మెగా హీరోల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ బెనిఫిట్ షోలకు హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వకపోవడంపై తలెత్తిన వివాదం అంత సులువుగా సమసిపోయేలా లేదు. దీనిపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషనే పెడుతున్నారు. తమ ఫ్యామిలీ హీరోల్ని మాత్రమే టార్గెట్ చేసుకుని.. బెనిఫిట్ షోలకు గండి కొడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. గత ఏడాది కాలంలో మెగా హీరోల బెనిఫిట్ షోలకు మాత్రమే అడ్డుకట్ట వేశారని.. మిగతా హీరోల సినిమాలకు ఆ ఇబ్బంది తలెత్తలేదని వారు ఆరోపిస్తున్నారు.

గత కొన్నేళ్ల నుంచి హైదరాబాద్‌లో ప్రతి పెద్ద సినిమాకూ బెనిఫిట్ షోలు పడుతున్నాయి. రవితేజ.. సాయిధరమ్ తేజ్ లాంటి హీరోల సినిమాలకు కూడా బెనిఫిట్ షోలు పడ్డాయి. ఐతే ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో బెనిఫిట్ షోలు ఆగిపోవడం అన్నది ముందుగా జరిగింది అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమాకే. ఈ చిత్రానికి పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు కానీ.. పోలీసులు చివరి నిమిషంలో పర్మిషన్ ఇవ్వకపోవడంతో షోలు పడలేదు. ఆ తర్వాత రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతి రాలేదు. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’కి కూడా చివరి నిమిషం వరకు సస్పెన్స్ నడిచింది. చివరికి ఒకట్రెండు థియేటర్లకు మాత్రమే పర్మిషన్ లభించింది. ఇప్పుడు పవన్ సినిమా ‘కాటమరాయుడు’కు ముందు పదికి పైగా బెనిఫిట్ షోలన్నారు. ఐతే ఊరించి ఊరించి చివరికి షోలే లేకుండా చేశారు. అనుమతి నిరాకరించారు.

కూకట్ పల్లి భ్రమరాంభలో షోను చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడంతో అభిమానులు తెల్లవారుజామున రోడ్డు మీదికి వచ్చి పెద్ద గొడవే చేశారు. ట్రాఫిక్‌ను కూడా అడ్డుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. మెగా హీరోల సినిమాలకు ఇలా అడ్డం పడుతూ.. గౌతమీపుత్ర శాతకర్ణి, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకునే వీలు కల్పించడం.. మహేష్ మూవీ ‘బ్రహ్మోత్సవం’కు ఉదయం అన్ని థియేటర్లలోనూ అదనపు షో వేసుకునేందుకు అనుమతి ఇవ్వడం ఏంటని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తమ హీరోల సినిమాలకు అనుమతి నిరాకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top