కుర్రాడిని రాజుగారే రక్షించాలి

ఉయ్యాల జంపాల.. సినిమా చూపిస్త మావ.. కుమారి 21 ఎఫ్ లాంటి వరుస హిట్లతో చాలా ప్రామిసింగ్ గా కనిపించాడు యువ కథానాయకుడు రాజ్ తరుణ్. హ్యాట్రిక్ హిట్లతో అతడి పారితోషకం కోటికి చేరిపోయినట్లు వార్తలొచ్చాయి. కానీ విజయాలు సాధించడం కంటే వాటిని నిలబెట్టుకోవడం కష్టమని రాజ్ తరుణ్ విషయంలో రుజువైంది. మొదట్లో అన్నీ కలిసొచ్చి వరుస విజయాలందుకున్న రాజ్.. తర్వాత వరుసబెట్టి ఫ్లాపులిచ్చాడు. ఈ ఏడాదైతే.. ‘రంగులరాట్నం’.. ‘రాజుగాడు’ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. దీంతో రాజ్ ఫాలోయింగ్.. మార్కెట్ మొత్తం దెబ్బ తినేసింది. ఇప్పుడు అత్యవసరంగా ఓ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడతను. అతడి ఆశలన్నీ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘లవర్’ మీదే ఉన్నాయి.

‘లవర్’ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అసలు వార్తల్లోనే లేకుండా పోయింది. సైలెంటుగా ఈ చిత్ర షూటింగ్ చేసుకుంటూ పోయారు. మధ్యలో ఏ అప్ డేట్ కూడా ఇవ్వలేదు. సినిమా దాదాపుగా పూర్తయిందట. తాజాగా టైటిల్ లోగోను సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఇచ్చింది. శనివారం ఉదయం ఫస్ట్ లుక్ లాంచ్ చేయనున్నారు. జులైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందట. ‘అలా ఎలా’ సినిమాతో మెప్పించిన అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాత అనిల్ సుంకర ప్రొడక్షన్లో వరుసగా నాలుగు సినిమాలు చేసి ఎదురు దెబ్బలు తిన్న రాజ్ తరుణ్.. ఇప్పుడు దిల్ రాజును నమ్ముకున్నాడు. సినిమాల ఎంపికలో చక్కటి అభిరుచి చూపించే రాజు.. ఫలితాల్ని అంచనా వేయడంలో దిట్టగానూ పేరు తెచ్చుకున్నాడు. ఆయన ప్రెడిక్షన్లు కూడా కొన్నిసార్లు తేడా కొడుతుంటాయి కానీ.. ‘లవర్’ ఆ జాబితాలో చేరదని ఆశిస్తున్నాడు రాజ్.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top