అజ్ఞాతవాసి మూవీ రివ్యూ

తారాగణం : పవన్ కళ్యాణ్, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూల్, ఖుష్బూ, బొమన్ ఇరానీ, మురళీ శర్మ, రావు రమేష్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : రాధాకృష్ణ
రేటింగ్ : 2.5/5

కొన్ని కాంబినేషన్లకు పరిచయాలు.. ఉపోద్ఘాతాలు అక్కర్లేదు. అలాంటి వాళ్లలో పవన్‌కల్యాణ్‌-త్రివిక్రమ్‌ ముందు వరుసలో ఉంటారు. వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటేనే అంచనాలను అందుకోవడం కష్టం. ఈ విషయాన్ని ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ నిరూపించాయి. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’తో మరోసారి తమ సత్తా చాటేందుకు వచ్చారు. అంతేకాదు ఇది పవన్‌ నటించిన 25వ చిత్రం కూడా కావడం మరో విశేషం. టీజర్‌ను చూసి క్లాసికల్‌ మూవీ అనుకున్న వారికి ట్రైలర్‌లో ‘ఓ మినీ యుద్ధమే’ చూపించి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు. మరి సంక్రాంతి బరిలో దిగిన ‘అజ్ఞాతవాసి’ కథేంటి? పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ కొట్టిందా?

కథ :

ఏబీ గ్రూప్ అథినేత గోవింద భార్గవ్ తో(బొమన్ ఇరానీ) పాటుగా అతడి వారసుడిని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. దీంతో గోవింద భార్గవ్ భార్య ఇంద్రాణీ (ఖుష్బూ) కంపెనీ వ్యవహారాలు చూసుకునేందుకు అస్సాం నుంచి బాలసుబ్రహ్మణ్యం (పవన్ కళ్యాణ్ ) అనే వ్యక్తిని తీసుకువస్తుంది. ఏబీ గ్రూప్ లో మేనేజర్ గా జాయిన్ అయిన బాలసుబ్రహ్మణ్యం... గోవింద భార్గవ్ వారసుడి హత్యకు కారణాలను అన్వేషించటం మొదలు పెడతాడు. (సినిమా రివ్యూ) ఈ ప్రయత్నంలో బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించాడా..? అసలు ఈ హత్య చేసింది ఎవరు..? గోవింద్ భార్గవ్, సీతారామ్‌ (ఆది పినిశెట్టి)లకు సంబంధం ఏంటి..? హత్యకు కారణాలు తెలుసుకోవడానికి ఇంద్రాణీ బాలసుబ్రహ్మణ్యాన్నే ఎందుకు ఎంచుకుంది..? బాలసుబ్రహ్మణ్యం.. అభిషిక్త భార్గవ్‌ ఎలా అయ్యాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తనకు అలావాటైన మేనరిజమ్స్, స్టైల్స్‌ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ లో పవన్ లుక్స్, యాక్టింగ్ అభిమానులతో విజిల్స్ వేయిస్తాయి. సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ లోనూ పవన్ తన పరిణితి చూపించాడు. ఇక తనదైన రొమాంటిక్, కామెడీ టచ్ తో సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు. (సినిమా రివ్యూ) హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్నంతలో పరవాలేదనిపించారు. అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన సీనియర్ నటి ఖుష్బూ తన స్థాయికి తగ్గ పాత్రలో కనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో ఖుష్బూ నటనన సినిమాకు ప్లస్ అయ్యింది. స్టైలిష్ విలన్ గా ఆది పినిశెట్టి మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ పాత్రలో ఎక్కువగా సరైనోడు సినిమాలోని వైరం ధనుష్‌ ఛాయలు కనిపించాయి. బొమన్ ఇరానీ, రావూ రమేష్, మురళీ శర్మలు పాత్రలకు తమవంతు న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్ :

పవన్‌ కల్యాణ్‌ పాత్ర చిత్రీకరణ
విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు
ద్వితీయార్ధంలో కొన్ని హాస్య సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా ‘అత్తారింటికి దారేది’ గుర్తుకు రావడం
క‌థ‌, కథనాలు బలంగా లేకపోవడం

సాంకేతికంగా:

సంగీత దర్శకుడిగా తెలుగులో అనిరుధ్‌ తొలి సినిమా అయిన ‘అజ్ఞాతవాసి’ గ్రాండ్‌ లాంచ్‌ అనే చెప్పాలి. చక్కని పాటలను అందించాడు. నేపథ్య సంగీతం పర్వాలేదు. అక్కడక్కడా మెరుపులు కనిపిస్తాయి. వి.మణికందన్‌ కెమెరా పనితనం బాగుంది. పవన్‌కల్యాణ్‌ పరిచయ సన్నివేశం సినిమాకు ప్రధాన ఆకర్షణ. యాక్షన్ సన్నివేశాలను ముఖ్యంగా బల్గేరియాలో ఛేజింగ్‌ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం బాగుంది. ‘మాటల మాంత్రికుడి’గా పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్‌ మరోసారి తన మార్కును చూపించాడు. అయితే దర్శకుడి కన్నా త్రివిక్రమ్‌లోని రచయితకు ఎక్కువ మార్కులు పడతాయి. ఇక శర్మ-వర్మ సంభాషణల్లో త్రివిక్రమ్‌ శైలి హాస్యం నూటికి నూరు పాళ్లు కనిపిస్తుంది. ప్ర‌థ‌మార్ధంలో వచ్చే డైలాగుల్లో డెప్త్‌ ఉంది. ‘విచ్చలవిడిగా నరికేస్తే హింస... విచక్షణతో నరికేస్తే ధర్మం’ వంటి డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. అయితే క‌థ‌, క‌థ‌నాల‌పై మ‌రింత దృష్టి పెడితే బాగుండేది. పవన్‌-త్రివిక్రమ్‌ హిట్‌ కాంబినేషన్‌ కావడంతో నిర్మాత ఎక్కడా రాజీపడలేదు. ప్రతీ సన్నివేశంలో రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top