ప్ర‌ధాని అభ్య‌ర్థిగా నేను సిద్ధ‌మే : రాహుల్ గాంధీ

బెర్కిలీ : వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు రాహుల్ గాంధీ తెలిపారు. 2019లో జ‌రిగే సాధార‌ణ ఎన్నిక‌ల్లో తాను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీప‌డేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. కానీ ఆ నిర్ణ‌యం కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాహుల్ గాంధీ ఇవాళ కాలిఫోర్నియాలో జ‌రిగిన స‌ద‌స్సులో మాట్లాడారు. కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీలో ఆయ‌న విద్యార్థుల‌తో త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. భ‌విష్య‌త్తులో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా చేప‌ట్టాల్సిన అంశాల‌పై ఆయ‌న మాట్లాడారు. ప్ర‌ధాని మోదీ పాల‌న ప‌ట్ల కూడా రాహుల్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. విభ‌జ‌న రాజ‌కీయాల‌తో మోదీ దేశాన్ని చీలుస్తున్నార‌ని రాహుల్ అన్నారు. త‌న‌తో ప‌నిచేస్తున్న ఎంపీల‌తోనూ మోదీ అభిప్రాయాలు పంచుకోలేర‌న్నారు. స‌భ‌ల్లో జ‌నం కోసం వివిధ ర‌కాల సందేశాల‌ను ఇవ్వ‌డంలో మోదీ దిట్ట అని, చాలా ప్ర‌భావంత‌మైన సందేశాల‌ను ప్ర‌ధాని ఇస్తార‌ని రాహుల్ అన్నారు. మోదీ ద‌గ్గ‌ర అద్భుత‌మైన నైపుణ్యం ఉందని, ప్ర‌ధాని త‌న క‌న్నా మంచి వ‌క్త‌ అన్నారు.

ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యాల వ‌ల్లే క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఆగ‌డాలు పెరిగాయ‌ని రాహుల్ అన్నారు. అందువ‌ల్లే అక్క‌డ హింస పెరిగింద‌న్నారు. రాజ‌కీయాల్లోకి యువ‌త‌ను తీసుకువ‌చ్చేందుకు పీడీపీ పార్టీ కీల‌క పాత్ర పోషించింద‌ని, కానీ మోదీ వాళ్ల‌తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని దెబ్బ‌తీసార‌న్నారు. కేవ‌లం 30 రోజుల్లోనే పీడీపీని నాశ‌నం చేశార‌ని విమ‌ర్శించారు. తాము అధికారంలో ఉన్న‌ప్పుడు క‌శ్మీర్‌లో శాంతి నెల‌కొల్పామ‌న్నారు. జ‌మ్మూక‌శ్మీర్ అంశంపై సుమారు తొమ్మిదేళ్ల పాటు మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌, మంత్రులు చిదంబ‌రం, జైరామ్ ర‌మేశ్‌ల‌తో ప‌నిచేసిన‌ట్లు రాహుల్ గుర్తు చేశారు. హింస వ‌ల్ల‌నే త‌న తండ్రి, నాన‌మ్మ‌ను కోల్పోయాన‌ని, అలాంటి హింస‌ను తాను అర్థం చేసుకోక‌పోతే మ‌రి ఎవ‌రు అర్థం చేసుకుంటార‌ని రాహుల్ ప్ర‌శ్నించారు.

త‌న‌పై ఆరోప‌ణ‌ల‌ను చేసేందుకు బీజేపీ ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను న‌డిపిస్తోంద‌న్నారు. దేశాన్ని న‌డిపిస్తున్న వారే ఆ టీమ్‌లో ఉన్నార‌న్నారు. ఓ వెయ్యి మంది కంప్యూట‌ర్ ముందు కూర్చుని త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తుంటార‌ని రాహుల్ విమ‌ర్శించారు. ఆర్టీఐని మోదీ దెబ్బ‌తీశార‌న్నారు. ప్ర‌జాస్వామ్య వాతావ‌ర‌ణంలో భార‌త్‌ ఉద్యోగాలు క‌ల్పించాల‌న్నారు. చీఫ్ ఎక‌నామిక్ అడ్వైజ‌ర్‌, పార్ల‌మెంట్ స‌ల‌హాలు తీసుకోకుండానే మోదీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని, దీని వ‌ల్ల పెద్ద న‌ష్టం జ‌రిగింద‌న్నారు. కోపం, ద్వేషం, హింస మ‌న‌ల్ని నాశ‌నం చేస్తుంద‌న్నారు. అహింస అనే సిద్ధాంతంపై దాడి జ‌రుగుతోంద‌న్నారు. చిన్న‌, మ‌ధ్య శ్రేణి వ్యాపార‌వేత్త‌లే భార‌త ఆర్థిక ప్ర‌గ‌తికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. పేద‌ల‌ను అభ్యున్న‌త స్థాయికి తీర్చి దిద్దిన భార‌త్ త‌ర‌హాలో మ‌రో ప్ర‌జాస్వామ్య దేశం లేద‌న్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top