కబ్జాకు గురైన వక్ఫ్‌ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వ్యూహాలు

తెలంగాణలో కబ్జాకు గురైన వక్ఫ్‌ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వ్యూహాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఆయా భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు. వక్ఫ్‌ భూములన్నీ గుర్తించి కలెక్టర్ల ఆధీనంలో పెట్టాలని, భూముల చుట్టూ ప్రహరీలు, కంచెలు నిర్మించాలని సూచించారు. కేంద్ర వక్ఫ్‌ చట్టానికి అనుగుణంగా తెలంగాణ వక్ఫ్‌ చట్టాన్ని రూపొందించాలన్నారు. గురువారమిక్కడ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ సలీం, సీఈవో మన్నన్‌, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్‌, భూపాల్‌రెడ్డి, బోర్డు సభ్యులతో సీఎం సమీక్ష నిర్వహించారు. భూదస్త్రాల ప్రక్షాళనలో వక్ఫ్‌ భూములను గుర్తించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని, వాటి పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వక్ఫ్‌ ఆస్తులు ఎక్కడున్నాయి? ఏ స్థితిలో ఉన్నాయి? వివరాలు తీసుకోవాలని చెప్పారు. రెవెన్యూ శాఖ, వక్ఫ్‌ బోర్డుకు మధ్య వివాదాలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఒకసారి వక్ఫ్‌ ఆస్తిగా నిర్ధారిస్తే ఎప్పటికీ అది అలాగే ఉంటుందని స్పష్టం చేశారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు రెండు కమిటీలను వేస్తామన్నారు. ఒక కమిటీ రికార్డుల నిర్వహణను పర్యవేక్షిస్తుందని, రెండోది క్షేత్రస్థాయిలో ఆస్తులను గుర్తించి రక్షణ చర్యలు చేపడుతుందని వెల్లడించారు. వక్ఫ్‌ భూముల పరిరక్షణలో కలెక్టర్లు సహకరించాలని సూచించారు. వక్ఫ్‌ బోర్డు విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేయాలని నిర్దేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, వక్ఫ్‌ బోర్డు సభ్యులు మోజంఖాన్‌, అక్బర్‌ నిజాముద్దీన్‌, సయ్యద్‌ జకీరుద్దీన్‌, పాషా అనుషద్‌, ఇక్బాల్‌, అన్వర్‌, నిసాన్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top