యుద్ధం శరణం సినిమా రివ్యూ

విడుదల తేదీ : సెప్టెంబర్ 8, 2017
నటీనటులు : నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి
దర్శకత్వం : కృష్ణ మరిముత్తు
నిర్మాత : సాయి కొర్రపాటి
సంగీతం : వివేక్ సాగర్
రేటింగ్ : 2.25/5

నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘యుద్ధం శరణం’. ఈ సినిమా ద్వారా కృష్ణ మరిముత్తు దర్శకుడిగా పరిచయమయ్యాడు. వారాహి చలన చిత్రం బేనర్‌పై సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన రొమాంటి థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ:

నాయక్(శ్రీకాంత్) అనే రౌడీ సిటీలో బాంబు పేలుళ్లు జరుపుతాడు. అసలు అవి ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఎన్ఐఏ ఆఫీసర్ జె.డి.శాస్త్రి(మురళీశర్మ)ని నియమిస్తుంది. మరోవైపు అర్జున్(నాగచైతన్య) అనే కుర్రాడు తన అందమైన కుటుంబంతో.. ప్రేమించిన అమ్మాయితో జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంటాడు. తన తల్లిదండ్రుల పెళ్లిరోజున సర్‌ప్రైజ్ ప్లాన్ చేసి వారిని సంతోషపెడతాడు. అయితే గుడికి అని బయలుదేరిన అర్జున్ తల్లిదండ్రులు ఇంటికి తిరిగిరారు. దీంతో అర్జున్ వారిని వెతకడం కోసం తిరుగుతూ ఉంటాడు.

ఇంతలో వారు శవాలుగా కనిపిస్తారు. అది చూసి తట్టుకోలేపోతాడు అర్జున్. యాక్సిడెంట్‌లో ఇద్దరూ చనిపోయారని పోలీసులు చెబుతారు. అయితే అది యాక్సిడెంట్ కాదని తన తల్లితండ్రులను ఎవరో కావాలనే చంపారనే విషయం అర్జున్‌కి తెలుస్తుంది. అప్పుడు అర్జున్ ఏం చేశాడు..? ఎవరితో ఎలాంటి గొడవలు లేని అర్జున్ ఫ్యామిలీకి వచ్చిన సమస్య ఏంటి..? అర్జున్ తల్లిదండ్రుల చావుకి నాయక్‌కు ఏమైనా సంబంధం ఉందా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

ప్లస్ పాయింట్స్ :

హ్యాపీగా వెళ్ళిపోతున్న ఒక మామూలు కుర్రాడి ఫ్యామిలీ లైఫ్ లోకి సంబంధం లేకుండా ఒక రౌడీ ఎంటర్ అయ్యి మొత్తం వారి సంతోషాన్ని దూరం చేస్తే, ఆ కుర్రాడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని దర్శకుడు ఎంచుకొని చెప్పిన విధానం ఆకట్టుకుంది. ఇక మొదటి అర్ధం భాగంలో వచ్చే ఫ్యామిలీ అనుబంధం, వారి మధ్య చిన్న చిన్న ఎమోషన్స్ ప్రెజెంట్ చేస్తూ కొంత ఆకట్టుకునే విధంగా దర్శకుడు నడిపించాడు. అలాగే ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్ కూడా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ సెకండ్ హాఫ్ మీద చాలా హైప్ క్రియేట్ చేస్తుంది. కథలో భాగంగా వచ్చే ఎమోషన్స్ తో ఫస్ట్ హాఫ్ లో పండించిన వినోదం కూడా ప్రేక్షకులకి భాగా కనెక్టవుతుంది.

ఇక చాలా ఏళ్ల తర్వాత శ్రీకాంత్ చేసిన విలన్ పాత్ర సినిమాలో మేజర్ హైలెట్. అతను తన కళ్ళతో విలనిజాన్ని చూపిస్తూ చేసిన నాయక్ పాత్ర ఆకట్టుకుంది. ఇక నాగ చైతన్య పాత్ర చూసుకుంటే సింపుల్ అండ్ స్వీట్ లైఫ్ తో హ్యాపీగా వెళ్ళిపోయే యువకుడుగా, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి చావుకి కారణం అయిన వాడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి, తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి అతనితో యుద్ధం చేయడానికి సిద్ధమైన కొడుకుగా రెండు రకాల ఎమోషన్స్ ని బాగా చూపించాడు. ఇక హీరోయిన్ గా లావణ్య పర్వాలేదనిపించుకుంది. ఇక సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మురళీ శర్మ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు కూడా ఎవరి పాత్ర పరిధి మేరకు వారు భాగానే చేశారు.

