గర్భం దాల్చినవాలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గర్భధారణ సమయంలో మధుమేహం ఎదురైతే గనుక దాన్ని జస్టేషినల్‌ డయాబెటీస్‌ అంటారు. అలాంటివారు గైనకాలజిస్టుతోపాటూ, ఎండోక్రైనాలజిస్టు పర్యవేక్షణలో ఉండాలి. పీసీఓఎస్‌ (పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌), అధికబరువూ, కుటుంబంలో మధుమేహం ఉన్నా ఇది రావచ్చు. ఒకవేళ గర్భధారణకు ముందే ఈ సమస్య ఉంటే వైద్యులకు ఆ మాట చెప్పాలి. ఇన్సులిన్‌ రక్తంలో చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచుతుంది. కొన్నిసార్లు క్లోమగ్రంథి ఇన్సులిన్‌ని ఎక్కువగా ఉత్పత్తి చేయలేదు. దాంతో మధుమేహం వస్తుంది. అది లేకపోవడం వల్ల రక్తంలో చక్కెరస్థాయులు పెరుగుతాయి. కాబట్టి గర్భం దాల్చినప్పుడు ఈ సమస్య ఉంటే గనుక దాన్ని అదుపులో ఉంచేలా చూసుకోవాలి. లేదంటే పుట్టబోయే పాపాయికి కూడా ప్రమాదకరమే. కడుపులో బిడ్డ బాగా బరువు పెరగడం, నెలలు నిండకుండానే కాన్పు, అబార్షన్‌ వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు పాపాయికి సరిగ్గా ప్రాణవాయువు కూడా అందదు. దాంతో నెలలు గడిచాక బిడ్డ దక్కకపోయే ప్రమాదం ఉంటుంది. తల్లికయితే మూత్రపిండాలూ, కంటి సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే నిర్లక్ష్యం చేయకూడదు.

ఆహారంలో మార్పులతోపాటూ: ముందునుంచీ సమస్య ఉన్నా.. గర్భధారణ సమయంలో ఎదురైనా కాబోయే తల్లి వైద్యులు చెప్పినట్లు అయితే మాత్రలు వేసుకోవాలి... లేదా ఇన్సులిన్‌ని తీసుకోవాలి. చాలామంది ఇన్సులిన్‌ని ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవడం వల్ల పాపాయికి ప్రమాదం అనుకుంటారు కానీ కాదు. రక్తంలో చక్కెరస్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం రావచ్చు కానీ... ఇన్సులిన్‌తో కాదు. ఒక స్త్రీకి మధుమేహం ఉండి గర్భం దాలిస్తే.. ఆమెకు ఆ సమయంలో ఇన్సులిన్‌ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడే రక్తంలో చక్కెరస్థాయులు అదుపులో ఉంటాయి. వైద్యులు ఒకవేళ దాని మోతాదు పెంచినా కూడా ధైర్యంగానే తీసుకోవచ్చు. వాస్తవానికి నెలలు గడిచేకొద్దీ ఆ అవసరం ఇంకా పెరగొచ్చు. రోజులో రెండుసార్లు తీసుకోవాల్సీ రావచ్చు. దాంతోపాటూ ఆహారంలో నియమాలూ తప్పనిసరి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేళకు తినేయాలి. రక్తంలో చక్కెరస్థాయులు తగ్గితే.. ఎదురయ్యే లక్షణాలపై కాస్త అవగాహన పెంచుకోవాలి. వ్యాయామం చేయాలి. అప్పుడే రక్తంలో చక్కెరస్థాయులు అదుపులోకి వస్తాయి. వెంట చక్కెర తీసుకెళ్తే.. ఎప్పుడయినా తగ్గినా ఇబ్బంది ఉండదు. కళ్లు తిరుగుతున్నట్టు అనిపించినా, అలసిపోయినట్లుగా ఉన్నా వెంటనే ఏదో ఒకటి తినాలి. పండ్లూ, కూరగాయముక్కలూ, తృణధాన్యాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

రక్తస్రావం కనిపిస్తోంటే...

