అల్‌బకర తో అందంగా..

అందాన్ని కాపాడుకునే విషయంలో రుతువులను అనుసరించి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన చర్మ సౌందర్యం దెబ్బతినకుండా ఉంటుంది. దీనికి ఆయా సీజన్‌లలో దొరికే పండ్లను తీసుకోవడం కూడా ఒక మార్గమే. వర్షరుతువులో అందుబాటులో ఉండే పండ్లలో అల్‌బకర ఒకటి. ఇది చర్మ సౌందర్యాన్నే కాకుండా కేశసంపదను సైతం వన్నె తరగకుండా కాపాడుతుంది. మరి అల్‌బకర వల్ల మనకు కలిగే సౌందర్యపరమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..

ఎర్రటి రంగులో నిగనిగలాడుతూ కనిపించే అల్‌బకరను తినడం ద్వారా శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఇందులో విటమిన్ ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘కె’, బీటాకెరోటిన్, పొటాషియం, ఐరన్, క్యాల్షియం మెగ్నీషియం లాంటివి పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు ఈ పండు నుంచి అధికంగా లభిస్తాయి.

ముడతలు పడకుండా..

అల్‌బకరలో ఉండే విటమిన్ ‘ఇ’, బీటాకెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మకణాలను ఫ్రీరాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. అలాగే దీనిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల, అవి వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది.

ఎర్రటి పెదవులకు..

కొంతమంది పెదవులు నల్లగా, అందవిహీనంగా ఉంటాయి. అలాంటి వారు అల్‌బకరలను తినడం ద్వారా వాటి అందాన్ని పెంచుకోవచ్చు. దీంతోపాటు అల్‌బకర తొక్కతో పెదవులను కాసేపు సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే నల్లగా ఉన్న పెదవులు ఎర్రగా, మృదువుగా తయారవుతాయి.

సూర్యరశ్మి నుంచి రక్షణ..

సూర్యరశ్మి ప్రభావం వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోయి ముడతలు పడే అవకాశం ఉంటుంది. ఇందులోని అతినీలలోహిత కిరణాల వల్ల చర్మసంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంటుంది. దీనివల్ల చర్మం అందవిహీనంగా కనిపిస్తుంది. అల్‌బకరలో అధిక మొత్తంలో లభించే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ‘సి’, అందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సూర్యరశ్మి ప్రభావం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే దీనిలోని ఇతర పోషకాలు చర్మం మృదుత్వాన్ని కోల్పోకుండా కాపాడతాయి.

మొటిమలు రాకుండా..

వర్షాకాలంలో గాల్లోని తేమ, కాలుష్యం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. అల్‌బకరలోని ఔషధ గుణాలు రక్తాన్ని శుద్ధి చేసి టాక్సిన్లను, వ్యర్థపదార్థాలను శరీరం నుంచి వెలుపలికి పంపిస్తాయి. ఫలితంగా మొటిమలు రాకుండా ఉంటాయి.

మచ్చలకు..

మొటిమలను గిల్లడం, దెబ్బలు తగలడం లాంటి కారణాల వల్ల ఆయా ప్రదేశాల్లోని చర్మకణాలు పాడైపోతాయి. తిరిగి అక్కడ చర్మకణాలను ఉత్పత్తి చేయడానికి చర్మం కొలాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే కొన్నిసార్లు కొలాజెన్ తక్కువగా విడుదలవడం వల్ల అక్కడ చర్మకణాలు పూర్తిగా ఏర్పడవు. ఫలితంగా మచ్చలు ఏర్పడతాయి. అయితే అల్‌బకరను తినడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టచ్చు. దీనిలోని ఔషధగుణాలు చర్మానికి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీనివల్ల తగినంత కొలాజెన్ విడుదలవుతుంది. ఫలితంగా చర్మంపై ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.

కురుల సంరక్షణకు..

జుట్టు రాలడానికి రక్తంలోని ఫ్రీరాడికల్స్, చుండ్రు, పోషకాహార లోపం వంటివి కారణం కావచ్చు. అల్‌బకరలోని విటమిన్ ‘ఇ’, యాంటీఆక్సిడెంట్లు రక్తంలోని ఫ్రీరాడికల్స్‌ని నివారిస్తాయి. అలాగే విటమిన్ ‘సి’ చుండ్రును నివారిస్తుంది. అలాగే దీనిలోని పోషకాలు జుట్టుపై హార్మోన్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా కుదుళ్లు దృఢంగా మారి, జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

ఇవండీ.. అల్‌బకర తినడం వల్ల కలిగే సౌందర్యపరమైన ప్రయోజనాలు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే.. ఆరోగ్య, సౌందర్యపరమైన ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని అల్‌బకరను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మూత్రనాళ సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని తగినంత మోతాదులో మాత్రమే ఆహారంగా స్వీకరించాలి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top