రాష్ట్రంలో కొత్తగా మరో 40 పురపాలక సంఘాలు

రాష్ట్రంలో కొత్తగా మరో 40 పురపాలక సంఘాలు ఏర్పాటు కానున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా 15 వేలకు మించి జనాభా ఉన్న మేజర్‌ గ్రామపంచాయతీలు పురపాలక సంఘాలుగా మారుతాయన్నారు. ప్రస్తుతం ఉన్న పురపాలక సంఘాల పరిధిని విస్తరించేందుకు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను ఆయా సంఘాల్లో విలీనం చేస్తామని వెల్లడించారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, సీడీఎంఏ డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పట్టణాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తూ పాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసం పురపాలక సంఘాల పరిధిని పెంచాల్సిన అవసరముందని కేటీఆర్‌ అన్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కొత్తగా 40 పురపాలక సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బాన్స్‌వాడ, నర్సాపూర్‌, రామాయంపేటల నుంచి వినతులు వచ్చాయన్నారు. పట్టణీకరణతో వచ్చే సమస్యలను కొత్త మున్సిపాలిటీలతో ఎదుర్కొనే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంలో 15 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీల వివరాలు అందించాలని ఆదేశించారు. పంచాయతీల పాలకవర్గాల కాలపరిమితి వచ్చే జులైతో ముగియనున్న నేపథ్యంలో ఎంపిక చేసిన పంచాయతీలను డీనోటిఫై చేసి చట్టబద్ధంగా పురపాలక సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. నూతన పురపాలక సంఘాల ఏర్పాటు, ప్రస్తుత వాటిలో గ్రామాల విలీనానికి సంబంధించి గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2018 ర్యాంకుల్లో తెలంగాణ పట్టణాలను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆస్కి రూపొందించిన స్వచ్ఛసర్వేక్షణ్‌ 2018 సీడీని విడుదల చేశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top