ఈ సమస్యను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు వెరికోస్‌ వెయిన్స్‌ సమస్య జననాంగాల దగ్గర ఉన్నప్పుడు కూడా ఇలా రక్తస్రావం కనిపించడం సహజం. అలాంటప్పుడు మలవిసర్జనకు వెళ్లినప్పుడు వాచిన సిరల నుంచి రక్తస్రావం అవుతుంది. మలబద్ధకం ఉండి, బలవంతంగా మలవిసర్జనకు వెళ్లినప్పుడు కూడా రక్తస్రావం కనిపించొచ్చు. చికిత్స ఏంటంటే: ముందు రోజూ ఎనిమిది నుంచి పదిగ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నడక, యోగా, ఈత ఇలా ఏదో ఒకటి చేయడం వల్ల మలబద్ధకం అదుపులోకి వస్తుంది. పీచుశాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఓట్‌మీల్‌, బ్రౌన్‌రైస్‌, పొట్టుతీయని గోధుమలతో చేసిన బ్రెడ్‌, పాస్తా లాంటివి తినాలి. తాజా పండ్లను చెక్కుతో సహా తీసుకోవాలి. అలాగే కిస్‌మిస్‌, ఆప్రికాట్లూ, క్యారెట్‌, ముల్లంగి క్యాబేజీ లాంటివి వీలైనంత ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం అదుపులోకి వస్తుంది. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినేలా చూసుకోవాలి. మలవిసర్జన మార్గంలో నెత్తురు గడ్డకట్టి ఉన్నా కూడా ఇలా అవుతుంది కాబట్టి నివారించేందుకు వైద్యులు క్రీంలు సూచిస్తారు. వెరికోస్‌ వెయిన్స్‌ ఉన్నచోట అప్పుడప్పుడూ ఐస్‌ప్యాక్‌లు పెట్టడం వల్ల కొంత ఉపశమనంగా ఉంటుంది.

అధిక బరువూ సమస్యే...

చాలామంది మహిళలు ఈ సమయంలో ఇద్దరి కోసం తినడం వల్ల ఐదారు నెలలు గడిచేసరికి బరువు పెరుగుతారు. గర్భధారణకు ముందు బరువుంటే గనుక ఒకసారి చూసుకోవాలి. మొదటి నెల నుంచీ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అధికబరువున్నవారిలో అబార్షన్‌ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే గుండె జబ్బులూ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందీ, అధికరక్తపోటు, మధుమేహం, నిద్రపట్టక అసౌకర్యం వంటి సమస్యలూ తప్పవు. పైగా ఇలాంటివారికి ఎక్కువగా సిజేరియన్‌ చేయాల్సి రావచ్చు. బాగా బరువు పెరిగితే గనుక స్కానింగ్‌ సమయంలో పాపాయి ఆరోగ్యాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవచ్చు. దాంతో పాపాయికి సంబంధించిన సమస్యలు తెలియక కొన్నిసార్లు తొమ్మిది నెలలు గడిచాక బిడ్డ గర్భసంచిలోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పరిష్కారం ఏంటీ: గర్భం దాల్చాలనుకున్నప్పుడే బరువును అదుపులో ఉంచుకునేలా చూసుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇద్దరి కోసం కాకుండా ఒకరి కోసం తినాలి. మితంగా, ఎక్కువసార్లు తినాలి. తృణధాన్యాలు తీసుకుంటే పొట్టనిండినట్లు ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. పండ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

నెలలు నిండకుండానే నొప్పులా...

కొందరికి ఎనిమిదో నెలలోనే నొప్పులు వస్తున్నట్లు అనిపిస్తాయి. దాంతో అప్పటికప్పుడు కంగారుపడి వైద్యుల దగ్గరకు వెళ్తారు. కానీ అన్నిసార్లు అవి ప్రసవ నొప్పులు కాకపోవచ్చు. వాటిని బ్రాక్సట్‌ హిక్స్‌ కాంట్రాక్షన్స్‌ అంటారు. గర్భాశయ కండరాలు పట్టేసినట్టు అయినప్పుడు ఇలాంటి నొప్పులు వస్తాయి. అయితే వాటిని అర్థంచేసుకుంటే గనుక ప్రసవనొప్పులా కాదా అనేది అంచనా వేయొచ్చు పరిష్కారం: నొప్పులు వచ్చి ఆగిపోతే... భయపడాల్సిన అవసరంలేదు. కొన్నిసార్లు డీహైడ్రేషన్‌ వల్ల కూడా కండరాలు పట్టేసి ఈ నొప్పులు ఎదురవుతాయి కాబట్టి ఆ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. చాలామంది కాఫీ లాంటివి తాగుతారు కానీ.. తీసుకోకపోవడమే మంచిది. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. బాత్రూంకి వెళ్లిరావడం మంచిది. ఎక్కువసేపు మూత్రవిసర్జన చేయకపోయినా కూడా ఈ సమస్య ఎదురుకావచ్చు. వాస్తవానికి ప్రసవ నొప్పులు నెమ్మదిగా మొదలై.. క్రమంగా పెరుగుతాయి. ఆగిఆగి వస్తూనే ఉంటాయి. కానీ ఈ తరహా నొప్పులు వచ్చి ఆగిపోవచ్చు. కాబట్టి ఇలాంటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల తగ్గిపోవచ్చు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top