మైనస్ పాయింట్ :

సినిమాలో ప్రధాన లోపం ఎమోషన్ లోపించడం. మొదటి అర్ధ భాగం చూసిన తర్వాత ప్రేక్షకులు చాలా ఎక్స్పక్టేషన్ పెట్టుకుంటారు. సెకండ్ హాఫ్ ఇంకా గొప్పగా, మైండ్ గేమ్ అద్బుతంగా ఉంటుందని ఆశిస్తారు. అయితే ఈ విషయంలో దర్శకుడు తడబాటు పడ్డారు. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే ఒక పెద్ద రౌడీని చాలా ఈజీగా హీరో ట్రాప్ చేసేయడం అంత కన్విన్సింగ్ గా అనిపించదు.

ఇంటెలిజెంట్ గేమ్ అని చూపిస్తూ స్క్రీన్ ప్లేలో ఏదో చేయడానికి ట్రై చేసినా, అది కథని కన్విన్స్ చేయడానికి చేసినట్లు ఉంది తప్ప ప్రేక్షకుడుని కన్విన్స్ చేసే విధంగా మాత్రం లేదు. తల్లిదండ్రులు చనిపోతే హీరో పడే ఒక మానసిక సంఘర్షణని ఎలివేట్ చేయడంలో దర్శకుడు ఎంచుకున్న కథనం చాలా సింపుల్ గా ఉంటుంది. ఆడియన్స్ కోరుకునే పోరాటం సెకండ్ హాఫ్ లో కనిపించకపోవడం కాస్త నిరాశపరుస్తుంది. మంచి కథని ప్రెజెంట్ చేయడంలో స్క్రీన్ ప్లేలో చేసిన పొరపాటు సెకండ్ హాఫ్ ని పూర్తిగా క్రిందికి దించేస్తుంది.

సాంకేతిక విభాగం :

వారాహి సంస్థ ఎప్పటిలాగే తన నిర్మాణ విలువలతో ఆకట్టుకుంది. అయితే దర్శకుడు కృష్ణ ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్స్ మీద నడిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ కంటే ఇంటలిజెన్స్ ముఖ్యం. అందులో దర్శకుడు సరైన పనితనం చూపించలేకపోయారు. ఒక పెద్ద రౌడీ, ఒక మామూలు కుర్రాడు మధ్య కథ నడిపించే ఇంటెలిజెంట్ గేమ్ చాలా ఇంటెన్సిటీతో ఉండాలని ఆడియన్స్ కోరుకుంటారు. అందులో దర్శకుడు అనుభవలేమి కొట్టోచ్చినట్లు కనిపిస్తుంది.

మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ పాటల్లో క్లాసిక్ టచ్ చూపించి, అతని భవిష్యత్తుకి స్ట్రాంగ్ పిల్లర్ వేసుకున్నాడు. ఇక బ్యాగ్రౌండ్ కూడా కొన్ని ఎమోషన్స్ లో తప్ప ఓవరాల్ పర్వాలేదు. ఇక సినిమాటోగ్రఫీ భాగానే ఉంది. ఎడిటింగ్ లో పెద్దగా పని చెప్పడానికి ఏమీ లేదు. స్క్రీన్ ప్లే మ్యాజిక్ కోసం కొన్ని అనవసరమైన సన్నివేశాలు పెట్టారు. వాటికీ కత్తెర వేసుండాల్సింది.

తీర్పు :

ఇప్పుడున్న యువ హీరోల్లో స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వచ్చి కాస్త కొత్తదనం ఉన్న పాత్రలు చేయడానికి చైతూ ఎప్పుడు ఆసక్తి చూపిస్తాడు. ఈ సినిమా అతని కెరియర్లో మరో డిఫరెంట్ సినిమా అవుతుంది. నటన పరంగా అతను పరవాలేదనిపించుకున్నాడు. ఇక శ్రీకాంత్ విలన్ గా ఒకే అనిపించుకున్నా ఇది అతనికి ఎంత వరకు ప్లస్ అవుతుందో చెప్పలేం. ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆద్యంత ఆకట్టుకున్నా, అసలైన హీరో, విలన్ రివెంజ్ డ్రామాలో అనుకున్నంత స్థాయ తీవ్రత లేక రొటీన్ రివెంజ్ డ్రామాగా సినిమా మిగిలింది. అలాగే కథలో లవ్ స్టొరీ, కామెడీకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక మామూలు కుర్రాడు తన చుట్టూ ఉన్న చిన్న లైఫ్ గురించే ఆలోచిస్తాడు. అలా కాదని హద్దులు దాటి ఆలోచిస్తే, ఎలాంటి సరిహద్దులు అయినా చేరిపేస్తాడు అనే విషయాన్ని కథతో చెప్పాలనుకునే ప్రయత్నం అయితే బాగుంది. కానీ ఆ ప్రయత్నం ఇంకా బెటర్ గా చేసుంటే బాగుండేది. అంటే యుద్ధం బాగున్నా దానికి వేసిన వ్యూహం వీక్ గా ఉంది. మొత్తంగా చెప్పాలంటే రివెంజ్ డ్రామాలను ఎక్కువగా ఇష్టపడేవారికి ఈ సినిమా ఓకే కానీ కొత్తదనం ఆశించేవారికి ఎంజాయ్ చేయడానికి ఇందులో పెద్దగా ఏం దొరకదు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top