయంలోని ఏర్పాట్లో కాదు. హైదరాబాద్‌ మెట్రోరైల్‌కే మణిమకుటంగా నిలవనున్న అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లోని వసతులు. దేశంలోనే అతి పెద్ద మెట్రోస్టేషన్‌ అమీర్‌పేటలో అత్యాధునికంగా రూపుదిద్దుకుంటోంది. మూడు అంతస్తుల్లో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ నిర్మిస్తున్నారు. గడువులోగా నిర్మాణం పూర్తి చేసేందుకు దాదాపు 1200 మంది కార్మికులు, ఇంజినీర్లు పగలూ రాత్రీ పనులు చేస్తున్నారు. అత్యంత కీలకం: మియాపూర్‌ నుంచి అమీర్‌పేట మీదుగా నాగోల్‌ వరకు ప్రారంభమయ్యే 30 కి.మీ. మెట్రో ప్రాజెక్ట్‌కు అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషనే కీలకం. మియాపూర్‌లో మెట్రో ఎక్కిన ప్రయాణికుడు సికింద్రాబాద్‌ వెళ్లాలంటే అమీర్‌పేటలో మారాలి. పై అంతస్తులో దిగే ప్రయాణికుడు కింది అంతస్తుకు వచ్చి నాగోల్‌ వెళ్లే మెట్రో ఎక్కాలి. రోజుకు 40 వేల మంది ప్రయాణికులు స్టేషన్‌కు వస్తారని అంచనా. ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ కాబట్టి ఏకకాలంలో ఆరు వేల మంది వచ్చినా రద్దీ ఏర్పడకుండా లిఫ్ట్‌లు, మెట్లు, ఎస్కలేటర్లు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు ఒక ప్రకటనలో తెలిపింది. పునర్వినియోగ వ్యర్థాలతో రూపొందించిన నిర్మాణ సామగ్రితో తక్కువ వేడి ఉండేలా, తక్కువ విద్యుత్తు వినియోగించేలా, పర్యావరణానికి హాని చేయని విధంగా స్టేషన్‌ను నిర్మించినట్లు వెల్లడించింది.

ఇవీ ప్రత్యేకతలు

* మెట్రో రైలు ప్రతి స్టేషన్‌లో 20 సెకన్లు ఆగుతుంది. అమీర్‌పేట స్టేషన్‌లో 2 నిమిషాలు నిలుపుతారు.

* 142 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు కలిగిన ఈ స్టేషన్‌ నిర్మాణానికి 25 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ ఉపయోగించారు.

* స్టేషన్‌ పైకప్పులను మిగతా స్టేషన్ల కంటే భిన్నంగా డిజైన్‌ చేశారు. నిర్మాణం చివరలో టెట్రాహైడ్రన్‌ స్టీల్‌ కాలమ్స్‌ నిర్మించారు.

* స్టేషన్‌ ప్రధాన ప్రాంతంలో గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ చేశారు.

* 33 కేవీ ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా చేస్తారు. అంతరాయం తలెత్తకుండా 400 కేవీఏ డీజిల్‌ జనరేటర్లు సిద్ధం చేశారు. ప్రతి కారిడార్‌లో యూపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

* ఎలక్ట్రికల్‌, ఇతర ముఖ్యమైన సేవలను ఉప్పల్‌లోని ఆపరేషన్‌ కంట్రోల్‌ స్టేషన్‌ నుంచి పర్యవేక్షిస్తారు.

* లక్ష లీటర్ల సామర్థ్యం కల్గిన సంప్స్‌ ద్వారా స్టేషన్‌ అవసరాలతో పాటూ అత్యవసర సమయంలో నీటిని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.

* వర్షపు నీటి సంరక్షణ ఏర్పాట్లు చేశారు.

* స్టేషన్‌కు నాలుగు వైపుల నుంచి ఎక్కి దిగడానికి 8 లిఫ్ట్‌లు, 16 ఎస్కలేటర్లు, అన్నివైపులా మెట్ల మార్గాలను నిర్మించారు.

* తక్కువ విద్యుత్తు వినియోగించేలా ఎయిర్‌కండిషనింగ్‌ చేశారు. ఎల్‌ఈడీ లైట్లు వినియోగిస్తున్నారు.

* రిటైల్‌తో పాటూ వినోద కేంద్రాలూ దీనిలో ప్రధాన ఆకర్షణ.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top