టీఆర్ ఎస్ - టీడీపీ ఒకటే అంటున్న బీజేపీ నేత

టీడీపీ - బీజేపీల మధ్య ఉన్నది చిత్రమైన దోస్తీ అని ఇటీవల రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్న తీరుకు తాజా నిదర్శనం ఇది! 2014లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఢిల్లీలో - ఏపీలో అధికారం పంచుకుంటున్న సైకిల్ పార్టీ నేతలు - కమళనాథులు తెలంగాణ విషయంలో మాత్రం సూపర్ ట్విస్ట్ ఇస్తున్నారు. ఒక పార్టీతో మరో పార్టీ ఏ మాత్రం సంబంధం లేని రీతిలో సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండబోదని బీజేపీ నేతలు ఇటీవల అధికారికంగానే చెప్పేసిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అన్నట్లుగా తాజాగా ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ టీడీపీని తమ ప్రధాన ప్రత్యర్థి అయిన అధికార టీఆర్ ఎస్ పార్టీతో సమానంగా తేల్చేశారు.

దేశమంతా ఆగస్టు 15 - 1947న స్వాతంత్య్రమొస్తే ఆ తరువాత 13నెలల పాటు నిజాం నవాబు తన సొంత ఏలుబడితో భారత్ లో కలవకపోవడం...అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య కారణంగా దిగివచ్చి దేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ విలీనాన్ని బీజేపీ నేతలు ప్రత్యేక కోణంలో చూస్తుంటారు. అధికారికంగా ఉత్సవాలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇదే డిమాండ్ వినిపించిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడంతో బీజేపీ ఈ తీరుపై గళం విప్పుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ....అధికార పక్షమైన టీఆర్ ఎస్ ను విమర్శించే క్రమంలో మిత్రపక్షం (!) అయిన టీడీపీని సైతం వాయించేశారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ముసుగులో టీడీపీ పాలన సాగుతోందని విమర్శించారు. గతంలో టీడీపీ నేతలు చెప్పిన మాటలనే చెప్తూ విలీన దినోత్సవాన్ని పక్కనపెడుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రజల ఆకాంక్ష మేరకే తాము తెలంగాణ విమోచన యాత్ర చేపడుతున్నామని ప్రజలను చైతన్యపరుస్తూ అమరుల కుటుంబాలను కలుస్తున్నామని చెప్పారు.

తెలంగాణ సంస్కృతిని - పోరాటాలను మజ్లిస్ కు తాకట్టు పెడుతున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. నాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరపాల్సిందేనని చెప్పిన కెసిఆర్ నేడు ఆ విషయాన్ని పట్టించుకోకపోగా రజాకార్లకు వారసులుగా ఉన్న మజ్లిస్ పార్టీ నేతలతో కలిసి తిరుగుతున్నారన్నారు. ఉద్యమ పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణ వ్యతిరేకులను అధికారంలో చేర్చుకొని రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ అమరవీరులను పక్కనబెట్టి ద్రోహులను వెంటేసుకుని బంగారు తెలంగాణ చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.13నెలల పాటు దొడ్డి కొమరయ్య చాకలి అయిలమ్మ లాంటి నేతల పోరాటాల ఫలితంగా నిజాం నవాబు దిగివచ్చి దేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశారన్నారు. ఆ 13 నెలలు ప్రజలను చిత్రహింసలకు గురిచేసిన నిజాం నవాబును కేసీఆర్ సహా ప్రభుత్వ పెద్దలు పొగుడుతుండటం దురదృష్టకరమని లక్ష్మణ్ అన్నారు. కాకతీయుల వారసులమని చెప్పుకోవాల్సిన నేతలు నిజాం వారసుల మాదిరిగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ ఎస్ నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత అసలు లక్ష్యాలను విడనాడుతున్నారన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరపాల్సిందేనని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టినట్లు చెప్పారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top