24 గంటల విద్యుత్ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది

‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితుల్లో తెరాస కార్యకర్తలనే నియమిస్తాం...అటుకులే తిన్నారో...అన్నమే తిన్నారో...14 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డారు. తెలంగాణ పునర్‌ నిర్మాణంలోనూ వాళ్లే ఉంటారు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుండబద్దలు కొట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)లో 56 లక్షల మందికి సభ్యత్వం ఉంది.సభ్యత్వం ఉంటే వారు రైతులు కాదా?వారికి సమితుల్లో చోటు ఇవ్వొద్దా? అని ఆయన ప్రశ్నించారు. రైతులకు రూ.8 వేల పెట్టుబడి సహాయం...రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై శాసనసభలో సోమవారం స్వల్ప చర్చ సాగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు చిన్నారెడ్డి, ప్రభాకర్‌, కౌసర్‌ మోహియుద్దిన్‌ రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై పలు సందేహాలు లేవనెత్తారు. వాటికి సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ‘ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొట్టే వారిని రైతు సమన్వయ సమితుల్లో పెట్టేది లేదు. మిమ్మల్ని నమ్మి మీ వారిని ఎలా పెడతాం. తెరాస కార్యకర్తలే ఉంటారు. అంకితభావంతో పనిచేసేవారినే నియమిస్తాం. మా నిర్ణయం తప్పయితే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. ఈ కమిటీలు ప్రభుత్వానికి, వ్యాపారులకు, రైతుల మధ్య అనుసంధానంగా ఉంటాయి. వారధిగా పనిచేస్తాయి. వ్యాపారులు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకుంటే సమితులే కొంటాయి. ఇక వారు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించడంలో వేలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అలాంటిదేమీ లేదు.

రూ.8 వేల పెట్టుబడిని కౌలు రైతులకివ్వాలని అడుగుతున్నారు. కౌలుదారుల చట్టం అత్యంత ప్రమాదకరమైంది. నిజమైన రైతులు భూమిని అమ్ముకోరు. కౌలుదార్ల చట్టం వస్తే ఆ రైతులు భూమిని కాపాడుకోరు. మా ప్రథమ ప్రాధాన్యం భూమి అసలుదార్లే. కౌలు రైతుల పేరిట అసలుదారులు మునగడం సరికాదు. ఏదైనా ఉంటే రైతులు, కౌలుదారులే చూసుకోవాలి. ఈసారి సమృద్ధిగా విద్యుత్తు ఇస్తున్నాం. చెరువులు, కుంటల్లో నీరు బాగుంది. 95 శాతం రైతులు తామే సొంతగా సాగు చేసుకుంటామని చెబుతున్నారు.’

అన్ని విభాగాలుంటే ఆ కమిటీలెందుకు?

వ్యవసాయ శాఖ, మార్కెటింగ్‌, సహకార సొసైటీ, పంచాయతీలు...ఇలా ఎన్నో శాఖలు, విభాగాలు, వ్యవస్థలుండగా రైతు సమన్వయ సమితులు ఎందుకని అడుగుతున్నారు. తెదేపా హయాంలో రెండు లక్షల రైతు మిత్ర బృందాలు ఎందుకు ఏర్పాటు చేసినట్లు? అందుకు రూ.350 కోట్లూ కేటాయించారు. ఇక 2007లో 50 వేల మందిని ఆదర్శ రైతులుగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ ఎందుకు నియమించారు? వారిలో కూలీలు, డ్రైవర్లు, మెకానిక్‌లు కూడా ఉన్నారు. ఇదేమని అసెంబ్లీలో అడిగితే మీరూ కాంగ్రెస్‌లో చేరండి...ఇస్తామని సమాధానమిచ్చారు. అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ఇందిరమ్మ కమిటీలు ఎందుకు? అయినా వ్యవసాయానికి స్థానిక సంస్థలకు సంబంధం లేదు. స్థానిక సంస్థలకు 26 రకాల అధికారాలిచ్చామని చెప్పారు...ఎక్కడైనా అమలవుతుందా? చట్ట సవరణ తెచ్చిన తర్వాత మీ 10 ఏళ్ల కాంగ్రెస్‌ హయాంలో ఎందుకు అమలు చేయలేకపోయారు? ఇక ఉపాధి కూలీలకు కూడా భాజపా ప్రభుత్వం దిల్లీ నుంచి కూలి డబ్బులు వేస్తోంది. ఇక్కడ రాష్ట్రం లేదా? ఇంకా చెప్పాలంటే మేం ఎక్కడా పక్షపాతం చూపించడం లేదు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధి రూ.3 కోట్లు ఇస్తున్నాం. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లు వేస్తున్నాం. ఏ మండలాన్ని అయినా పక్కనబెట్టామా? మిషన్‌ కాకతీయ కింద మండలానికి 5 చెరువుల్లో పూడిక తీస్తామని చెప్పాం. అన్ని చోట్లా అదే చేస్తున్నాం. మేం అంతా ఏకరూపత పాటిస్తున్నాం. ‘కాంగ్రెస్‌ ప్రతి దాన్ని అడ్డుకోవాలని చూస్తోంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై 196 కేసులు వేశారు. సుప్రీం కోర్టు న్యాయవాదులకు రోజుకు రూ.6 లక్షలివ్వాలి. అంత ఇచ్చే రైతులు తెలంగాణలో ఉన్నారా? పాలమూరుపైనా ఇదే పరిస్థితి. కోర్టుకు వెళ్తారు...అక్కడ కాదంటే గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు వెళ్తారు. ప్రజలు వీటిని గమనిస్తూనే ఉన్నారు’

