అమ్మకు... అసభ్య సందేశాలు!

నేనిప్పుడు ఇంటర్‌ చదువుతున్నా. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. ఆయన ఉద్యోగం అమ్మకు వచ్చింది. ఈ మధ్యే మా అమ్మ ఫోనులో చూస్తే కొన్ని అసభ్యకర మెసేజీలు కనిపించాయి. మా అమ్మ ఆఫీసులో పని చేసే ఆయన నంబర్‌ అని తెలుసుకున్నాను. ఈ విషయం అమ్మ నాకు చెప్పడానికి సంకోచిస్తోంది. నేను కూడా అమ్మతో దీని గురించి అడగలేకపోతున్నాను. అమ్మా కుమిలిపోతోందని అర్థమవుతోంది. ఈ మధ్య ప్రతి విషయానికి నేను ఒంటరిదాన్నంటూ బాధపడుతోంది. నేను ఎవరితోనైనా చెప్పి ఆయన్ని తిట్టిద్దామంటే ఈ విషయాన్ని మరింత పెద్దది చేసినట్లు అవుతుందోమోనని భయంగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి?
- ఓ సోదరి

చిన్న వయసులోనే భర్త చనిపోయినా... మీరే లోకంగా బతుకుతున్న మీ అమ్మగారిని ఆమె మనోధైర్యమే ఇన్నాళ్లూ ముందుండి నడిపించింది. ఆమె అన్ని సంవత్సరాల నుంచీ కష్టాలను ఎలా భరించిందో తెలియదు. కానీ, ఇన్నాళ్లకు ఆమె మనోవేదన మీ కళ్లకు కనిపించింది. కూతురు ఎదుగుతోన్న సమయంలో అసభ్యకరమైన సందేశాలతో ఇబ్బంది పెడుతోన్న వ్యక్తి విషయం ఆమెను కలచివేస్తోంది. ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కే దారి తెలియకపోవడమే ఆమెకు ఒంటరితనం అనే ఆలోచన చేరువకావడానికి కారణం కావొచ్చు. అదే నిస్సహాయతగా భావిస్తున్నారు. మీ అమ్మగారి మనోవేదనను మీరు సరిగానే అర్థం చేసుకున్నారు. ఆమెను దాన్నుంచి బయటపడాలనే మీ తపన కూడా న్యాయమైందే. కానీ ఆవిడ మీతో నేరుగా పంచుకోలేకపోవడానికి మీకా వయసూ, పరిణతీ రాలేదనుకోవచ్చు. ఇప్పుడిప్పుడే లోకం తెలుసుకుంటున్న మీకు ఈ విషయం చెప్పి బాధపెట్టడం ఇష్టం లేకా కావొచ్చు. అందుకే ఆ విషయాన్ని మీకు చెప్పట్లేదు. ఎవరికైనా చెబితే సమస్య మరింత ముదురుతుందనే భయం కూడా ఉండొచ్చు. ఇంతగా సంకోచించాల్సిన అవసరం లేదు. ముందుగా ఆమెతో మాట్లాడండి. ఇన్నాళ్లూ ఆమెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు కాబట్టే ఇప్పటివరకూ జీవితం హాయిగా సాగిపోయిందనే విషయం గుర్తుచేయండి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దాటి వచ్చేశామనీ సానుకూలంగా చెప్పండి. ఆవిడలో మనోధైర్యాన్ని నింపండి. అంతేకాదు ఈ సమయంలో మీరు పరిణతితో తన వేదనని అర్థం చేసుకోగలరన్న నమ్మకాన్ని ఇవ్వగలగాలి. అప్పుడే ఆవిడకు కాస్త ధైర్యం వస్తుంది. మీ ఇద్దరూ మాట్లాడుకున్నాక ఓ నిర్ణయానికి రండి. ఈ విషయాన్ని బహిరంగంగా అందరికీ చెప్పకపోయినా కుటుంబ సభ్యుల్లో అమ్మను అర్థం చేసుకోగల వ్యక్తులతో పంచుకోండి. కచ్చితంగా మీ సమస్యకో ముగింపు వస్తుంది. ఇక అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారని చెబుతున్నారు. వాటిని కనిపెట్టేందుకూ, నియంత్రించేందుకూ మన పోలీసుశాఖలో పకడ్బందీ వ్యవస్థ ఉంది. మీరు వారికి ఫిర్యాదు చేయవచ్చు. శ్రేయోభిలాషుల సాయంతో మీరు ఆ నిర్ణయం తీసుకోండి. పరిస్థితి చేయిదాటుతుందని అనుకున్నప్పుడు అటువంటి చర్యలకూ వెనుకాడవద్దు. ఈ సమస్య అంతా ఆమె పనిచేసే కార్యాలయంలో మొదలైంది. ఆమె పై అధికారులూ, తోటి ఉద్యోగులూ ఈ విషయంలో అవసరమైన నైతిక బలం ఇవ్వగలిగితే సమస్యను అధిగమించడం సులువే. కాబట్టి భయపడక్కర్లేదు. అన్నింటికన్నా ముందు మీరు చేయాల్సింది ఆమెలో మనోధైర్యం నింపడమే.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top