రబీ నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంట్!

హైదరాబాద్ : వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. రబీ నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం కేసీఆర్‌కు ప్రభాకర్‌రావు తెలిపారు.

ఇప్పటికే ఉమ్మడి మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ప్రయోగం విజయవంతమైందని ప్రభాకర్‌రావు సీఎంకు వివరించారు. వచ్చే ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల కరెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు సూర్యాపేట జిల్లాలో చివ్వెంలలో రూ. 1600 కోట్లతో 400 కేవీ సబ్‌స్టేషన్‌ను సీఎం కేసీఆర్ రేపు ప్రారంభిస్తారని ప్రభాకర్‌రావు తెలిపారు.

విద్యుత్ ఉద్యోగులను అభినందించిన సీఎం

వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య, గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరాపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 9600 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉందన్నారు. మిషన్ భగీరథ, ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నామని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించే మొదటి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లను తానే స్వయంగా ప్రారంభిస్తానని సీఎం తెలిపారు. అతి తక్కువ సమయంలో ఏర్పాట్లు చేసి ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చడానికి కృషి చేసిన ప్రభాకర్‌రావు నాయకత్వంలోని విద్యుత్ అధికారులు, ఉద్యోగులను సీఎం అభినందించారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top