ఇజ్రాయిల్‌ పంపి శిక్షణ ఇప్పిస్తాం

వ్యవసాయ శాఖలో వెయ్యి మంది అధికారులున్నారు. వారందరినీ ఇజ్రాయిల్‌ పంపి శిక్షణ ఇప్పిస్తాం. ఆ తర్వాత రైతులను కూడా పంపిస్తాం. క్రాప్‌ కాలనీలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనం చేస్తోంది. ఆ విషయంలో రైతు సమితులు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.

ముమ్మాటికీ సమైక్య పాలకులది నేరపూరిత నిర్లక్ష్యం

ఎన్నో విషయాల్లో తెలంగాణకు సంబంధించి సమైక్య పాలకులు నేరపూరిత నిర్లక్ష్యం చూపారు. ముమ్మాటికీ అది 100 శాతం వాస్తవం. తెలంగాణకు కేటాయించిన 1300 టీఎంసీల నీటిలో వాడింది ఎంత? 46 వేల చెరువులుంటే 4 వేల చెరువుల్లో అయినా పూడిక తీశారా? కాకతీయులు చెరువులు తవ్వితే మీ నిర్లక్ష్యం వల్ల చిన్న నీటిపారుదల వ్యవస్థ ధ్వంసం కాలేదా? ఏనాడైనా 9 గంటల విద్యుత్తు ఇచ్చారా? అందుకే కదా 23.60 లక్షల పంపుసెట్లను రూ.30 వేల కోట్లతో ఏర్పాటు చేసుకుంది? ఒక్క కరీంనగర్‌ జిల్లాలో 95 శాతం పొలాలకు సాగునీరు ఇచ్చామని చెబుతారా? మరి 3.33 లక్షల పంపుసెట్లు ఆ జిల్లాలో ఎందుకున్నట్లు? ఇవన్నీ నేరపూరిత నిర్లక్ష్యం కాదా?

జనవరి 1 నుంచి 24 గంటల విద్యుత్తు

వచ్చే జనవరి 1వ తేదీ నుంచి వ్యయసాయానికి 24 గంటలు విద్యుత్తు ఇస్తాం. ఇప్పుడు ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నాం. 24 గంటలు విద్యుత్తు వద్దంటున్నారు. నిరంతర విద్యుత్తు ఇవ్వడం వల్ల రాష్ట్రం ప్రతిష్ఠ పెరుగుతుంది. రైతులు ఆటో స్టార్టర్లను తొలగించుకోవాలి. లేకుంటే నిరంతరం బోర్డు నీటిని తోడిపోస్తే భూగర్భ జలాలు తగ్గిపోతాయి.24 గంటల విద్యుత్తు వల్ల ప్రస్తుతం ఉన్న సబ్సిడీ రూ.4,777 కోట్లు కాస్తా రూ.617 కోట్లు పెరిగి రూ.5,384 కోట్లకు చేరుకుంటుంది.జనవరి 1 నుంచి స్వర్ణ యుగంలోకి వెళ్లబోతున్నాం. ఇక జిలుగు వెలుగుల విద్యుత్తే.

వడ్డీ రాకుంటే ఇప్పటికైనా చెప్పండి

రుణ మాపీ కింద వడ్డీ రాని రైతులు ఉన్నారని చెబుతున్నారు. గత శాసనసభలోనే అలాంటి వారుంటే చెప్పండని కోరాను. ఎవరూ రాలేదు. ఒక్క రైతు ఫిర్యాదు చేయలేదు. అలాంటి పరిస్థితి ఉంటే మా ఎమ్మెల్యేలకే చెప్పేవారు కదా? ఉత్తమకుమార్‌రెడ్డి ఇస్తామన్న జాబితా ఇవ్వలేదు. మెదక్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కరవు వల్ల రైతులు రుణాలను రీషెడ్యూల్‌ చేసుకున్నారు. వారి రుణాలు మాఫీ చేయలేదని కిషన్‌రెడ్డి చెప్పారు. అలాంటి వారుంటే తప్పకుండా పరిశీలిస్తాం. అటవీ భూములు సాగుచేసే వారు 28 వేల మంది ఉన్నారని, ఆ జాబితాను మంత్రికి ఇచ్చామని సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. ఈ విషయంలో మానవతా దృకృథంతో పరిశీలిస్తాం’

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top