గొప్ప నటులను అందించిన కర్ణాటక రాష్ట్రానికి విజయ్‌ దేవరకొండ ధన్యవాదాలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అనుష్క శెట్టి, ఐశ్వర్య రాయ్‌ లాంటి గొప్ప నటులను అందించిన కర్ణాటక రాష్ట్రానికి విజయ్‌ దేవరకొండ ధన్యవాదాలు చెప్పారు. ప్రముఖ కన్నడ నటుడు గణేశ్‌ నటించిన ‘చమక్‌’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి విజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘హీరోగా నా తొలి చిత్రం (పెళ్లిచూపులు) వంద రోజులు ఆడింది. ఆ గర్వంతో ఓసారి గోల్డెన్‌ స్టార్‌ గణేశ్‌ గురించి గూగుల్‌లో వెతుకుతున్నాను. ఆయన నటించిన చిత్రం 800 రోజులు ఆడిందని తెలిసి షాకయ్యాను’ అని గణేశ్‌ స్టార్‌డంను కొనియాడారు.

అనంతరం భారత్‌కు గొప్ప నటులు, క్రికెటర్లను పరిచయం చేసిన కర్ణాటక గురించి మాట్లాడుతూ.. ‘కర్ణాటక అంటే రాహుల్‌ ద్రవిడ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌, అనిల్‌ కుంబ్లే, వెంకటేశ్‌ ప్రసాద్‌. మనందరికీ కర్ణాటక అంటే చాలా ఇష్టం. ఎందుకంటే 40 శాతం భారత క్రికెటర్లు ఈ రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. రజనీకాంత్‌, ఐశ్వర్య రాయ్‌ కూడా ఇదే రాష్ట్రానికి చెందినవారు. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క శెట్టి కూడా ఇదే రాష్ట్రంలో పుట్టిన సూపర్‌స్టార్‌. ఇప్పుడు రష్మిక మందన కూడా మా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు.’

‘ఇప్పుడు వస్తున్న కన్నడ చిత్రాల్లోని కంటెంట్‌, స్టైల్‌ను చూసి నేను ఎనర్జిటిక్‌గా ఫీలవుతాను. ఇటీవల శివరాజ్‌కుమార్‌ నటించిన ‘మఫ్టి’ చిత్రం ట్రైలర్‌ చూశాను. ఆ సినిమా చూశాక నాకూ మఫ్టి లాంటి గ్యాంగ్‌స్టర్‌ చిత్రంలో నటించాలని అనిపించింది.’ అని చెప్పుకొచ్చారు విజయ్‌.

కన్నడ దర్శకుడు సుని ‘చమక్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క విజయ్‌ కథానాయకుడిగా ‘ఏ మంత్రం వేశావె’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విజయ్‌కి జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top