పెద్దాయనకు పెద్ద పదవి ఇస్తేనే సయోధ్య!

రాజకీయాల్లో ఉన్న వారికి అస్సలు ఉండకూడనిది ఏమైనా ఉందంటే అది.. అహంకారం. ఇది కానీ వచ్చిందా? ఎంత పోటుగాడైన నేతకైనా పోయే కాలం వచ్చినట్లే. టీ అమ్మేవాడు దేశ ప్రధాని కాకూడదా? అంటూ ప్రశ్నించిన మోడీని భారతావని అక్కున చేర్చుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పాలనా స్టైల్ తెలిసి కూడా.. ప్రధాని కుర్చీలో కూర్చునేందుకు అవసరమైన పరిణితి ఆయనకు వచ్చిందని.. ఆ కుర్చీలో కూర్చున్నాక ఆయన తీరు మారుతుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.

వ్యక్తిత్వ వికాస నిపుణుడిలా స్పీచులు దంచే మోడీ.. తన మాటలతో దేశ ప్రజల మనసుల్ని దోచుకున్నారు. ఆయనపై సందేహాలు ఉన్నప్పటికీ.. అవన్నీ నిజం కావన్న ఒక ఆశ మోడీని నమ్మేలా చేసింది. అదే.. ఆయనకు తిరుగులేని అధికారాన్ని చేతికి ఇచ్చింది. అరుదుగా వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకోవటం తెలివైన వారు చేసే పని. తెలివికి తక్కువ లేకున్నా.. రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ ఉండకూడదన్నట్లు.. తన వర్గం మినహా మరెవరూ కీలక స్థానాల్లో ఉంచటం ఇష్టం లేనితనంతో పాటు.. అందరిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలన్న పెద్ద మనసు మోడీకి లేదన్న విషయం చాలా త్వరగానే దేశ ప్రజలకు అర్థమైంది.

ఇదే.. ఆయన్ను నాలుగేళ్ల కాలంలోనే ఎక్కువ మందికి దూరం చేసింది. 2014 ఎన్నికలకు ముందుగా మోడీని ప్రధాని చేయాలన్న ఆకాంక్ష ఎంత ఎక్కువగా వినిపించేదో.. నాలుగేళ్ల వ్యవధిలోనే అది కాస్తా.. ఏది ఏమైనా సరే ఈసారి మోడీని ప్రధానమంత్రిని చేయకూడదన్న కోపం సామాన్యుడు మొదలు అసమాన్యుల వరకూ ఎక్కువైంది. దీని ఫలితమే ఇటీవల వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు.

కొన్ని విజయాల్ని తలకెక్కించుకున్న మోడీ.. తాను.. తన సన్నిహితుడు అమిత్ షాతో పాటు మరికొందరు మినహా మిగిలిన వారెవరికీ ఎలాంటి కీర్తి దక్కకూడదన్న తత్త్వం ఎక్కువగా ఆయన తీరులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న విమర్శ ఉంది. అన్నింటికి మించి తనకు రాజకీయ గురువుతో పాటు.. తన పొలిటికల్ కెరీర్ కు పలుమార్లు ప్రాణదానం చేసిన పెద్దాయన అద్వానీ విషయంలో మోడీ అనుసరించిన తీరు ఆయనకు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. పోయిన చోటనే వెతుక్కోవాలన్న విషయాన్ని గుర్తించిన మోడీ ఇప్పుడుఅద్వానీతో సహా మురళీమనోహర్ జోషి లాంటి పెద్దలతో రాజీకి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మోడీ తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న అద్వానీ.. మురళీ మనోహర్ జోషి లాంటి వారు తమ అసంతృప్తిని బాహాటంగా చెప్పేందుకు ప్రయత్నించినా.. వారి నోటి నుంచి మాట రాకుండా చేసేందుకు మోడీ అండ్ కో చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. వారి చుట్టూ నిత్యం మోడీషా ఏర్పాటు చేసిన ప్రత్యేక దళం ఒకటి నిర్విరామంగా పని చేస్తుంటుందని.. వారి అసంతృప్త మాట నోటి నుంచి బయటకు వచ్చే సమయానికి వారిని అడ్డుకోవటం లాంటివి చేస్తారన్న ఆరోపణ ఉంది.

తాజాగా మోడీకి ఎదురుగాలి భారీగా వీస్తుండటంతో.. దిద్దుబాటు చర్యలకు తెర తీశారు. ఇందులో భాగంగా అద్వానీ.. మురళీ మనోహర్ జోషిలాంటి వారిని బుజ్జగించి.. వారిని 2019 ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తున్నారు. అయితే.. బీజేపీతోపాటు.. బీజేపీ పెద్దల్ని అభిమానించే సామాన్యుల వరకూ ఇప్పుడో విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. మోడీ అవసరం కోసం పెద్దలు వెనక్కి తగ్గకూడదని.. బీజేపీలో మోడీ బలగానికి ప్రాధాన్యత తగ్గించి.. పార్టీ కోసం కష్టపడే నిజాయితీ పరులకు పెద్దపీట వేయటం.. అద్వానీ.. మురళీ మనోహర్ జోషి లాంటి పెద్దలకు సముచిత స్థానంలో కూర్చొబెడితేనే రాజీకి అంగీకరించాలని చెబుతున్నారు. అన్నింటికి మించి బీజేపీని ఈ స్థాయికి తేవటంలో కీలక పాత్ర పోషించిన అద్వానీ లాంటి పెద్దాయనకు రాష్ట్రపతి పదవిని ఇప్పించాల్సిన అవసరం ఉంది. కానీ.. మోడీ కారణంగా అది కాస్తా మిస్ అయ్యింది. దీనికి తగిన మూల్యాన్ని మోడీషాలు చెల్లించాలన్న మాట బీజేపీలోని ఒక వర్గం బలంగా వినిపిస్తోంది. మరి.. ఇలాంటి వాటికి మోడీషాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top